Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ప్రకటించకముందే అక్కడ భూములు కొన్నారన్న అభియోగాలపై సుప్రిం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ్ కుమార్తెలు భువన, తనూజలపై కేసు నమోదు చేసిన ఏసీబీ అడ్డదారిలో విచారణ జరిపిందట. భూముల వ్యవహారంలో అత్యుత్సాహం ప్రదర్శించిందట. అనధికారికంగా ఖాతా లావాదేవీల సమాచారం సేకరించిందట. ప్రభుత్వ పెద్దల మొప్పు కోసమే ఇలా చేసిందట.. అమరావతి ఇన్‌సైడర్ ట్రేడింగ్‌ను సమర్థించేందుకు తన వంత కలం సాయం చేస్తున్న ఆంధ్రజ్యోతి ఈ రోజు జస్టిస్ ఎన్వీ రమణకు ఆపన్న హస్తం అందించే ప్రయత్నం చేసింది.
జస్టిస్ ఎన్‌వీ రమణ కుమార్తెలపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకముందే నాలుగు సార్లు బ్యాంకు ఖాతా లావాదేవీలు పరిశీలించడం నిబంధనలకు విరుద్ధమంటూ ఆంధ్రజ్యోతి రాసుకొచ్చింది. రాజధానిగా అమరావతిని ప్రకటించక ముందు అక్కడ భూములు కొంటే చట్ట ప్రకారం నేరం కాదు.. నైతికంగా తప్పు అవుతుందంటూ చట్టం గురించి అవపోసన పట్టినట్లుగా గతంలో తన కొత్త పలుకులో రాసిన ఆంధ్రజ్యోతి.. ఒక సుప్రిం కోర్టు న్యాయమూర్తి కుమార్తెలపై కేసు నమోదు చేయాలంటే ఆధారాలు లేకుండా చేస్తే సాహసం కాకుండా ఉంటుందా..? అదే అధారాలు లేకుండా చేస్తే.. ఇదే ఆంధ్రజ్యోతి భూములు కొన్నట్లు ప్రభుత్వం వద్ద ఏం ఆధారం ఉందని ప్రశ్నించేది కాదా..? అనే ప్రశ్న ఉద్భవిస్తోంది.
అమరావతి భూ కుంభకోణం వ్యవహారంలో జస్టిస్ ఎన్‌వీ రమణపై పక్కా ఆధారాలు ఉండడంతోనే ఏపీ ప్రభుత్వం ముందుకు వెళ్లింది. ఈ కుంభకోణం ఎలా జరిగింది. జస్టిస్ ఎన్‌వీ రమణ, ఆయన కుమార్తెల పాత్ర ఏమిటి..? అనే సమగ్ర వివరాలతో ఆధార సహితంగా ఏపీ ప్రభుత్వం సుప్రిం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేసింది. దాని నుంచి బయటపడేందుకు న్యాయవాద సంఘాలు, ప్రముఖ న్యాయవాదులు, ప్రభుత్వంలో పని చేసిన మాజీ న్యాయాధికారులతో ఫిర్యాదు చేయడం తప్పు అంటూ ఇప్పిస్తున్న ప్రకటనలు ఎల్లో మీడియాగా పిలిచే ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు ప్రముఖంగా ప్రచురిస్తున్నాయి. దీనికి కొనసాగింపుగానే.. తాజాగా ఏసీబీ అడ్డదారిలో వెళ్లి సమాచారం సేకరించిందంటూ ఆంధ్రజ్యోతి రాసుకొచ్చింది.
విచారణ చేయడం తప్పు, సమాచారం సేకరించడం తప్పు, ఫిర్యాదు చేయడం తప్పు.. అని టీడీపీ, దాని అనుకూల మీడియా అయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు చెబుతున్నాయి గానీ.. అక్కడ నేరం జరిగిందనే కోణం మాత్రం నేరుగా ప్రస్తావించడం లేదు. అయితే ఇలాంటి కథనాలు రాయడం ద్వారా పరోక్షంగా అమరావతి లో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగినట్లు చెప్పకనే చెబుతున్నాయి. అందులో ఎవరెవరి ప్రాత ఉందో విచారణ అడ్డుకోవడం, విచారణ చేసే విధానం తప్పు అని చెప్పడం ద్వారా భూములు కొన్న వారిని ఆంధ్రజ్యోతి పత్రిక పరోక్షంగా నిర్థారిస్తోంది.
గతంలో భూములు కొనడం చట్ట ప్రకారం నేరం కాదు.. కానీ నైతికంగా తప్పు అవుతుంది. చట్ట ప్రకారం విచారించలేము, శిక్షించలేము.. అని ఆంధ్రజ్యోతి చెప్పింది. ఇప్పుడు జస్టిస్ ఎన్‌వీ రమణ కుమార్తెలు భూములు కొనుగోలు వ్యవహరంలో ఏసీబీ అడ్డదారిలో విచారణ చేయడం తప్పంటూ కథనం రాయడం ద్వారా జస్టిస్ ఎన్‌వీ రమణ తన కుమార్తెల ద్వారా భూములు కొన్నట్లు ఆంధ్రజ్యోతి పత్రికే నిర్థారించడం విశేషం.