iDreamPost
iDreamPost
ఉగాది పచ్చడిలాగా ఈ ఏడాది అందరు హీరోలకు స్టార్ల కుటుంబాలకు ఒకే ఫలితం దక్కలేదు. హిట్లు ఫ్లాపులు సమ్మేళనం కొందరికి కలిగితే మరికొందరికి పూర్తిగా చేదు జ్ఞాపకాలు నిలిచాయి. అక్కినేని ఫ్యామిలీకి స్వీట్ కంటే సాల్ట్ టేస్ట్ ఎక్కువగా దక్కింది. ముందు నాగార్జున సంగతి చూస్తే 2022 సంక్రాంతికి పెద్దగా పోటీ లేకుండా రావడం బంగార్రాజుకు కమర్షియల్ గా కలిసి వచ్చింది. కంటెంట్ పరంగా సోగ్గాడే చిన్ని నాయనా రేంజ్ లో లేకపోయినప్పటికీ ఉన్నవాటిలో ఇదే బెస్ట్ ఆప్షన్ కావడంతో ఆడియన్స్ పాస్ చేసేశారు. అయితే ఒళ్ళు హూనం చేసుకుని దేశవిదేశాలు తిరిగి షూటింగ్ చేసిన ది ఘోస్ట్ డిజాస్టర్ కావడం అభిమానులు జీర్ణించుకోలేకపోయారు
బిగ్ బాస్ సీజన్ 6 ఆశించిన స్థాయిలో జనానికి చేరలేక ఫ్లాప్ గా మిగిలిపోయింది. నాగ్ ఎప్పటిలాగే యాంకరింగ్ చేసినప్పటికీ వీక్ గేమ్ డిజైన్ తో పాటు పార్టిసిపెంట్స్ సెలక్షన్ ఆ షోని ఫాలో అయ్యే వాళ్ళ ఆసక్తిని చంపేసింది. అత్యంత తక్కువ రేటింగ్స్ వచ్చింది కూడా దీనికే.ఇక నాగ చైతన్య విషయానికి వస్తే పైన చెప్పిన బంగార్రాజు తనకూ వరిస్తుంది కాబట్టి అది పక్కన పెడదాం. మనం లాంటి క్లాసిక్ మూవీ ఇచ్చిన విక్రమ్ కుమార్ తో చేసిన థాంక్ యు మరీ ఘోరంగా బోల్తా కొట్టడం చైతుకి పెద్ద దెబ్బే. కనీసం సగం పెట్టుబడి కూడా వెనక్కు తేలేక తుస్సుమంది. అమీర్ ఖాన్ తో ఏరికోరి చేసిన లాల్ సింగ్ చద్దా పరాజయాన్ని బాలీవుడ్ ఇప్పట్లో మర్చిపోలేదు
అఖిల్ సంగతి చూస్తే అదిగో పులి ఇదుగో తోక తరహాలో ఏజెంట్ విడుదల వ్యవహారం తేలడం లేదు. అన్నీ సవ్యంగా ప్లాన్ ప్రకారం జరిగి ఉంటే డిసెంబర్ చివరి వారంలో వచ్చేసేది. కానీ జరగలేదు. వాయిదాల మీద వాయిదాలు పడుతూనే వచ్చాయి. జనవరి 1 న్యూ ఇయర్ కానుకగా ఏదో అనౌన్స్ చేస్తామనే టాక్ వచ్చింది కాబట్టి చూడాలి. ఇక అమల విషయానికి వస్తే శర్వానంద్ ఒకే ఒక జీవితంతో ఇచ్చిన రీ ఎంట్రీ మంచి ఫలితం ఇచ్చింది. తల్లి పాత్రలో బాగా ఒదిగిపోయారు. సుమంత్ అక్కినేని కాంపౌండ్ అనలేకపోయినా తనకూ ఒక్క హిట్టు లేదు ఓటిటిలో అయినా సరే. 2023 అయినా అక్కినేని టీమ్ కి సరైన విజయాలు పలకరించాలని అభిమానుల ఆకాంక్ష