MLC Election, Congress – ఎమ్మెల్సీ ఫ‌లితాలు : న‌ల్గొండ‌ కాంగ్రెస్ లో క‌ల‌క‌లం

ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ఫ‌లితాల‌తో కాంగ్రెస్ ప‌రాభ‌వం మ‌రోసారి తెర‌పైకి వ‌చ్చింది. అయితే ఈ ప‌రిస్థితిని ముందే ఊహించిన కాంగ్రెస్ త‌మ పార్టీకి సుమారు నాలుగొంద‌ల ఓట్లు ఉన్న‌ప్ప‌టికీ అభ్య‌ర్థిని నేరుగా రంగంలోకి దించే సాహ‌సం చేయ‌లేదు. స్వ‌తంత్ర అభ్య‌ర్థి ఆలేరు జ‌డ్పీటీసీ, మాజీ ఎమ్మెల్యే న‌గేశ్ కు మ‌ద్ద‌తు ప‌లికింది. కానీ, ఆ పార్టీకి ఉన్న ఓట్లు కూడా న‌గేశ్ కు ప‌డ‌లేదు. కాగా, ఇందుకు కార‌ణం కాంగ్రెస్ ఎంపీలేనంటూ ఆరోప‌ణ‌లు రావ‌డం ఇప్పుడు క‌ల‌క‌లం రేగుతోంది.

క్రాస్ ఊసే లేదు..

మంగ‌ళ‌వారం విడుద‌లైన ఎమ్మెల్సీ ఫ‌లితాల్లో అన్ని స్థానాల‌నూ అధికార పార్టీ చేజిక్కించుకుంది. దాదాపు అన్ని చోట్లా మొద‌టి ప్రాధాన్య ఓట్ల‌తోనే విజ‌యం సాధించింది. కరీంనగర్‌లో టీఆర్ఎస్ అభ్యర్ధి ఎల్ రమణ, భాను ప్రసాదరావులు విజయం సాధించగా, ఖమ్మం నుంచి తాతా మధుసూదన్, నల్గొండ నుంచి ఎంసీ కోటిరెడ్డి గెలిచారు. మెదక్ నుంచి యాదవ్ రెడ్డి, అదిలాబాద్ నుంచి దండే విఠల్ విజయం సాధించారు. 12 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకై షెడ్యూల్ విడుదల కాగా, ఆరు స్థానాలు ముందుగానే ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన ఆరు స్థానాలైన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండు, ఆదిలాబాద్, ఖమ్మం, నల్గొండ, మెదక్ జిల్లాల్లో ఒక్కొక్క స్థానానికి ఈ నెల 10వ తేదీన పోలింగ్ జరిగింది. మొత్తం 26 మంది అభ్యర్ధులు బరిలో ఉన్నారు. కాగా, న‌ల్గొండ‌లో క్రాస్ ఓటింగ్ పై కాంగ్రెస్ న‌మ్మ‌కం పెట్టుకోగా, ఎక్క‌డా ఆ ప‌రిస్థితి క‌నిపించలేదు.

టీఆర్ ఎస్ ప్ర‌త్య‌ర్థి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

నల్గొండలో టీఆర్ ఎస్ అభ్య‌ర్థి ఎంసీ కోటిరెడ్డి ఘనవిజయం సాధించారు. అత్యధికంగా 691 ఓట్లతో విజయం సాధించారు. ప్రత్యర్థి నగేష్ 226 ఓట్లు సాధించారు. నల్గొండ స్థానంలో మొత్తం 1,233 ఓట్లు ఉండగా, చెల్లని ఓట్లు 50 మినహాయిస్తే.. 1,183 ఓట్లను పరిగణలోకి తీసుకున్నారు. అందులో గెలుపు కోటా 593 ఓట్లు అయితే.. టీఆర్ఎస్‌ అభ్యర్థి కోటిరెడ్డికి 917 ఓట్లు వచ్చాయి.. స్వతంత్ర అభ్యర్థి నగేష్ 226 ఓట్లు సాధించగా, కోటిరెడ్డి 691 ఓట్ల మెజార్టీతో గెలిచినట్టు ఎన్నికల సంఘం అధికారులు ప్రకటించారు. ఫ‌లితాల అనంత‌రం న‌గేష్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు.

