కేంద్రం సంచలన నిర్ణయం.. ఫేక్‌ న్యూస్‌ ప్రచారం చేస్తే జైలుకే

సోషల్‌ మీడియా వినియోగం పెరిగాక.. ప్రపంచంలో ఏమూల ఏం జరిగినా.. సెకన్ల వ్యవధిలో అందరికి తెలుస్తోంది. ప్రస్తుతం మీడియా హౌజ్‌లకన్నా ఎక్కువగా సోషల్‌ మీడియాలోనే సమాచారం త్వరగా ప్రసారం అవుతుంది. అయితే ఇలా ప్రసారం అయ్యే వార్తల్లో వాస్తవమో కాదో తెలుసుకునే ఓపిక ఎవరికి ఉండటం లేదు. ఏదైనా సమాచారం తెలిసిందా.. వెంటనే దాన్ని ఇతరులకు ఫార్వర్డ్‌ చేయడం అంతే. ఫేక్‌ న్యూస్‌ వ్యాప్తి చేయడం వల్ల కొన్ని సార్లు తీవ్ర సంఘటనలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఫేక్‌ న్యూస్‌ కట్టడి కోసం కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఫేక్‌ వార్తలు ప్రచారం చేస్తే.. జైలుకే పంపిస్తామని స్పష్టం చేసింది.

కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా శుక్రవారం లోక్‌సభలో భారతీయ న్యాయ సంహిత బిల్లు-2023ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. దీని ప్రకారం భారతదేశ సార్వభౌమాధికారం, భద్రతకు హానీ కలిగించే నకిలీ వార్తలు లేదా తప్పుదారి పట్టించే సమాచారాన్ని వ్యాప్తి చేస్తే సెక్షన్‌ 195 ప్రకారం మూడు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తామని వెల్లడించింది. సెక్షన్‌ 195(1)(డీ) ప్రకారం భారతదేశ సార్వభౌమధికారం, సమగ్రత లేదా భద్రతకు భంగం కలిగించే తప్పుడు, అసత్య సమాచారాన్ని తయారు చేసినా, ప్రచారం చేసినా.. మూడు సంవత్సరాల వరకు పొడిగించబడే జైలు శిక్ష లేద జరిమానా.. కొన్ని సందర్భాల్లో రెండూ విధించబడతాయి అని తెలిపారు.

ఈ విభాగాన్ని బిల్లులోని 11వ అధ్యాయంలోని ప్రజా ప్రశాంతతకు వ్యతిరేకంగా నేరాలు కింద, ఆరోపణలు, జాతీయ సమైక్యతకు విఘాతం కలిగించే వాదనలు అనే అంశం క్రింద ఉంది. ప్రస్తుతం ఈ సెక్షన్‌ ఐసీసీలోని 153బీ కింద ఉన్న ఆరోపణలు, జాతీయ సమైక్యతకు విఘాతం కలిగించే వాదనలకు సంబంధించిన నిబంధనలు ఉన్నాయి.

Show comments