AP BJP, Public Meeting – తెలుగు రాష్ట్రాలపై ప్ర‌ధాని ఫోక‌స్.. భారీ స‌భ‌కు ఏపీ బీజేపీ ప్లాన్‌..!

దేశ వ్యాప్తంగా భారతీయ జనతాపార్టీ ని బలోపేతం చేసేందుకు అధిష్టానం ప్రణాళికలు రచిస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌రింత మెజార్టీతో గెలుపే లక్ష్యంగా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ పావులు క‌దుపుతున్నారు. దక్షిణాది రాష్ట్రాలపై ఫోకస్ పెట్టిన మోడీ తెలుగు రాష్ట్రాల ఎంపీల‌తో కూడా స‌మావేశం అయ్యారు. అభివృద్ధి త‌దిత‌ర కార్య‌క్ర‌మాల పేరిట ప‌లు రాష్ట్రాల‌లో ప‌ర్య‌టిస్తున్న మోడీ తాజాగా తెలుగు రాష్ట్రాల‌పై కూడా ఫోక‌స్ పెట్టారు. తాజా రాజకీయ పరిస్థితులపై ఎంపీలతో చ‌ర్చించారు. వారికి త‌గిన విధంగా దిశా నిర్దేశం చేస్తున్నారు. మోడీ ఆదేశాల మేర‌కు ఈ నెల 28న ఏపీ బీజేపీ విజ‌య‌వాడ‌లో భారీ బ‌హిరంగ స‌భ‌కు ప్లాన్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది.

ప్రధాని నివాసంలో ఏర్పాటు చేసిన బీజేపీ ఎంపీల భేటీ సందర్భగా.. ఎంపీలకు ప్రధాని మోడీ అల్పాహార విందు ఇచ్చారు. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు చెందిన పార్లమెంటు సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిస్థితులు, ప్ర‌భుత్వ పథకాల అమలు తీరుపై ఎంపీలతో మోడీ చర్చించారు. ఆయా రాష్ట్రాల్లో ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రతిపక్ష పార్టీల పనితీరుపై ప్రధాని మోడీ ఆరా తీశారు. ఆయా రాష్ట్రాల్లో పార్టీ బలోపేతం, కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం అంశాలపై ఎంపీలకు దిశానిర్దేశం చేశారు మోడీ.

Also Read : లఖిమ్ పూర్ ఖేరి ఘటన ప్లాన్డ్ మర్డరే – సిట్

ఏపీకి చెందిన బీజేపీ నాయ‌కులు జీవీఎల్ , సుజనాచౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేశ్ లతో మోడీ స‌మావేశం అయ్యారు. అలాగే.. తెలంగాణ నుంచి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్, ధర్మపురి అరవింద్, సోయం బాపురావు ల‌తో భేటీ అయ్యారు. పార్ల‌మెంట్ స‌మావేశాల్లో ఆయా రాష్ట్రాల‌కు సంబంధించిన లేవ‌నెత్తాల్సిన అంశాలు, తీసుకోవాల్సిన నిర్ణ‌యాల‌పై వారి మ‌ధ్య చ‌ర్చ జ‌రిగిన‌ట్లు తెలిసింది. అలాగే.. ఇటీవ‌లి కాలంలో తెలంగాణ‌లో పార్టీ బ‌ల‌ప‌డుతున్న తీరుకు ఆ రాష్ట్ర నేత‌ల‌ను అభినందించారు. మ‌రింత ముందుకు పోయేందుకు ఎలాంటి స‌హ‌కారమైనా అందిస్తామ‌ని వారికి హామీ ఇచ్చారు. ఇక ఏపీ లో బీజేపీ బ‌ల‌పేతానికి మ‌రిన్ని చ‌ర్య‌లు చేప‌ట్టాల్సి ఉంద‌ని ఆ రాష్ట్ర ఎంపీల‌కు సూచించారు. తెలంగాణ‌తో పోల్చుకుంటే.. ఏపీలో బాగా వెనుక‌బ‌డి ఉంద‌న్న విష‌యాన్ని మోడీ లేవ‌నెత్తిన‌ట్లు స‌మాచారం.

ఇప్పటికే ఉత్తరాదిన తిరుగులేని శక్తిగా ఎదిగామ‌ని, దక్షిణాదిన కూడా సత్తా చాటాలంటే తెలుగు రాష్ట్రాల‌లో బీజేపీ బ‌లోపేతం కావ‌డం అత్యంత అవ‌స‌ర‌మ‌ని మోడీ వారికి సూచించారు. ముఖ్యంగా తెలంగాణ, ఏపీలల్లో వలసలు చేరికల ద్వారా పార్టీని బలోపేతం చేసి వచ్చే ఎన్నికల్లో అనుకున్నంతగా ఎంపీ సీట్లను గెలవాలని రాష్ట్ర నాయ‌క‌త్వానికి తెలిపారు. అలాగే తిరుప‌తిలో అమిత్ షాతో జ‌రిగిన స‌మావేశంలో తీసుకున్న నిర్ణ‌యాల అమ‌లుపై కూడా మోడీ చ‌ర్చించిన‌ట్లు తెలిసింది. ఎంపీల‌తో పాటు పార్టీ ముఖ్యుల‌తో కూడా త్వ‌ర‌లోనే భేటీ అవుతాన‌ని ఈ సంద‌ర్భంగా మోడీ పేర్కొన్న‌ట్లు స్థానిక నేత‌ల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. మొన్న అమిత్ షా, ఆ త‌ర్వాత మోడీ ప్ర‌త్యేకించి తెలుగు ఎంపీల‌తో భేటీ కావ‌డంతో తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ బ‌లోపేతానికి అధిష్ఠానం గ‌ట్టిగానే ఫోక‌స్ పెట్టిన‌ట్లు క‌నిపిస్తోంది.

Also Read : ఆంధ్రప్రదేశ్ విభజన హామీలపై పార్లమెంట్ లో గళం విప్పిన వైఎస్సార్సీపీ నేత

Show comments