మహిళా చైతన్యానికి నిలువెత్తు ప్రతీక – Nostalgia

మార్పుకు శ్రీకారం ‘అంకురం’

మహిళా అభ్యుదయం, ప్రగతి అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చే రాజకీయ నాయకులు స్త్రీల హక్కుల పరిరక్షణ విషయంలో మాత్రం బధిరుల్లా నటిస్తారు. పెదవుల్లో వచ్చే మాటకు నిజాయితీ అంటే పడదు కాబట్టి మనమూ వీటికి అలవాటు పడిపోయాం. ఒక రేఖ గీసి అందులో నుంచి స్త్రీ బయటకి రాకూడదనే ఆంక్షలు ఆధునిక సమాజంలో కనుమరుగయ్యాయని ఎవరైనా అన్నప్పుడు నమ్మితే కనక ఈ సృష్టి మొత్తంలో మనమే అమాయకులం అవుతాం. అణచబడే పద్ధతుల్లో మార్పులొచ్చాయి కాని దృక్పథంలో కాదు. అదే కనక జరిగి ఉంటె ఒక్క పోలీస్ స్టేషన్లో కూడా అత్యాచారం, గృహ హింస కేసులు నమోదు కావు. కాని అరనిమిషం ఒక అత్యాచారం జరుగుతున్న దేశంలో ఒక సమస్య కోసం, ఒక పసి బిడ్డ ఆకలి కేక తన తండ్రికి చేరడం కోసం ఒక సగటు వివాహిత స్త్రీ చేసిన పోరాట దృశ్యమే అంకురం చిత్రం.

అంత గొప్ప కథేంటి

సింధూర(రేవతి) భర్త(హరిబాబు)తో ట్రైన్ లో వెళ్తుండగా వేరే ప్రయాణికుడు సత్యం(ఓంపురి)బిడ్డకు పాలు తెస్తా అని ఆమె చేతిలో పెట్టి దిగేస్తాడు. కాని కారణాలు తెలీకుండా సత్యంను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతారు. బిడ్డను ఇంటికి తీసుకెళ్లిన సింధూర అవమానాల మధ్యే ఆ పాప ఆలనా పాలన చూసుకుంటూ సత్యం ఆచూకీ కోసం ప్రయత్నిస్తుంది. ఒక చిన్న క్లూ వల్ల సత్యం ఉండే ఊరేదో తెలుస్తుంది. లాయర్ రావు(శరత్ బాబు) సహాయంతో సత్యం కోసం కోర్ట్ లో కేసు వేస్తుంది. రావుతో పాటు సత్యం ఉండే గిరిజన ప్రాంతానికి వెళ్తుంది. అప్పుడు తెలుస్తుంది సత్యం విప్లవకారుడని ముద్ర పడ్డ గిరిజన నాయకుడని.

అతని భార్యను ఆచూకీ కోసం ఒక పోలీస్ వేధిస్తే బిడ్డకు జన్మ ఇచ్చి చనిపోతుంది. దాంతో ఆవేశపడిన గిరిజనులు ఆ పోలీస్ ని చంపేస్తారు. దీనికి ప్రతిగా గిరిజనులకు అండగా నిలిచిన డాక్టర్ మిత్ర(చారుహాసన్) ను పోలీసులు చంపుతారు. సత్యం బిడ్డతో పారిపోతుండగా రైల్వే స్టేషన్ లో పట్టుకుంటారు. ఇదంతా సింధూర, రావులకి ఎంక్వయిరీ లో తెలుస్తుంది. చివరికి అతి కష్టం మీద కోర్ట్ కు సూర్యం వచ్చేలా చేస్తారు. అప్పటికే పోలీస్ చేతుల్లో దెబ్బలు తిన్న సత్యం నిజాలు బయట పెట్టి కోర్ట్ హాల్ లొనే కన్ను మూయటం, భర్త హరిబాబు బిడ్డతో సహా సింధూరను మళ్ళీ తన జీవితంలోకి ఆహ్వానించడంతో కథ ముగుస్తుంది.

ప్రాణం పోసిన తారాగణం

అప్పటికే గ్లామర్ హీరోయిన్ గా అవకాశాలు తగ్గిన రేవతి తనలోని అసలైన నటిని పరీక్షించే ఈ అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకుంది. సినిమా మొత్తం మనకు సింధూర పడే తపన, ఆమె ఆవేదన కనిపిస్తాయి. అడుగు అడుగులో అడ్డంకులు ఎదురవుతుంటే వాటికి నెరవక ధైర్యంగా ముందుకు సాగే పాత్రలో రేవతి నటన మహిళలో ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా నిలుస్తుంది. తర్వాత చెప్పుకోవాల్సింది లాయర్ పాత్రలో సింధూరకు అండగా నిలిచే శరత్ బాబు. కోర్ట్ లో, సత్యం ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ స్పందించే విషయంలో తను ఎంత మంచి నటుడో చూపిస్తాడు. సింధూర తండ్రిగా బాలయ్య, చిక్కుముడి వీడడానికి కారణమయ్యే పోలీస్ గా కోట శంకర్ రావు, చెడ్డ పోలీస్ గా విద్యాసాగర్ ఇలా ఎవరికి వారు సెటిల్డ్ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకుంటారు.చిన్న పాత్రలకు సైతం పేరున్న నటులనే తీసుకోవడం చాలా ఉపయోగపడింది.

