Idream media
Idream media
సినిమాల విడుదల సమయంలో థియేటర్లు ఇష్టానుసారం టిక్కెట్ల ధరలు పెంపు, పరిమితికి మించి షోలను ప్రదర్శించడాన్ని నియంత్రిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవో 35ను ఏపీ హైకోర్టు సింగిల్ జడ్జి నిలిపివేయడంతో ఏపీ సర్కార్ తదుపరి చర్యలు చేపట్టింది. ఈ అంశంపై డివిజనల్ బెంచ్‌కు వెళ్లాలని జగన్ సర్కార్ నిర్ణయించుకుంది. ఈ మేరకు సింగిల్ జడ్జి తీర్పును డివిజనల్ బెంచ్‌లో అప్పీలు చేస్తూ.. లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. మధ్యాహ్నం ఈ పిటిషన్‌పై ప్రభుత్వ వాదనలను డివిజనల్ బెంచ్ విననుంది.
సినిమాలను బట్టీ థియేటర్లలో టిక్కెట్ల ధరలను పెంచి విక్రయించే పరిస్థితి తెలుగు రాష్ట్రాలలో ఉంది. ప్రేక్షకులు ఆసక్తిని థియేటర్లు, పంపిణీదారులు సొమ్ము చేసుకునేలా.. టిక్కెట్ ధరలను పలురెట్లు పెంచి విక్రయిస్తున్నారు. నామమాత్రంగా కౌంటర్లలో విక్రయించి.. ఆ తర్వాత బ్లాక్‌లో థియేటర్లు, పంపిణీదార్లే విక్రయిస్తూ ప్రేక్షకులను నిలువుదోపిడి చేస్తున్నారు. అదే సమయంలో.. చిన్న సినిమాలకు థియేటర్లు దక్కని పరిస్థితి తెలుగు రాష్ట్రాలలో నెలకొంది.
ఈ పరిస్థితిని మార్చేందుకు.. చిన్న సినిమాలు, నిర్మాతలు, ప్రేక్షకులకు మేలు చేసేలా.. టిక్కెట్ల ధరలను నియంత్రిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. భౌగోళికంగా టిక్కెట్ల ధరలను ఖరారు చేసింది. కార్పొరేషన్, మున్సిపాలిటీ, నగర పంచాయతీ, పంచాయతీలలో వేర్వేరు ధరలను ప్రభుత్వం నిర్ణయించింది. అదే సమయంలో టిక్కెట్లను ప్రభుత్వం ఏర్పాటు చేసే ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా విక్రయించే విధానం అమలు చేసేందుకు సిద్ధమైంది.
ఈ విధానంతో.. తమకు నష్టం జరుగుతుందని భావించిన కొంత మంది నిర్మాతలు, పంపిణీదారులు ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బడ్జెట్‌ను బట్టీ సినిమా టిక్కెట్ల ధరలను నిర్ణయించుకునే హక్కు తమకుందని, గతంలో హైకోర్టు కూడా తీర్పు ఇచ్చిందని వాదించారు. సినిమా టిక్కెట్ల ధరలను నియంత్రించే అధికారం ప్రభుత్వానికి లేదని వాదించారు. టిక్కెట్ల ధరలలో పూర్వ విధానమే కొనసాగేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం.. ప్రభుత్వం జారీ చేసిన జీవో 35ను కొట్టివేసింది. పూర్వ విధానంలోనే టిక్కెట్ల ధరలు కొనసాగుతాయని ఆదేశాలు జారీ చేసింది.
ఈ ఆదేశాలపై ఏపీ సర్కార్ డివిజనల్ బెంచ్‌ను ఆశ్రయించింది. మరికొద్ది సేపట్లో వాదనలు ప్రారంభం కాబోతున్నాయి. సింగిల్ జడ్జి తీర్పును డివిజనల్ బెంచ్ సమర్థిస్తుందా..? లేక ప్రభుత్వ వాదనలతో ఏకీభవిస్తుందా..? చూడాలి.
Also Read : బడా నిర్మాతలకు ఏపీ హైకోర్టు భారీ ఊరట!
విచారణ రేపటికి వాయిదా..
కాగా, మధ్యాహ్నం ప్రభుత్వ లంచ్ మోషన్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన డివిజనల్ బెంచ్.. సింగ్ జడ్జి తీర్పు కాపీ అందకపోవడంతో విచారణను రేపటికి వాయిదా వేసింది. అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపిస్తూ.. వెంటనే విచారించకపోతే టిక్కెట్ల ధరలు పెంచి అమ్ముకునే అవకాశం ఉందని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమయంలో స్పందించిన ధర్మాసనం.. గురువారం మొదటి కేసుగా విచారిస్తామని తెలిపింది.