ఫేస్‌బుక్‌ పరిచయం ప్రియుడి కోసం పాకిస్తాన్‌ వెళ్లిపోయింది..

ప్రేమించిన వారి కోసం ఓ దేశం నుంచి మరో దేశం వెళ్లటం సర్వ సాధారణంగా జరిగే విషయమే. కానీ, దాయాది దేశాల మధ్య ప్రేమ కలాపాలు.. రాకపోకలు చాలా ఇబ్బందుల్ని కొని తెస్తాయి. ఈ విషయం తెలిసి కూడా కొంతమంది ప్రేమ కోసం పాకిస్తాన్‌ నుంచి ఇండియాకు.. ఇండియానుంచి పాకిస్తాన్‌కు చక్కర్లు కొడుతున్నారు. కొద్దిరోజుల క్రితం సీమా హైదర్‌ అనే వివాహిత తన ప్రియుడ్ని కలుసుకోవటానికి పాకిస్తాన్‌ నుంచి ఇండియాకు వచ్చింది. ప్రస్తుతం కేసుల్లో చిక్కుకుని విచారణ ఎదుర్కొంటోంది. ఆమెతో పాటు ఆమె ప్రియుడు కూడా కేసులో చిక్కుకున్నాడు.

ఈ సంఘటన మరువక ముందే మరో సంఘటన చోటుచేసుకుంది. ఓ భారత మహిళ తన ప్రియుడి కోసం పాకిస్తాన్‌కు వెళ్లింది. అయితే, చట్టబద్ధంగానే పాకిస్తాన్‌కు వెళ్లింది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఆ పూర్తి వివరాల్లోకి వెళితే.. రాజస్తాన్‌లోని భివాండికి చెందిన అంజు అనే 35 ఏళ్ల మహిళ ఓ కంపెనీలో పని చేస్తోంది. నాలుగేళ్ల క్రితం ఈమెకు ఫేస్‌బుక్‌ ద్వారా నజ్రుల్లా అనే 29 ఏళ్ల వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆ పరిచయం కాస్తా కొద్ది కాలానికి ప్రేమగా మారింది.

అతడిది పాకిస్తాన్‌ అని తెలిసినా ఆమె నజ్రుల్లాతో ప్రేమను కొనసాగించింది. కొన్ని నెలల క్రితం ఇద్దరూ కలుసుకోవాలని అనుకున్నారు. నజ్రుల్లా పాకిస్తాన్‌నుంచి రావటం కుదరదు కాబట్టి.. అంజునే పాకిస్తాన్‌ వెళ్లటానికి సిద్దమైంది. పాకిస్తాన్‌కు వెళ్లటానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. వీసాతో పాటు ఇతర అధికారిక లాంఛనాలను పూర్తి చేసింది. జైపూర్‌ వెళుతున్నానని భర్తకు చెప్పి పాకిస్తాన్‌ బయలుదేరింది. అయితే, అంజు పాకిస్తాన్‌లోకి అడుగుపెట్టగానే అక్కడి అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

అన్ని డాక్యుమెంట్లు సరిగ్గా ఉన్నా సరే ఆమెను విచారించారు. తాను తన లవర్‌ను కలవటానికి పాకిస్తాన్‌కు వచ్చినట్లు ఆమె తెలిపింది. దీనిపై నజ్రుల్లా కుటుంబసభ్యులు స్పందించారు. ఆమె పాకిస్తాన్‌కు కేవలం టూరు కోసం మాత్రమే వచ్చిందని, పెళ్లి కోసం కాదని తెలిపారు. ఆమె ఓ 30 రోజుల పాటు పాకిస్తాన్‌లో ఉంటుందని అన్నారు. ప్రస్తుతం ఈ వార్త దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments