నిర్ణయం లేటు కావొచ్చు కానీ… తరలించడం మాత్రం ఖాయం..

  • Published - 12:32 PM, Fri - 27 December 19
నిర్ణయం లేటు కావొచ్చు కానీ… తరలించడం మాత్రం ఖాయం..

ఈరోజు సచివాలయంలో క్యాబినెట్ భేటీ అనంతరం విలేకరుల సమావేశంలో ర్రాష్ట్ర సమాచార ప్రసార శాఖామంత్రి పేర్ని నాని మాట్లాడుతూ రాజధాని అంశంపై విలేకరులు అడిగిన ప్రశ్నలకి పూర్తి స్పష్టత ఇవ్వనప్పటికీ ప్రభుత్వానికి బీసీజీ (బోస్టన్ కన్సల్టెంట్ గ్రూప్) తమ తుది నివేదిక జనవరి 3 ప్రభుత్వానికి సమర్పించిన అనంతరం ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన జియన్ రావు కమిటీ తో కలిపి ఈ రెండు కమిటీలను అధ్యయనం చేయడానికి ఒక హై పవర్ కమిటీని వెయ్యబోతున్నామని, ఆ హై పవర్ కమిటీ ఇచ్చే నివేదికని బట్టి రాజధాని అంశంపై ఈ ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని చెప్పడంతో ఇప్పటికైతే విశాఖకు సచివాలయం తరలింపు నిర్ణయాన్ని మరికొన్ని రోజులు పాటు వాయిదా వేస్తున్నట్టు తెలుస్తుంది.

అయితే రాజధాని అంశంపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకి సమాధానం ఇస్తున్న సమయంలో సమాచార ప్రసార శాఖ మంత్రి పేర్ని నాని బాడీ లాంగ్వేజ్, మాటతీరు, ఆయన మాటల్లోని అంతరార్ధం మనం అర్ధం చేసుకుంటే రాజధానిపై అందరు ఊహించినట్టు ఈరోజుకి ఈరోజు నిర్ణయం తీసుకోక పోయినప్పటికీ, తొందర పడకుండా వ్యూహాత్మకంగా ఆచితూచి ముందడుగు వేసే యోచనలో ఉన్నట్టు మనం అర్ధం చేసుకోవచ్చు. అయితే ఇకముందు రాజధానిని అమరావతిలోనే కొనసాగించే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి ఏమాత్రం లేదని ఆయన మాటల బట్టి మనకి స్పష్టంగా అర్ధమౌతుంది.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అమరావతి నిర్మాణం ప్రభుత్వానికి తలకి మించిన భారంగా మారిందని చెప్పకనే చెప్పారు. అమరావతికి లక్షకోట్ల అంచనాలతో పనులు ప్రారంభిస్తే ప్రపంచ స్థాయి విజన్ తో పాటు ఏంటో అనుభవజ్ఞులైన చంద్రబాబు గారు గత ఐదేళ్లలో కేవలం 5 వేల కోట్లు రూపాయాలు మాత్రమే ఖర్చు పెట్టగలిగారని ఇలా అయితే ఆయన చెప్పిన స్థాయి రాజధానిని నిర్మించాలంటే మరో 50 ఏళ్ళు పైనే పడుతుంది ఇదే జరిగితే ఈ రాజధాని ఎప్పటికి పూర్తి కాదని, ఒక వేళ డబ్బులు మొత్తం రాజధానికే పెడితే మరి రాష్ట్రంలో పాలన ఎలా జరగాలి రాష్ట్రంలో అభివృద్ధి పనులను ఆపుదామా?? సాగునీటి ప్రాజెక్టులు ఆపుదామా ?? నదులుఅనుసందానం పరిస్థితి ఏంటి, ప్రజారోగ్యం పేదలకు ఇల్లు ఫించన్లు సంక్షేమ పధకాలు జీతాలు ఎలా ఇవ్వాలో మిరే చెప్పండి అంటూ రాజధానిపై కొత్తగా అంత ఖర్చుపెట్టడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా లేదని తమ ప్రభుత్వ వైఖరి ఏంటో చెప్పకనే చెప్పారు.

అయితే అమరావతిలోనే రాజధానిని కొనసాగిస్తామనే తీరులో మంత్రి గారు ఒక్కమాట కూడా చెప్పకపోవడం బట్టి ప్రభుత్వం అనుసరించనున్న వైఖరి ఏంటో మనం అర్థంచేసుకోవచ్చు. కాకపొతే రాజధాని తరలింపు విషయంలో ప్రభుత్వం చాలా వ్యూహాత్మకంగా ముందడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే రాజధాని ప్రాంత రైతులు జియన్ రావు కమిటీ చట్టబద్దతపై హైకోర్టు లో పిటిషన్లు వెయ్యడంతో ఆ పిల్ సోమవారం హైకోర్టులో విచారణకి వచ్చే అవకాశం ఉండడం, అటుపిమ్మట కోర్టుకి జనవరి 18 వరకు సంక్రాంతి సెలవులు ఉండడంతో ఈలోపే బోస్టన్ కన్సల్టెంట్ కంపెనీ నివేదికపై ప్రభుత్వం నియమించబోయే హైపవర్ కమిటీలో చర్చించి తర్వాత అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి ఆ సమావేశాల్లో హైపవర్ కమిటీ సిఫార్సులపై సభలో చర్చించి, దానిపై తీర్మానం ప్రవేశంపెట్టి అసెంబ్లీ ఆమోదంతో చట్టబద్దత కల్పించి తద్వారా ఎటువంటి న్యాయపరమైన చిక్కులు ఎదురుకాకుండా జనవరి చివరినాటికి కానీ ఫిభ్రవరి ప్రథమార్ధంలో కానీ సచివాలయాన్ని విశాఖ పట్టణానికి తరలించే యోచనలో ప్రభుత్వం ఉందని ఈ మొత్తం పరిణామాలని గమనిస్తున్న నిపుణులు, రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

దీనిబట్టి రాష్ట్రప్రభుత్వం సచివాలయాన్ని విశాఖకు తరలించే ప్రక్రియ కొంచెం లేటు కావచ్చు కానీ విశాఖకు తరలించడం మాత్రం ఖాయం అని చెప్పవచ్చు!!

Show comments