బావి నుంచి పెట్రోల్.. బకెట్లతో బారులు తీరిన జనం.. అసలు ఏం జరిగిందంటే?

Dantewada: సాధారణంగా మంచినీటి బావుల్లో నేల తీరును బట్టి ఉప్పు, తియ్యని నీరు వస్తుంది. కానీ దంతెవాడలో నీటికి బదులు పెట్రోల్ రావడం అందరినీ షాక్ కి గురి చేసింది.

Dantewada: సాధారణంగా మంచినీటి బావుల్లో నేల తీరును బట్టి ఉప్పు, తియ్యని నీరు వస్తుంది. కానీ దంతెవాడలో నీటికి బదులు పెట్రోల్ రావడం అందరినీ షాక్ కి గురి చేసింది.

ఈ మధ్య సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి చిత్ర విచిత్రమైన వార్తలు, వీడియోలు వెలుగు చూస్తున్నాయి. దంతెవాడలో ఓ వింత ఘటన వెలుగు చూసింది. ఇక్కడ ఏళ్ల నాటి బావిలో నీటికి బదులు పెట్రోల్‌ వస్తోంది. ఇంటి యజమాని పూజ కోసం బావి నుంచి నీటిని తోడగా బకెట్ లో నీటికి బదులు పెట్రోల్ వచ్చింది. అది చూసి కుటుంబ సభ్యులు మొదట ఆశ్చర్యపోయారు. రెండోసారి బావిలో నుంచి నీటిని తొడారు..ఈసారి కూడా బకెట్‌లో నీళ్లకు బదులు పెట్రోల్‌ వచ్చింది. ఈ విషయం తెలిసి స్థానికులు మొదట షాక్ తిన్నా.. తర్వాత బకెట్లతో అక్కడికి వచ్చి పెట్రోల్ తోడుకొని వెళ్లారు. ఆనోటా.. ఈ నోటా ఈ విషయం పోలీసులకు చేరింది. వెంటనే అధికారులు బావి దగ్గరకు వచ్చి ఆ ప్రాంతాన్ని సీల్ చేశారు. అసలు బావి నుంచి పెట్రోల్ ఎలా వస్తుందన్న విషయం పై విచారణ చేపట్టారు. విచారణలో సంచల విషయాలు వెలుగు చూశాయి. వివరాల్లోకి వెళితే..

దంతెవాడలో గీడం ప్రాంతంలో భోలు జైన్ కుటుంబం నివసిస్తోంది. రెండు రోజుల క్రితం అంటే బుధవారం తెల్లవారుజామున కుటుంబ సభ్యులు బావిలో నుంచి నీటిని తోడారు.రంగు మారిన నీటిని చూసి ఆశ్చర్యపోయారు.కొంతసేపు పరిశీలించిన తర్వాత బకెట్‌లో ఉంది నీరు కాదు పెట్రోల్ అని గ్రహించారు. కొద్దిసేపటికే ఆ వార్త దావానంలా గ్రామం మొత్తం వ్యాపించింది.గ్రామస్థులు ఈ వింత చూసేందుకు ఎగబడ్డారు. కొందరు స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు. ఈ విషయంపై పోలీసుల విచారణలో పలు కీలక విషయాలు వెలుగు చూశాయి.కొద్ది రోజుల క్రితం గ్రామ సమీపంలోని పెట్రోల్ పంప్ యజమాని తమ బంక్ నుంచి పెట్రోల్ దొంగిలిస్తున్నట్లుగా కేసు రిజిస్టర్ చేయించాడు. పోలీసులు కేసును దర్యాప్తు చేశారు. సమీపంలో సీసీ కెమెరాలు పూర్తిగా పరిశీలించారు కానీ ఎవరూ పెట్రోల్ బంక్ నుంచి దొంగిలించినట్లు కనిపించలేదు. దీంతో మరో కోణంలో దర్యాప్తు మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే బావిలో నీరు పెట్రోల్‌గా మారడాన్ని గమనించారు. భోలు జైన్ కుటుంబం నివసిస్తున్న ఇంటికి సుమారు 100 మీటర్ల దూరంలో ఒక పెట్రోల్ పంప్ ఉంది. పెట్రోల్ పంపులోని ఇంధన ట్యాంకు లీకేజీ కారణంగా సమీపంలోని బావిలో దాదాపు 14 వేల లీటర్ల పెట్రోల్ చేరినట్లు పోలీసులు తెలిపారు.

ఇదిలా ఉంటే..పెట్రోలు అత్యంత మండే పదార్థం.. బావిలో నుంచి పెట్రోలు రావడంతో కుటుంబీకులతో సహా గ్రామస్థులు కూడా భయాందోళన వ్యక్తం చేశారు. ఏ క్షణంలో పేలిపోతుందో అని భయంతో వణికిపోతున్నారు. పోలీసులు, తహసీల్దార్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. వీలైనంత త్వరగా లీకేజీని గుర్తించి మరమ్మతులు చేసేందుకు అధికార యంత్రాంగం ప్రయత్నిస్తోందని తెలిపారు.ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని సమస్యను త్వరగా పరిష్కరిస్తామని తహసీల్దార్ తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అగ్నిమాపక దళం, పోలీసులను ఇంటి చుట్టూ మోహరించినట్లు పోలీసు సూపరింటెండెంట్ గౌరవ్ రాయ్ తెలిపారు.ఇలాంటి సంఘటనలపై తక్షణమే అధికారులకు సమాచారం అందించాలని పాలకవర్గం స్థానిక ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Show comments