ప్రకాశ్‌ రాజ్‌ను చంపేస్తానంటూ బెదిరింపులు.. యూట్యూబ్‌ చానెల్‌పై కేసు

దక్షిణాది సినీ పరిశ్రమల్లో అతి కొద్ది మంది విలక్షణ నటుల్లో ఒకరు ప్రకాష్ రాజ్. ఆయన నటనకు ఫిదా కాని సినీ అభిమానులు ఉండరంటే అతిశయోక్తి కాదు. అదేవిధంగా దేశంలో జరుగుతున్న సమస్యలు, రాజకీయ, సామాజిక అంశాలపై తరచూ మాట్లాడుతూ వార్తల్లో నిలుస్తుంటారు. ముఖ్యంగా బీజెపీ, ఆ పార్టీ నేతలను టార్గెట్ చేస్తూ ఆయన వ్యాఖ్యలు, ట్వీట్లు ఉంటాయి. తాజాగా వివాదాస్పదంగా నిలిచిన సనాతన ధర్మం వ్యాఖ్యలపై.. తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌కు మద్దతు తెలిపిన సంగతి విదితమే. ఇదే అంశంపై ఆయన మాట్లాడారు. దీంతో ఆయనపై సోషల్ మీడియా వేదికగా బెదిరింపులు, ట్రోల్స్ వచ్చాయి. చంపేస్తామంటూ వార్నింగ్ రావడంతో ఆయన పోలీసులను ఆశ్రయించారు.

చంపేస్తామంటూ బెదిరింపులు రావడంతో నటుడు ప్రకాశ్ రాజ్ ఓ యూట్యూబ్ ఛానల్‌పై బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆ యూట్యూబర్ పై కేసు నమోదు చేశారు. టీవీ విక్రమ ఛానెల్ యూట్యూబ్ ఛానల్లో ప్రకాశ్ రాజ్ కు వ్యతిరేకంగా ఓ వీడియోనున రూపొందించిన యూట్యూబ్ ఛానల్..చంపేస్తామంటూ బెదిరించింది. దీంతో ఆయన రెండు రోజుల క్రితం అశోక్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆ వీడియోలో తనను, తన కుటుంబ సభ్యులపై విషం చిమ్మే వ్యాఖ్యలు చేశారంటూ పేర్కొన్నారు.  నటుడి ఫిర్యాదు ఆధారంగా యూట్యూబర్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ వీడియోను చాలా మంది వీక్షించినట్లు తెలుస్తోంది.

Show comments