Idream media
Idream media
మళ్లీ అధికారం కోసం టీడీపీ నేతలు కలలు కంటుండగా.. తమ్ముళ్లు మాత్రం ఆ దిశగా ఆశలు పెట్టుకోవడం లేదు. ఇందుకు కారణం నేతలు, ప్రజా ప్రతినిధులు వ్యవహరిస్తున్న తీరు. జగన్‌ను ఎదుర్కొనేందుకు టీడీపీ నేతలు అనుసరిస్తున్న విధానాలు, వ్యూహాలు తమ్ముళ్లలో అపనమ్మకాన్ని కలిగిస్తున్నాయి. ప్రజాధరణ కలిగిన వైఎస్ జగన్‌ను ఎదుర్కొనాలంటే ప్రజా సమస్యలు, ప్రజలు ఇబ్బంది పడే అంశాలపై మాట్లాడాలి, పోరాటాలు చేయాలి. కానీ టీడీపీ నేతలు ఇవి వదిలేసి పాత చింతకాయ పచ్చడి ఆరోపణలు, విమర్శలు చేస్తుండడం తమ్ముళ్లకు ఏ మాత్రం రుచించడం లేదు.
మళ్లీ అదే ఆరోపణ..
పార్టీ పెట్టినప్పటి నుంచి వైఎస్ జగన్‌పై టీడీపీ లక్ష కోట్ల రూపాయలు అవినీతి చేశారంటూ ఆరోపణలు చేస్తోంది. ఆ ఆరోపణలు తేలిపోయి, ప్రజలకు అసలు నిజం తెలిసినా.. టీడీపీ నేతలు ఇంకా ఆ జపమే చేస్తున్నారు. తాజాగా ప్రకాశం జిల్లా కొండపి ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామి .. వైఎస్ జగన్‌పై అవినీతి ఆరోపణలు చేశారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైఎస్ జగన్ 43 వేల కోట్ల రూపాయలు దోచుకున్నారంటూ ఆరోపించారు. ఈ తరహా తీరే తమ్ముళ్లకు నేతల సమర్థతపై అనుమానాలను రేపుతోంది.
జగన్ లక్ష కోట్ల రూపాయలు సంపాదించారని, 2014 ఎన్నికల్లో టీడీపీ పదే పదే ప్రచారం చేసింది. తన అనుకూల మీడియా చేత ప్రచారం చేయించింది.ఓసారి లక్షకోట్ల రూపాయలు అని, మరోసారి 43 వేల కోట్ల రూపాయలు అని.. ఇలా రకరకాలుగా వైఎస్ జగన్‌పై ఆరోపణలు చేసింది. టీడీపీ చెబుతున్నట్లు లక్ష కోట్లు, లేదా 43 వేల కోట్ల రూపాయలలో పావలా వంతు ఇస్తే.. ఎక్కడ సంతకం పెట్టమన్నా.. పెడతానని వైఎస్ జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అసెంబ్లీలో చేసిన సవాల్‌కు టీడీపీ నేతలు స్పందించలేదు. కానీ మీడియా ముందు, ఎన్నికల ప్రచారంలో ఆ ఆరోపణలు కొనసాగించారు.
ఆరోపణల్లో వాస్తవం బయటపెట్టిన చంద్రబాబు..
జగన్‌పై లక్ష కోట్ల రూపాయల ఆరోపణలు చేసిన చంద్రబాబు.. 2019 ఎన్నికల నాటికి అసలు నిజం చెప్పేశారు. తాము చేసిన ఆరోపణలు నిజంకాదని ఆయనే పరోక్షంగా ఒప్పుకున్నారు. ‘‘ జగన్‌కు ఎన్నికల ఖర్చు కోసం కేసీఆర్ వెయ్యి కోట్ల రూపాయలు పంపుతున్నారు. వాటిని సరిహద్దుల్లోనే అడ్డుకోండి’’ అని చెబుతూ చంద్రబాబు 2019 ఎన్నికల్లో తన పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇదే విషయం పలుమార్లు చెప్పారు. నారా లోకేష్ కూడా తన తండ్రిని అనుకరించాడు.
ఇక్కడే జగన్‌పై చంద్రబాబు, అనుకూల మీడియా చేసిన లక్ష కోట్ల ఆరోపణలు తేలిపోయాయి. 2014 ఎన్నికల్లో జగన్‌వద్ద లక్ష కోట్ల రూపాయలు ఉన్నాయంటూ ప్రచారం చేసిన చంద్రబాబు.. ఐదేళ్ల తర్వాత 2019 ఎన్నికల్లో జగన్‌కు ఎన్నికల ఖర్చు కోసం కేసీఆర్ వెయ్యి కోట్ల రూపాయలను పంపుతున్నారంటూ మాట్లాడారు. ఇక్కడ చంద్రబాబు మాటలకు పొంతన కుదరడం లేదు. బాబు చెప్పినట్లు జగన్ వద్ద లక్ష కోట్ల రూపాయలు ఉంటే.. ఎన్నికల ఖర్చుకు కేసీఆర్ వెయ్యి కోట్ల రూపాయలు పంపాల్సిన అవసరం ఏముంది..? అనే ప్రశ్న సాధారణ ప్రజలకు కలుగుతుంది. ఈ ప్రచారంతో చంద్రబాబు అంతకు ముందు తాను చేసిన లక్షకోట్ల రూపాయల ఆరోపణలు ఉత్తవేనని నిరూపించారు. లక్షకోట్ల రూపాయల్లో వెయ్యికోట్ల రూపాయలు అంటే.. ఒక్క శాతం మాత్రమే. లక్షకోట్ల రూపాయల్లో వెయ్యి కోట్ల రూపాయలు మినహాయిస్తే.. ఇంకా 99 వేల కోట్ల రూపాయలు ఉంటాయి.
చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌లు.. లక్షకోట్ల రూపాయల ఆరోపణలు వెనుక అసలు నిజం చెప్పిన తర్వాత కూడా టీడీపీ ఎమ్మెల్యేలు.. జగన్‌పై పసలేని, నిజంకాదని తమ అధినేత చెప్పిన అంశాలనే ఇంకా ప్రచారం చేస్తుండంతో వారి సమర్థత, పార్టీ భవిష్యత్‌పై తమ్ముళ్లలో అంతర్మథనం మొదలైంది.