మూవీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది నటీనటులు వస్తుంటారు. అయితే వారిలో కొందరు మాత్రమే ఇక్కడ సెటిల్ అవుతారు. పరిశ్రమలో నెగ్గుకు రావాలంటే ఎంత టాలెంట్ ఉన్నా కాసింత లక్ కూడా ఉండాలి. హిట్లు ఉన్నవారికే ఇక్కడ అవకాశాలు. ఎంత గొప్ప నటులైనా, ఎంత ప్రతిభావంతులైనా విజయాలు లేకపోతే ఛాన్సులు రావడం కష్టమే. ఇక, హీరోయిన్ల విషయంలోనైతే ఇది మరింత ఎక్కువనే చెప్పాలి. ఎంత అందంగా ఉన్నా, నటించే టాలెంట్ ఉన్నా సక్సెస్ రేట్ లేకపోతే హీరోయిన్లకు అవకాశాలు రావు. ఇది చాలా మంది విషయంలో చూస్తూనే ఉన్నాం. హీరోయిన్ల విషయంలో సక్సెస్ రేట్‌ను ఇంకా ఎక్కువగా చూస్తారు. కాబట్టి వాళ్లు తమ కెరీర్‌ను చక్కగా ప్లాన్ చేసుకోవాలి.
ఎడాపెడా ఏ సినిమా పడితే అది ఒప్పుకోకుండా నటనకు ఛాన్స్ ఉన్న మూవీస్‌ను హీరోయిన్లు ఎంచుకోవాలని విశ్లేషకులు అంటున్నారు. ఇదిలా ఉంటే.. ఈ మధ్య మలయాళ భామలు తెలుగులో ఎక్కువగా హవా నడిపిస్తున్నారు. ఈ కోవలో ఇక్కడకు వచ్చిన వారిలో ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’ ఫేమ్ అర్థనా బిను ఒకరు. 2016లో రిలీజైన ఈ మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు అర్థనా. ఇందులో రాజ్‌తరుణ్‌కు ఆమె జంటగా నటించారు. అర్థనా బిను చూసేందుకు అచ్చం తెలుగమ్మాయిలా ఉంటారు. అయితే ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’ అంతగా ఆడకపోవడంతో ఈ మలయాళీ బ్యూటీకి మళ్లీ ఛాన్సులు రాలేదు.
తెలుగులో ఛాన్సులు రాకపోయినా తమిళ, మలయాళ చిత్రాలతో అర్థనా బిను ఫుల్ బిజీగా ఉన్నారు. అలాంటి ఆమె తాజాగా తన తండ్రి విజయకుమార్‌పై షాకింగ్ ఆరోపణలు చేశారు. తన తల్లి నుంచి విజయకుమార్ డివోర్స్ తీసుకోవడంతో ఆయనకు అర్థనా కూడా దూరంగా ఉంటున్నారు. అలాంటి ఆయన అక్రమంగా ఆమె ఇంట్లోకి చొరబడ్డారు. దీంతో ఈ వ్యవహారాన్ని అర్థనా వీడియో తీసి ఇన్‌స్టాలో షేర్ చేశారు. తన అమ్మ నుంచి విడాకులు తీసుకున్నప్పటికీ అప్పుడప్పుడు ఇలా ఇంటికి వచ్చి గందరగోళం చేస్తుంటాడని ఆమె ఆరోపించారు. తన తండ్రిపై ఎన్నిసార్లు కంప్లయింట్ చేసినా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని అర్థనా బినా తెలిపారు.
‘ఈరోజు ఆయన మా ఇంటి కాంపౌండ్‌లోకి అక్రమంగా ప్రవేశించాడు. అప్పటికే మేం ఇంటి లోపల నుంచి డోర్ లాక్ చేయడంతో కిటికీ ద్వారా బెదిరింపులకు దిగాడు. నా చెల్లెలితో పాటు అందర్నీ చంపేస్తానని బెదిరించాడు. సినిమాల్లో నటించడం ఆపేయ్ లేదా తను చెప్పిన మూవీస్‌లోనే యాక్ట్ చేయాలని షరతులు పెడుతున్నాడు. నాతో ఉండే యాక్టర్స్ గురించి తప్పుగా మాట్లాడుతున్నాడు. ఆఖరికి మా అమ్మ పనిచేసే ప్రదేశంతో పాటు సోదరి చదువుకునే కాలేజీకి వెళ్లి అక్కడా గందరగోళం సృష్టించాడు. ఈ విషయంపై కోర్టులో కేసు పెట్టాం. కేసు విచారణలో ఉండగానే మా ఇంటికి వచ్చి మళ్లీ వార్నింగ్ ఇస్తున్నాడు’ అని అర్థనా బినా చెప్పుకొచ్చారు.