iDreamPost
iDreamPost
సాధారణంగా సినీ దిగ్గజాల కలయిక కోరుకున్నప్పుడంతా జరగదు. అలాంటి అరుదైన సందర్భాలు అపూర్వంగా ఉంటాయి. అలాంటిదే ఇది కూడా. 1986లో కమల్ హాసన్, రాధిక జంటగా కళాతపస్వి కె విశ్వనాథ్ రూపొందించిన స్వాతిముత్యం ఎంత ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. కమర్షియల్ మూసలో కొట్టుకుపోతున్న తెలుగు సినిమాకు కొత్త గ్రామర్ ను నేర్పించిన విశ్వనాథ్ ప్రతిభకు బాక్స్ ఆఫీస్ దగ్గర వసూళ్లు ఘనంగా దక్కాయి. ఏకంగా 13 కేంద్రాల్లో వంద రోజులు ఆడిన స్వాతిముత్యం ఆ సంవత్సరం టాప్ టెన్ లో చోటు దక్కించుకుంది.
మసాలా అంశాలు లేకుండా ఆఫ్ బీట్ తరహాలో అనిపించే ఈ సినిమా ఆ స్థాయి విజయం సాధించడం చూసి అందరూ షాక్ తిన్నారు. ఇక కమల్ నట ప్రతిభ గురించి చెప్పేదేముంది. ఇళయరాజా సంగీతం వాడవాడలా మారుమ్రోగిపోయింది. బెంగుళూరులో ఏకధాటిగా 500 రోజులకు పైగా ప్రదర్శింపబడటం ఇప్పటికీ ఒక రికార్డు. మార్చ్ 16న రిలీజైన ఈ సినిమా హండ్రెడ్ డేస్ ఫంక్షన్ జూన్ 20న ఆర్టిసి క్రాస్ రోడ్స్ లో నిర్వహించారు. ముందు లలిత కళాతోరణం అనుకున్నప్పటికీ వర్షాల వల్ల వెన్యూ షిఫ్ట్ చేశారు.
ముఖ్య అతిథులుగా అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్, బాలీవుడ్ లెజెండ్ రాజ్ కపూర్, మెగాస్టార్ చిరంజీవి అతిథులుగా హాజరయ్యారు. వక్తలంతా సినిమా యూనిట్ ని ప్రశంసల వర్షంలో ముంచెత్తారు. సిఎం అయ్యాక ఎన్టీఆర్ వచ్చిన సినిమా వేడుక ఇదే. కిక్కిరిసిన జనసందోహం మధ్య ఈ ముగ్గురితో పాటు కమల్ హాసన్, విశ్వనాథ్, రాధికలను చూసేందుకు అక్కడికి వచ్చిన వారికి రెండు కళ్ళూ చాలలేదు. దీన్ని హిందీలో కమల్ తో రీమేక్ చేయాలనీ తర్వాత చేసిన ప్రయత్నాలు సఫలీకృతం కాలేదు. తర్వాత అనిల్ కపూర్, విజయశాంతిలతో తీస్తే మంచి విజయం దక్కించుకుంది. స్వాతిముత్యం ఫంక్షన్ తర్వాత ఎన్టీఆర్, రాజ్ కపూర్, చిరంజీవి ఒకే స్టేజి మీద కలుసుకోవడం జరగలేదు.