Idream media
Idream media
వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచీ ఆంధ్రజ్యోతి జర్నలిజం కొత్త పుంతలు తొక్కుతోంది. మోకాలికి బోడిగుండుకు ముడిపెడుతూ నిత్యం వైసీపీ ప్రభుత్వంపై, ఆ పార్టీ నేతలు, పథకాలపై దుష్ప్రచారం చేస్తోంది. అర్హతే ఆధారంగా వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న నగదు బదిలీ సంక్షేమ పథకాలకు విశేషప్రజాధారణ ఉంటుండడం తెలుగుదేశం పార్టీ, దాని అనుకూల మీడియాకు కంటగింపుగా మారింది. తమ రాతలతో సదరు పథకాల ప్రతిష్టను దెబ్బతీయం, అలా కుదరకపోతే పథకాల ద్వారా ఇచ్చే నగదు మరో దారిలో పోతోందనే రాతలు రాయడం నిత్యకృత్యంగా మారింది. తాజాగా సంక్రాంతి పండగ సందర్భంగా సాగిన పేకాట, జూదాలకు, అమ్మ ఒడి పథకానికి ముడిపెడుతూ ఆంధ్రజ్యోతి పత్రిక రాసిన కథనం.. వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై కడుపుమంటకు నిదర్శనంగా నిలుస్తోంది.
అప్పట్లో విశ్లేషణలు.. ఇప్పుడు దందా..
‘పండగ చేసుకున్నారు’ అనే శీర్షికన ఈ రోజు ఆంధ్రజ్యోతి పత్రిక బ్యానర్ కథనం రాసింది. శీర్షికకు కింద ‘ సంక్రాంతి పేరిట వైసీపీ నేతల దందా’ అనే ట్యాగ్‌లైన్‌ను కూడా పెట్టింది. ఈ శీర్షిక, ట్యాగ్‌లైన్ చూసిన వారికి పండగ పేరిట అధికార పార్టీ నేతలు ఏమైనా దందాలు చేస్తున్నారా..? అనే సందేహం కలగమానదు. కానీ కథనంలోకి వెళితే.. సంక్రాంతి పేరిట కోడి పందేలు, పేకాట, గుండాటలు ఆడించారు. ఇవన్నీ వైసీపీ నేతలే నిర్వహించారు. నిర్వహణ పేరిట కమీషన్లు తీసుకున్నారు… అనేది ఆంధ్రజ్యోతి కథనంలోని సారాంశం. సంక్రాంతి పండగ సమయంలో ఉభయగోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కోడి పందేలు సర్వసాధారణం. కోడి పందేలు నిర్వహించకూడదని హైకోర్టు ఆదేశాలు జారీ చేసినా.. టీడీపీ ప్రభుత్వ హాయంలో యథేచ్ఛగా జరిగాయి. మరి అప్పట్లో బరుల ఏర్పాటు, నిర్వహణ అధికార పార్టీ నేతలే చేసినట్లేనా..? కనుమ పండగ ముగిసిన మురుసటి రోజు కోడి పందేలు ఎక్కడెక్కడ జరిగాయి..? పందెం రూపంలో ఎన్ని వందల కోట్ల రూపాయలు చేతులు మారింది..? అంకెలు వేసి మరీ విశ్లేషణలు రాసే టీడీపీ అనుకూల మీడియా ఈ సారి మాత్రం వైసీపీ నేతల దందా అంటూ.. కోడి పందేల వ్యవహారాన్ని అధికార పార్టీ నేతల మేడలో వేయాలని చూస్తుండడం గమనార్హం.
మొన్న మద్యం.. నేడు కొడి పందేలు, పేకాట..
పండగకు రెండు రోజులు ముందు ఇచ్చిన అమ్మ ఒడి నగదు 14 వేల రూపాయలు కోడి పందేలు, పేకాటకు సమర్పించుకున్నారంటూ ఆంధ్రజ్యోతి రాసుకొచ్చింది. ఈ ఒక్క వాక్యంతో ఆంధ్రజ్యోతి ఉద్దేశం ఏమిటో స్పష్టమవుతోంది. సమర్థవంతంగా అమలు జరుగుతున్న పథకాలపై ప్రభుత్వ వ్యతిరేకులకు కంట గింపు ఏ స్థాయిలో ఉందో ఇట్టే తెలిసిపోతోంది. పథకం అమలు చేసిన రోజు… అమ్మ ఒడి డబ్బులు.. నాన్న బుడ్డికి అంటూ.. పథకం ద్వారా వచ్చిన నగదును ఆయా కుటుంబాల్లోని మగవారు మద్యానికి ఖర్చు చేస్తున్నారని, భార్య పిల్లలు పస్తులుంటున్నారని ఆంధ్రజ్యోతి రాసుకొచ్చింది. ఇప్పుడు కోడి పందేలు, పేకాటలకు తగలేశారని చెబుతోంది. ఇందులో ఏది నిజమో ఆంధ్రజ్యోతి పత్రికే చెప్పాలి. పైగా కోడి పందేల నిర్వహణతో వైసీపీ ప్రభుత్వం పిల్లలకు ఇచ్చిన నగదు కాస్తా అధికార పార్టీ నేతల జేబుల్లోకి వెళ్లిందంటూ పిల్లలపై సానుభూతి చూపిస్తోంది. మరి ఇన్నేళ్లుగా జరుగుతున్న కోడి పందేలలో ప్రతి ఏడాది చేతులు మారిన వందల కోట్ల రూపాయలు ఎవరివి..? ఎవరి జేబుల్లోకి వెళ్లాయి..? అనే అంశంపై కూడా క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఆంధ్రజ్యోతిపైనే ఉంది..!