ఈస్థటిక్ స్పేస్

రచయిత ఎందుకు రాస్తాడు?

రాయగలగడం వల్ల, రచన అంటే ఉన్న ఇష్టం వల్ల, విషయాన్ని సృజనాత్మకంగా చెప్పగలగడం వల్ల, రాయకుండా ఉండలేకపోవడం వల్ల. ఇతర ప్రయోజనాలన్నీ అనుషంగికాలే.

రచయిత వో కథను ఎందుకు చెప్పాలనుకుంటాడు?

తనకు తెలిసిన కథ అందరికీ చెప్పాలని, ఒక ప్రేరణ కలిగించాలని, తన ఊహల్లోని సృజనాత్మక ఆలోచనా ప్రపంచాన్ని వాస్తవిక లోకంతో పంచుకోవాలని, తన తార్కికదృష్టితో ఒక లౌకిక లేక పారమార్థిక సమస్యను సమగ్రంగా చర్చించాలని వీలయిన సందర్భంలో వ్యావహారిక లేక తార్కిక పరిష్కారం చూపాలని (ఏదొక హడావిడి పరిష్కారం ఇవ్వడం కూడా అవసరం లేదు). ఇవన్నీ కొన్నిసార్లు స్థాయీబేధాలు వున్న కారణాలు. వీటికి కింది స్థాయి కారణాలు కూడా వుండవచ్చు, అవి ఇక్కడ అప్రస్తుతం. ఇది ఒక సూత్రీకరణగా కన్నా ఒక చదువరి అవగాహనగా లెక్కించవచ్చు.

ఇటువంటి ప్రాథమిక ప్రశ్నలతో ఈ ఆలోచనలను ఎందుకు పంచుకుంటున్నాను!! ఒకే రచయిత కథల సంపుటం చదివినప్పుడు వచ్చే ప్రశ్నలే ఇవన్నీ బహుశా అందరికీ. కొందరివి చదివినప్పుడు మొదటి స్థాయి ప్రశ్నలు వాటి సమాధానాలు, తరవాత స్థాయి కొందరివి. అతి కొద్ది మంది కథకులు తాము చేసే ప్రతీ రచననీ వొక ఉత్తమ సామాజిక లక్ష్యం దిశగా లేక సాధించవలసిన మార్పు దిశగా చేసే గొప్ప ప్రయత్నంగా నిలుపుతారు. వారు పరిష్కారం పట్ల మక్కువతో వుండటం ఆ కథ బలహీనతగా కాకుండా కథకుని అంతర్మథనానికి, ఆ విషయం పట్ల కథకుని అవగాహనకి, ఒక అవసర పరిష్కారం పట్ల కథకుని సహృదయస్పర్శకి, నిజాయితీకి దర్పణంగా నిలుస్తుంది. రాసిన ప్రతీకథా ఈ గీటురాళ్లకు తూగేంత గొప్పగా రాయడం తేలిక విషయం కాదు.

అందుచేతనేనేమో కథలు రాయడం మొదలుపెట్టిన ఒకటిన్నర దశాబ్దాల తర్వాత కానీ ఈ ‘ఈస్థటిక్ స్పేస్’ ను అవిష్కరించలేకపోయారు దగ్గుమాటి పద్మాకర్. అంత సుధీర్ఘ ప్రస్థానం తర్వాత బయటకు వచ్చిన ఈ తెలుగు కథల పుస్తకం ప్రచురించిన సంవత్సరం నిండుతుండగానే రెండవ ముద్రణకు రావడం చాలా ఆశాజనకమైన మార్పు. పద్మాకర్ గారికి అభినందనలు.

“యూటర్న్”తో మొదలైన ఈ పదిహేడు కథల పుస్తకం ఏవిధంగానూ యూటర్న్ కాదు. ప్రతీ కథలోని ఆలోచన పట్లా, విషయసమగ్రత పట్ల, అవసరమైన క్లుప్తత పట్ల కథకుని పదునైన చూపు, అంతకన్నా పదునైన కత్తెర తారసపడుతూనే ఉంటాయి.

“యూటర్న్”, రొటీన్ గా మారిన జీవితంలోని అసంతృప్తిని ఛేదించి జీవితాన్ని నూతనంగా మార్చుకోవడానికి వైద్యుని సహాయంతో పనిచేస్తున్న మిస్టర్ సేన్ ఆధునిక మానవునికి అచ్చమైన ప్రతీక. కనిపించే తీరాల వెంట, చిక్కని ఎండమావుల వెంటా పరిగెత్తి పరిగెత్తి ఇదీ విజయం అని లోకం ఒప్పుకునే స్థాయికి చేరాక కూడా ఆత్మతృప్తిలేని స్థితిలో ఉన్న సేన్ కి చిన్నపిల్ల శకుంతల ఇచ్చిన అపురూప పెన్నిధి నేర్పింది సేన్ ఏ మార్గంలో వెళ్లాలన్నదే కాదు, తనకు శాంతి మాత్రమే కాదు ఇంకా ఎక్కువ. నేర్పింది సేన్ కే కాదు. నిస్సందేహంగా ఇది ఒక నమ్మకంతో సృష్టించిన నిజం కావలసిన కథ.