తపస్సు లాంటి దర్శకత్వం

ఒక్క సినిమాతో ఎనలేని పేరు ప్రఖ్యాతులు రావడం అరుదుగా జరుగుతుంది. అది ఈ చిత్ర దర్శకుడు సీ.ఉమామహేశ్వరరావు విషయంలోనూ నిజమైంది. వాస్తవాన్ని కళ్లకు కట్టినట్టు చూపడానికి ఏ మాత్రం జంకకుండా ఎక్కడా వివాదానికి తావు లేకుండా నేర్పుగా చూపడంలో ఉమా గ్రాండ్ సక్సెస్ అయ్యారు. సత్యం ఆచూకీ తెలిసే విషయంలో ఇన్స్పెక్టర్ కూతురి హత్యను నేపధ్యంగా వాడుకోవడం దర్శకత్వ ప్రతిభకు ఒక మెచ్చుతునక. అలాగే గిరిజనుల పట్ల మన అధికార వ్యవస్థ ఎంత అమానుషంగా ప్రవర్తిస్తుందో చూస్తే రక్తం మరుగుతుంది. ఇలాంటి ఆటవిక సమాజంలో మనమూ కలిసే ఉన్నాం అనే విషయం అప్పుడు గుర్తొస్తుంది.

డాక్టర్ ను హత్య చేయటం, సింధూరను కంఫ్యూజ్ చేసి పక్క దారి పట్టడానికి చేసే ప్రయత్నాలు, కోర్ట్ ఎపిసోడ్స్ ఇవన్నీ ఒక థ్రిల్లర్ మోడ్ లో తీయటం వల్ల ఆసక్తి తగ్గకుండా జాగ్రత్త పడ్డారు ఉమా మహేశ్వర్ రావు. కన్నడ సుప్రసిద్ధ సంగీత దర్శకుడు హంసలేఖ అందించిన స్వరాలు,నేపధ్య సంగీతం తోడయ్యి సినిమాను ఇంకో స్థాయికి తీసుకెళ్లారు. ముఖ్యంగా ఎవరో ఒకరు ఎపుడో ఆపుడు అనే పాట ఇప్పటికే స్ఫూర్తినిచ్చే అత్యుత్తమ తెలుగు పాటల్లో స్థానాన్ని పదిలంగా ఉంచుకుంది. ఆద్యంతం ఒక డిస్టర్బ్ అవుతున్న మూడ్ లో సినిమా చూస్తున్నా ఆపేయాలి అనిపించకుండా చేయడమే ఈ నిజాయితీ కలిగిన స్క్రీన్ ప్లే గొప్పదనం

ఎడిటర్, సినిమాటోగ్రాఫర్ వాళ్ళ విధుల్ని సమర్ధవంతంగా నిర్వర్తించారు. ఉన్న మూడు పాటల్లో 2 మాత్రం ఫ్లోకు అడ్డంకిగా అనిపిస్తాయి. అక్కడక్కడా సినిమా నెమ్మదించిన ఫీలింగ్ కలిగినా అది తాత్కాలికం. కమర్షియల్ ఎలిమెంట్స్ ఏమి లేని ఈ సినిమాలో కాపాడేది సింధూర మాత్రమే. కథానుసారం సూర్యం పాత్ర పోషించిన ఓంపురి పేలవమైన మొహం తో పెద్దగా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాల్సిన అవసరం లేకుండా పోయింది. తక్కువ వ్యవధి కనిపిస్తాడు కాబట్టి సీరియస్ గా ఉన్న ఆ పాత్రకు సరిపోయాడు.

చివరి మాట

ఒక ఆరు ఫైట్లు, పాటలు, సవాలు చేసుకునే సన్నివేశాలు, హీరో హీరోయిన్ల ప్రేమ కలాపాలు వీటికి బాగా అలవాటైన సినీ మెదళ్లకు ఈ సినిమా చక్కర లేని కాఫి తాగిన ఫీలింగ్ కలిగిస్తుంది. కాని అప్పుడప్పుడు మనం ఊహ ప్రపంచం నుండి బయటి వచ్చి వాస్తవాల్ని పెద్ద తెర పై చూసినప్పుడు సమాజంలో జరుగుతున్న వాటి గురించి కొంతైనా అవగాహన వస్తుంది. లేదంటే నూతి లోని కప్పల మనకు తెల్సిందే ప్రపంచం అని, అందులో అందరు మన కన్నా ఆనందంగా ఉన్నారని భావిస్తూ అసంతృప్తిని ఇంకా పెంచుకుంటాం. కాబట్టి ఇలాంటి సినిమాలు చూడటం అవసరమే… కనీసం అప్పుడప్పుడు ఒకటి…. అంకురం లాంటిది…

Also Read : మంచి సినిమాకు ప్రేక్షకుల శుభాకాంక్షలు – Nostalgia

Show comments