Amaravati Farmers, Three Capitals, Tirupati – మూడు రాజధానులకు మద్ధతుగా తిరుపతిలో ఫ్లెక్సీలు.. చించివేసిన అమరావతి రైతులు

తిరుపతిలో టెన్షన్‌ వాతావరణం నెలకొంది. మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ, రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్‌ చేస్తున్న అమరావతిలోని కొంత మంది రైతులు చేస్తున్న పాదయాత్ర తిరుపతికి చేరుకుంది. న్యాయస్థానం – దేవస్థానం పేరుతో గత నెల 1వ తేదీన ప్రారంభమైన వీరి పాదయాత్ర చివరి దశకు చేరుకుంది. ఈ రోజు తిరుపతిలో పాదయాత్ర సాగుతోంది. అలిపిరిలో సాయంత్రం పాదయాత్ర ముగియనుంది.

ఓ వైపు మూడు రాజధానులు వద్దు, అమరావతియే ఏకైక రాజధానిగా ఉండాలనే డిమాండ్‌తో ఈ పాదయాత్ర సాగుతుండగా.. మరో వైపు రాయలసీమ వాసులు.. మూడు రాజధానులు కావాలని, వెంటనే మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో తిరుపతిలో ఫ్లెక్సీలు వెలిశాయి. ‘‘మీతో మాకు గొడవలు వద్దు.. మీకు మా స్వాగతం.. మాకు మూడు రాజధానులే కావాలి..’’ అని అమరావతి పాదయాత్రికులను ఉద్దేశించి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వీటిని అమరావతి పాదయాత్రికులు చించివేయడం ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. ఎవరికి వారు తమ ఆకాంక్షలను తెలియజేయడం సహజం. అయితే తిరుపతిలో స్థానికులు మూడు రాజధానులకు మద్ధతుగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను అమరావతికి మద్ధతుగా పాదయాత్ర చేస్తున్న వారు చించివేయడం ఆశ్చర్యంగా ఉంది.

Also Read : ఉద్యోగుల పీఆర్సీలో కీలక మార్పులు, భవిష్యత్తులో వేతన సవరణ సంఘాలుండవు

అమరావతి పాదయాత్రికులకు పోటా పోటీగా ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి పోరాట సమితి.. తిరుపతిలో భారీ ర్యాలి నిర్వహించింది. మూడు రాజధానులు కావాలని, వెంటనే ఏర్పాటు చేయాలని నినాదాలు చేస్తూ వేలాది మంది ప్రజలు, విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు. అయితే పోటా పోటీ యాత్రలు చేయడం, స్థానికులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను అమరావతి పాదయాత్రికులు చించివేయడంతో శాంతిభదత్రల సమస్య తలెత్తుతుందని పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి పోరాట సమితి చేస్తున్న ర్యాలీని అడ్డుకున్నారు. నిర్వాహకులను పోలీస్‌ స్టేషన్లకు తరలించారు.

తాజా పరిస్థితి నేపథ్యంలో తిరుపతిలో ఉద్రిక్త పరిస్థితి తలెత్తకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. ఈ రోజు అమరావతికి మద్ధతుగా చేస్తున్న పాదయాత్ర ముగుస్తుంది. రేపు, ఎళ్లుండి.. పాదయాత్రికులు తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఈ నెల 17వ తేదీన అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలనే డిమాండ్‌తో బహింరగ సభ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీని వల్ల శాంతి భదత్రల సమస్య వస్తుందని పోలీసులు అనుమతి ఇచ్చే విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అనుమతి ఇచ్చేలా పోలీసులకు ఆదేశాలు జారీ చేయాలంటూ.. నిర్వాహకులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. మరో మూడు రోజుల్లో బహిరంగ సభ నిర్వహించాలని అనుకుంటున్న పాదయాత్ర చేస్తున్న వారు.. ఈ రోజు మూడు రాజధానులకు మద్ధతుగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చించివేయడంతో పోలీసులు అనుమానించినట్లు శాంతి భదత్రల సమస్య తలెత్తే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Also Read : సీఐడీ కేసు.. లక్ష్మీనారాయణకు ‘ముందస్తు’ రక్షణ

Show comments