సంక్షోభంలో ఉన్న రైతాంగాన్ని ఆదుకోవడానికి, వారికి కనీస గిట్టుబాటు ధరలు కల్పించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రస్తుతం 22 రకాల పంటలకు మాత్రమే కనీస మద్దతు ధర (యమ.యస్.పి) ఇస్తుంది. మన రాష్టంలో పండిస్తున్న ప్రధాన పంటల్లో కొన్ని రకాల పంటలు కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ఇస్తున్న పంటల జాబితాలో లేవు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ కనీస మద్దతు ధర ఇస్తున్న జాబితాలో లేని పంటలను పండిస్తున్న రైతులు తమ పంటలకు గిట్టుబాటు ధరలు లభించక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని సార్లు దళారుల చేతుల్లో చిక్కుకొని తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది.
ఈ పరిస్థితుల్లో రైతాంగాన్ని ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వ కనీస మద్దతు ధర ఇస్తున్న జాబితాలో లేని నాలుగు పంటలకు సేకరణ ధరలను నిర్ణయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం సేకరణ ధర నిర్ణయించిన పంటల్లో మిరప, పసుపు, చిరు ధాన్యాలు (ఆరిగా, వొరిగా , కొర్రా, ఆండ్ర కొర్రా, ఈదా , సాములు), ఉల్లి ఉన్నాయి
కనీస సేకరణ ధరలను మిరపకి క్వింటాల్ సేకరణ ధరని 7 వేలుగా, పసుపుకి క్వింటాల్ కి 6,350 గా , ఉల్లికి క్వింటాల్ కి 770 గా, చిరు ధాన్యాలుకి క్వింటాల్ కి 2,500 గా సేకరణ ధరలను నిర్ణయించింది. దీని ప్రకారం ఈ సేకరణ ధరలు కంటే మార్కెట్ ధరలు తక్కువగా ఉంటే రాష్ట్ర ప్రభుత్వమే ధరల స్థిరీకరణ నిధి నుండి ఈ వ్యయాన్ని భరిస్తుంది.
ఒకవేళ ఈ నాలుగు పంటలకు కేంద్రం మద్దతు ధర ప్రకటిస్తే, ఆ ధర రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సేకరణ ధర కంటే ఎక్కువ గా ఉంటే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరే రైతుకు లభిస్తుంది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వ మద్దతు ధర రాష్ట్ర ప్రభుత్వ సేకరణ ధర కంటే తక్కువా గా ఉంటే ఆ వ్యత్యాసాన్ని రాష్ట్ర ప్రభుత్వమే బోనస్ రూపంలో ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ తాజా నిర్ణయం తో కేంద్ర మద్దతు ధరతో పని లేకుండా ఎక్కువ మంది రైతులు లబ్ది పొందనున్నారు.