Animal Review: కొన్ని మినహా, యానిమల్ సినిమాకి తిరుగులేదు

దేశ వ్యాప్తంగా ఈగర్ గా వెయిట్ చేస్తున్న మూవీ యానిమల్. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 1న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాతో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా హ్యాట్రిక్ హిట్ కొట్టాడా లేదా అనేది ఈ రివ్యూ ద్వారా చూద్దాం.

దేశ వ్యాప్తంగా ఈగర్ గా వెయిట్ చేస్తున్న మూవీ యానిమల్. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 1న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాతో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా హ్యాట్రిక్ హిట్ కొట్టాడా లేదా అనేది ఈ రివ్యూ ద్వారా చూద్దాం.

మొత్తం దేశాన్ని ఉర్రూతలూగించి, ఊరించి ఊరించి ఈ రోజున ఎన్నో భాషలలో, ప్రపంచవ్యాప్తంగా ధియేటర్స్ లోకి దూసుకొచ్చింది సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తాజా చిత్రం యానిమల్. ఇంతకు ముందే రిలీజ్ చేద్దామనుకున్నా కూడా అనివార్యకారణాల వల్ల విడుదల లేట్ అయినా లేటెస్ట్ గా వచ్చింది యానిమల్. దర్శకుడు సందీప్ రెడ్డి గతంలో చేసిన కబీర్ సింగ్ సినిమా తెచ్చిన ఫేం కారణంగా సందీప్ తర్వాతి సినిమాగా వస్తున్న యానిమల్ సినిమా మీద అంతులేని అంచనాలు పేరుకున్నాయి. దీంతో పాటు, యానిమల్ సినమాలో తారాగణం కూడా సినిమాకి ఇంత ఫోకస్ రావడానికి మరో ప్రధానమైన కారణమైంది. ఆ మధ్యలో విడుదలైన ట్రైలర్ అందరి మతి పోగొట్టింది.

సినిమా ప్రేమికులకు జ్వరాలొచ్చాయి ట్రైలర్ చూసి. ఇదే యానిమల్ సినిమాకి రికార్డు స్థాయిలో ప్రీబుకింగ్స్ రావడానికి దోహదపడింది. ప్రీబుకింగ్ వసూళ్ళు దుమ్ము లేచిపోయాయి. పైన చెప్పినట్టుగా, రణబీర్ కపూర్ ఇంతవరకూ సాధించిన ఇమేజ్ సినిమాకి చాలా పెద్ద హెల్ప్ అయింది. బాబీడియోల్ కూడా ప్లస్ అయ్యాడు. అనిల్ కపూర్ సరేసరి. రష్మిక మందానా కూడా మంచి అట్రాక్షన్.

కథలోకి వెళ్తే..

తండ్రి(అనిల్ కపూర్) పెద్ద బిజినెస్ మాగ్నెట్. క్షణం కూడా తీరికలేని వ్యవహారం. పిల్లల్ని పట్టించుకోలేని, ఫ్యామిలీకి ఏమాత్రం సమయాన్ని కేటాయించలేని పనుల్లో తలమునకలై ఉండే మనిషి. కొడుకు(రణబీర్ కపూర్) తండ్రిని అమితంగా ప్రేమిస్తాడు చిన్ననాటి నుంచి. కానీ, తన ప్రేమకి, అభిమానానికి సరిపోయినట్టుగా ఎప్పుడూ కొడుకుతో గడపలేని, ముద్దుముచ్చటా తీర్చలేని బిజీలో తండ్రి. తండ్రి అనురాగం కొంచెం కూడా పొందలేకపోయినా, తండ్రి పట్ల తన ప్రేమను అలాగే నిలుపుకుని, తండ్రి కోసం ప్రతీ క్షణం ఎదురుచూసే కొడుకు తండ్రి చుట్టూ పొంచి ఉన్న ప్రమాదాలను తిప్పికొట్టే పనిలో పడతాడు. కొడుకు తనను కాపాడడానికే తపిస్తున్నాడని తెలుసుకోకుండా కొడుకు మీద అనుక్షణం చిరాకు పడే స్థితిలోనే తండ్రి కనబడతాడు. చివరికి భార్య(రష్మిక మందానా)తో తండ్రి కోసం తగాదాకి దిగేంత వెర్రిప్రేమను ప్రదర్శించి భార్య కోపానికి కూడా గురవుతాడు కొడుకు. సినిమా ద్వితీయార్ధంలో ప్రత్యక్షమయ్యే మరో కొడుకు(బాబీడియోల్) తండ్రికి ఆపద తలపెడుతున్నాడని తెలుసుకుని అతనిని కూడా చంపుతాడు రణబీర్ కపూర్. చివరకు కొడుకు ప్రేమను గ్రహించిన తండ్రిలో ఏ రకమైన పరివర్తన వచ్చింది, అది కొడుకు ప్రేమకు సరిపోయిందా? కొడుకు సంతోషానికి కారణమైందా? ఇవే క్లైమాక్సును పండించాయి.

