పాప్ మ్యూజిక్‌ను ఇష్టపడే వారు చాలా మందే ఉన్నారు. పాప్ సంగీతం అంటే చెవి కోసుకునే వారి సంఖ్య కోట్లలోనే ఉంది. పాప్ స్టార్స్‌కు ఉండే పాపులారిటీ అంతా ఇంతా కాదు. ఫిలిం స్టార్స్, స్పోర్ట్స్ సెలబ్రిటీలకు ఉండే రేంజ్లో వీళ్లకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఫుల్ క్రేజ్ కలిగిన పాప్ స్టార్ సింగర్లలో బ్రిట్నీ స్పియర్స్ ఒకరు. ఆమె పేరు చెబితే చాలు.. అభిమానులు పూనకాలతో ఊగిపోతారు. అంతలా సంగీత ప్రపంచంపై తనదైన ముద్ర వేశారు బ్రిట్నీ. సింగర్‌గానే గాక పాటల రచయిత్రిగానూ ఆమె తన ప్రతిభను నిరూపించుకున్నారు. బ్రిట్నీ నుంచి ఒక ఆల్బమ్ వస్తోందంటే చాలు.. ప్రేక్షకులు కళ్లలో వత్తులు వేసుకొని మరీ ఎదురు చూసేవారు.
బ్రిట్నీ స్పియర్స్ తన పాటలతో వరల్డ్ వైడ్‌గా కోట్లాది మంది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. ఆమె షోలను చూసేందుకు ఆడియెన్స్ ఎగబడేవారు. బ్రిట్నీ ప్రొఫెషనల్ లైఫ్‌తో పాటు ఆమె పర్సనల్ లైఫ్‌లో జరిగే విషయాలను తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తుంటారు ఫ్యాన్స్. అలాంటి బ్రిట్నీ స్పియర్స్‌కు ఘోర అవమానం ఎదురైంది. లాస్ వెగాస్‌లోని ఒక హోటల్లో ఆమెకు అవమానం జరిగింది. పాపులర్ ఎన్బీఏ స్టార్, ఫ్రాన్స్‌కు చెందిన విక్టర్ వెంబన్యామ (19) అంటే బ్రిట్నీకి చాలా ఇష్టం. తాను డిన్నర్‌కు వెళ్లిన హోటల్లో వెంబన్యామ తారసపడటంతో అతడితో ఫొటో దిగేందుకు బ్రిట్నీ స్పియర్స్ వెంటపడ్డారు. అతడి వీపు మీద బ్రిట్నీ వెనుక నుంచి చరిచారు. అయితే సెక్యూరిటీ సిబ్బంది ఆమెను నెట్టేశారు.
సెక్యూరిటీ సిబ్బంది నెట్టేయడంతో బ్రిట్నీ స్పియర్స్ కిందపడిపోయారు. ఆమె కళ్లద్దాలు కూడా కిందపడ్డాయి. ఈ ఘటనపై ఆమె ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. సంగీత ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన బ్రిట్నీకి ఇంతటి అవమానమా అంటూ ఈ ఘటనపై సోషల్ మీడియాలో నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. ఈ ఘటనపై వెంబన్యామ స్పందిస్తూ.. ఎవరో తనను వెనుక నుంచి వచ్చి గట్టిగా హత్తుకున్నారని, దీంతో సెక్యూరిటీ సిబ్బంది బలంగా నెట్టేశారని అన్నారు. వాళ్లు తోసింది బ్రిట్నీ స్పియర్స్‌ను అని తర్వాత తెలిసిందన్నారు. మరోవైపు బ్రిట్నీ మాత్రం తాను వెంబన్యామను బలంగా కొట్టలేదని, సున్నితంగా పిలిచానని చెబుతూ నెట్టింట విషయాన్ని వివరిస్తూ ఒక పోస్ట్ చేశారు.