Also Read : ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ప‌ని చేయ‌ని ఈట‌ల మంత్రాంగం

కాంగ్రెస్ ఎంపీలు అధికార పార్టీకి కొమ్ముకాశారు..

త‌న ఓట‌మికి ఎంపీలు కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి, ఉత్త‌మ్ కార‌ణ‌మంటూ న‌గేష్ ఆరోపించారు. బ‌ల‌మైన పునాది ఉన్న న‌ల్గొండ‌లో కాంగ్రెస్ అభ్య‌ర్థిని ఎందుకు ప్ర‌క‌టించ‌లేదో ఎంపీలు స‌మాధానం చెప్పాల‌న్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆరుగురు స్వత్రంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నాం. నేను కాంగ్రెస్ కి చెందిన జెడ్పీటీసీని. అయినా నాకు ఓటు వెయ్యవద్దని ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఓటర్లకు చెప్పారని ఆరోపించారు. ఆయ‌న టీఆర్ఎస్ పార్టీ కి సపోర్ట్ చేశార‌ని బ‌హిరంగంగానే పేర్కొన‌డం సంచ‌ల‌నంగా మారింది. ఈ ఎన్నికల్లో ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి నిలబెట్టిన స్వతంత్ర అభ్యర్ధి కి 26 ఓట్లు మాత్రమే రాగా, నిజాయితీగా ఉన్న నాకు 226 ఓట్లు వచ్చాయి అని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ ద్వారా ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కి ఆయన అనుచరులకు కోటి రూపాయలు అందాయ‌ని ఆరోపించారు. కాంగ్రెస్ స‌భ్యులు 320 మంది వ‌ర‌కు ఉన్న‌ప్ప‌టికీ న‌గేష్ కు 226 మాత్ర‌మే వచ్చాయి. టీఆర్ ఎస్ ఆఫ‌ర్ల‌కు దాదాపు 200 మంది వ‌ర‌కు అటు వెళ్లిపోయార‌ని చెప్పారు. కాంగ్రెస్ లో స‌భ్యుల‌ను కంట్రోల్ చేయ‌లేని ప‌రిస్థితి ఉంద‌ని చెప్పుకొచ్చారు. త‌న ఓటమికి నూటికి ల‌క్ష రెట్లు కోమ‌టిరెడ్డి కార‌ణ‌మ‌ని అన్నారు.

మంత్రి జ‌గ‌దీశ్వ‌ర్ రెడ్డి చాక‌చ‌క్యం

మొద‌టి నుంచీ న‌ల్గొండ జిల్లాలో టీఆర్ ఎస్ ఏక‌ప‌క్షంగా గెలుపు సాధిస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో కూడా గెలుపు బావుటా ఎగుర‌వేసింది. ఇక్క‌డ టీఆర్ ఎస్ కు 813 ఉండ‌గా, మ‌రో వంద మందిని కాంగ్రెస్ నుంచి ఇటువైపు రాబ‌ట్టుకుంది. అంద‌రినీ ఒక తాటిపైకి తేవ‌డంలో మంత్రి జ‌గ‌దీశ్వ‌ర్ రెడ్డి ఫార్ములా ప‌ని చేసింది. చివ‌రి రెండు రోజులు క్యాంపు రాజ‌కీయాల‌కు తెర తీశారు. స‌భ్యుల‌ను నేరుగా పోలింగ్ కేంద్రానికి తీసుకొచ్చి ఓట్లు వేయించారు.

Also Read : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కారు హవా. ఆరుకు ఆరు సీట్లు కైవసం!

Show comments