సినిమా ఎలా ఉందంటే..
సందీప్ రెడ్డి వంగా రాసుకున్న కథ ఆద్యంతం కొత్తగా ఉంది. తండ్రీ కొడుకుల మధ్య రాగద్వేషాలు, బేధాభ్రియాలు, ఏజ్ గ్యాప్ వల్లే వచ్చే తేడాలు ఇవన్నీ ఎన్నో సినిమాలుగా వచ్చాయి. కానీ, సందీప్ ఎంచుకున్న కథాంశం మాత్రం సరికొత్తగా ఉంది. ప్రతీ సీను, ప్రతీ డైలాగ్ ఫ్రెష్గా ఉన్నాయి. కథ కొత్తది కావడం కారణంగా సీన్లున్నీ కొత్తగా, ప్రతీ పాత్ర మాట్లాడే మాట గుండెకు హత్తుకునే విధంగా ఆకట్టుకున్నాయి. రణబీర్ పెర్ఫార్మెన్స్ కామెంట్ చేయలేనట్టుగా ఉంది. నిజానికి రణబీర్కి ఇది ఓ సాహసం. సాహసాన్ని పండించే మెరిట్ని చూపించాడు. అనిల్ కపూర్, బాబీడియోల్ సినిమాకి అటూఇటూ గట్టి సపోర్ట్ నిచ్చాయి. రష్మికకి డైరెక్టర్ పెర్ఫార్మెన్స్ చేయడానికి స్కోపు కల్పించాడు. కథను, తద్వారా సినిమాని బరువెక్కించడానికి రష్మిక పాత్రని సందీప్ బాగా ఉపయోగించుకున్నాడు. దర్శకుడు సందీప్ ఈ ప్రయోగాన్ని విజయవంతంగానే పూర్తి చేశాడు. రీరికార్డింగ్ అద్భుతం. పాటలు కూడా ఇంత వైలెంట్ సినిమాలో సైలెంట్ ఫ్యాషన్లో హాయిగా ఉన్నాయి. కెమెరా వర్క్ ఎక్స్లెలెంట్.

మైనస్ లంటే..
కథ ఎక్కువగా రాసుకున్నాడు సందీప్. కొన్ని సీన్లు తీసేసినా ఫరక్ పడదు. ఇటువంటి కథకు అంత లెంత్ అవసరం లేదు. ఫామిలీడ్రామా సినిమాకి అంత వయలెన్స్, రక్తపాతం అవసరమా అనిపిస్తుంది. సెకండాప్ మొత్తం స్క్రీన్ రక్తంతో తడిసి ముద్దయిపోయింది. బ్యాటిల్ గ్రౌండ్‌లో వాడాల్సినంత పెద్ద వెపన్‌ని ఓ బిల్డింగ్‌లో భీభత్సం కోసం వాడడం కొంత అతిశయోక్తిలా అనిపించింది. పైగా ఇండియాలోనే తయారైన ఈ వెపన్‌కి ఆత్మ నిర్భర్ భారత్ అని కూడా వాడడం పూర్తిగా అసందర్భం. కథతో సంబంధం లేకపోయినా రష్మిక, రణబీర్ మద్యలో ఓ పెద్దసీను తీశాడు సందీప్. కథకి అది ఏమాత్రం అవసరం లేదు. రష్మిక బాగా చేసింది అనిపించుకోవడానికి తప్పితే మరో ప్రయోజనం లేని సీన్ అది. ఇలా కొంత పొదుపుగా సీన్లు పొందుపరిచి ఉంటే సినిమా మరింత స్పీడుగా, ఎఫెక్టివ్ గా ఉండేది. కానీ సందీప్ అంత లెంత్ ఉంటే గానీ చెప్పలేడేమో మరి.

విశ్లేషణ ఎలా ఉన్నా, యానిమల్ తప్పనిసరిగా చూడాల్సిన సినిమా. బిజీ తండ్రులకి ఇదొక గుణపాఠం. తల్లదండ్రులను ఎలా ప్రేమించాలి అని తెలుసుకోవడానికి కొడుకులకి ఒక అవకాశం. దేశమొత్తం మీద వెర్రెక్కిపోతున్న యానిమల్ జైత్రయాత్రకి తిరుగులేదు.

Show comments