Narayana Das K Narang ఏషియన్ అధినేత ఇక లేరు

ప్రముఖ పంపిణీదారులు, వ్యాపారవేత్త, నిర్మాత నారాయణదాస్ నారంగ్(76) ఇవాళ హైదరాబాద్ లో కన్ను మూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నారాయణ్ దాస్ చికిత్స కోసం స్టార్ హాస్పిటల్ లో చేరారు. వైద్యులు ఎంతగానో ప్రయత్నించినప్పటికీ కోలుకోలేక ఉదయం 9 గంటల ప్రాంతంలో తుది శ్వాస తీసుకున్నారు. ఈయనకు ఇద్దరు కుమారులు. సునీల్ నారంగ్ సంస్థ వ్యవహారాల్లో చురుగ్గా ఉండగా భరత్ నారంగ్ సైతం తన వంతు పాత్ర పోషిస్తున్నారు. కుమార్తె కూడా ఉన్నారు. నారాయణదాస్ నారంగ్ ప్రస్తుతం చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షులుగా ఉన్నారు. టికెట్ రేట్లకు సంబంధించిన చర్చల్లో పలుమార్లు పాల్గొన్నారు.

నారాయణదాస్ జన్మదినం 1946 జులై 27. విభజన సమయంలో వీళ్ళ కుటుంబం పాకిస్థాన్ నుంచి భారతదేశానికి వచ్చి ఇక్కడే స్థిరపడిపోయింది. భాగ్యనగరంలో పలు వ్యాపారాలను విజయవంతంగా నిర్వహించాక సినిమా ఫైనాన్స్ లోకి అడుగు పెట్టారు. ఆపై డిస్ట్రిబ్యూటర్ గా మారి ఎన్నో బ్లాక్ బస్టర్స్ ని పంపిణీ చేసి గొప్ప పేరు సంపాదించుకున్నారు. రియల్ ఎస్టేట్ బిజినెస్ లోనూ నారాయణ దాస్ తనదంటూ ముద్ర వేయగలిగారు. థియేటర్లను మొదలుపెట్టాక ఏషియన్ ఒక బ్రాండ్ గా జనంలోకి వెళ్లిపోయింది. మల్టీ ప్లెక్సులూ ప్రారంభించి సామాన్యుడికి వినోదాన్ని మరింత చేరువ చేశారు.

మహేష్ బాబుతో కలిసి ఏఎంబి సూపర్ ప్లెక్స్ ద్వారా ఒక కొత్త ట్రెండ్ ని సృష్టించారు. విజయ్ దేవరకొండతో మెహబూబ్ నగర్ లో ఇటీవలే మల్టీ ప్లెక్స్ స్టార్ట్ చేశారు. అమీర్ పెట్ సత్యం థియేటర్ స్థలంలో కడుతున్న అల్లు అర్జున్ మల్టీ ప్లెక్స్ సిద్ధమవుతోంది. దాని ఓపెనింగ్ జరగకుండానే నారాయణ దాస్ కాలం చేశారు. ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరితో సత్సంబంధాలు కలిగి ఉన్న పెద్దమనిషి ఇలా లోకం వదిలి వెళ్లిపోవడం విచారకరం. నిర్మాతగా గత ఏడాది నిర్మించిన లవ్ స్టోరీ బ్లాక్ బస్టర్ సక్సెస్ కావడం ఏషియన్ బ్యానర్ కు మంచి పేరు తీసుకొచ్చింది. నాగార్జున ది ఘోస్ట్ తో పాటు ధనుష్ సర్ సినిమాలు నిర్మాణంలో ఉన్నాయి

Show comments