“ఒక భార్య – ఒక భర్త”, భార్యాభర్తలకే కాదు ఇచ్చిపుచ్చుకోవలసిన అవసరాలున్న ప్రతీబంధం లోని వ్యక్తులకు ఒక హెచ్చరిక. త్రాసులోని సమతుల్యత దెబ్బతిన్నాక, ఒకరికి తీసుకోవడమే అవల్లవాటయ్యాక ఇంక ఆ బంధం నిలబడడం అంత తేలిక కాదు. సర్దుబాట్లకీ, రాజీకి ఉన్న సన్నని తేడాని తెలియని తరాలు వస్తున్న తరుణంలో అవసరమైన కథ.

“S/o అమ్మ” కథకుని సమదృష్టికి, సామాజిక వాస్తవాల చరిత్ర పట్ల ఉన్న లోతైన అవగాహనకి, ఈ వాస్తవాలలో వున్న వక్రతపట్ల, ఒక వర్గమ్ మీద చూపే క్రౌర్యం పట్ల అసహనానికి గొప్ప ఉదాహరణ. అసహనం ప్రదర్శిస్తూ ఆగిపోయే కథగా మిగిలివుంటే ఇది ఒక గుర్తించవలసిన కథగా మాత్రమే మిగిలిపోయేది. ఆ అసహనాన్ని అవసరమైన మార్పుకి నాందిగా మార్చుకుని ఈ కథని ఒక గొప్ప కథగా మలిచారు పద్మాకర్.

“ఇనుపతెర”, పిల్లల్ని ప్రయిజ్డ్ పొసెషన్గా, తమ గొప్ప పెంపకానికి ఉదాహరణగా, తాము గీసిన గీతల్లో ఒదిగేబొమ్మలుగా మాత్రమే ఉండాలనుకునే ప్రతీ తల్లిదండ్రులకీ అవసరమైన కథ. స్వేచ్ఛను కోల్పోయిన బాల్యం పట్ల కథకుని నిరసన స్వరమే కాక, ఆ బాల్యాన్ని ఇనుపతెరల బందీఖానాల నుంచి బయటకు తెచ్చే సూచనలూ చేస్తారు. ఒకటే పరిష్కారం, పిల్లల్ని కాదు మార్చాల్సింది.

కథకునికి మంచిపేరు తెచ్చిపెట్టిన “లక్ష రూపాయల కథ” మన సమాజంలో ఎంత మాత్రమూ మారని, కొండకచో ఇంకాస్త ఉధృతమైన కుల ప్రాధాన్యతకి చక్కని ఉదాహరణ.

ఈ పుస్తకానికి శీర్షిక గా నిలిచిన కథ “ఈస్థటిక్ స్పేస్”, స్త్రీ పురుష సంబంధాలలోని కనిపించే, అగుపడని వివిధ పొరల్లోని అంశాలను విస్తృతంగా చర్చించడంతో పాటు తమలో దాగివున్న సౌందర్యస్పృహ క్షేత్రాన్ని గుర్తించవలసిన ఆవశ్యకతను కూడా ఎరుకపరిచే కథ.

నిడివివల్ల ఇక ఆపడమే కానీ, అన్ని కథలూ చదివి, అర్థం చేసుకుని నెమరువేయవలసిన కథలు. “ఒక దుఃఖం రాని సాయంత్రం”, “పున్నమ్మ”, “తప్పిపోయిన గది”, “ఒయాసిస్”,”‘పరిధులు-ప్రమేయాలూ” ఇట్లా ప్రతీ కథా విభిన్నమైనవే దానికదే చర్చించవలసినవే. కథల శైలి-శిల్పం గురించి సాధికారికంగా మాట్లాడగలిగిన పరిజ్ఞానం నాకు లేదు కనుక ఆ విషయాలు నేను స్పృశించడం లేదు. ఏ కథలోనూ చదివించేగుణానికి లోటు లేదు, ప్రతీ కథా ఒక్కో ఎక్కువమాట కోసం వెతికి కత్తిరించినంత పొందికగా వున్న సంగతి మాత్రం నేను చెప్పగలను. అవసరానికి మించి ఒక్క ఇంగ్లీషు మాటా వాడలేదు. పద్మాకర్ గారికి ఇటువంటి గొప్ప కథల పుస్తకం తెచ్చినందుకు, తొందరగా రెండవ ముద్రణకు వచ్చినందుకు అభినందనలు తెలుపుతూ; ఇంతే పటిష్టమైన కథలు ఇంకాస్త తక్కువ వ్యవధిలో వెలువరించాలని ఆశిస్తున్నా. మరొక్కమారు అభినందనలు పద్మాకర్ గారు 💐

Written By — Sunitha Ratnakaram

Show comments