Ayodhya History: అయోధ్య చరిత్ర.. బాబ్రీ మసీదుకి ముందు ఆ తర్వాత జరిగిందిదే!

Ayodhya Ram Mandir History & Full Story in Telugu: బాబ్రీ మసీదు నుంచి అయోధ్య రామ మందిరం వరకూ జరిగిన సంఘటనలు ఏంటో ఈ కథనంలో పూర్తిగా తెలుసుకోండి. 

Ayodhya Ram Mandir History & Full Story in Telugu: బాబ్రీ మసీదు నుంచి అయోధ్య రామ మందిరం వరకూ జరిగిన సంఘటనలు ఏంటో ఈ కథనంలో పూర్తిగా తెలుసుకోండి. 

బాబ్రీ మసీదు కంటే ముందు నుంచే వేల సంవత్సరాల నుంచి అయోధ్య రామ మందిరం ఉంది. అయోధ్య రామ మందిరం నుంచి బాబ్రీ మసీదుగా మారి.. దాదాపు 500 ఏళ్ల పోరాటం తర్వాత బాబ్రీ మసీదు నుంచి అయోధ్య రామ మందిరంగా తిరిగి తన శోభను సంతరించుకుంటుంది. ఈ క్రమంలో ఎదురైన సంఘటనలు, కోల్పోయిన ప్రాణాలు.. పోరాటాలు వంటి పూర్తి వివరాలు మీ కోసం.  

అయోధ్య రామ మందిరం చరిత్ర: మొట్టమొదటి పునాది

అయోధ్య.. ఈ పేరు పురాణాల్లోని ఆయుధ్ అనే మహారాజు నుంచి వచ్చింది. ఆయుధ్ అనే పదం సంస్కృత పదమైన యుధ్ నుంచి వచ్చింది. ఆయుధ్ మహారాజు పుట్టడం వల్ల ఆ నగరానికి అయోధ్య అనే పేరు వచ్చిందని చెబుతారు. ఆయుధ్ మహారాజు శ్రీరాముని పూర్వీకులు అని చెబుతారు. శ్రీరాముడు అవతరించిన ప్రదేశం ఈ అయోధ్య. ఒకప్పుడు కోసల రాజ్యానికి రాజధానిగా ఉండేది ఈ అయోధ్య. ఈ అయోధ్య నగరాన్ని దశరథ మహారాజు పరిపాలించేవాడు. అయితే పుత్రులు లేని లోటుతో ఉన్న దశరథ మహారాజుకి పుత్రకామేష్టి యాగం వల్ల రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు జన్మిస్తారు. కొన్నేళ్ళకు విశ్వామిత్రుడు వచ్చి రాముడ్ని తన వెంట తీసుకెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. రావణ సంహారం, రామావతారం చాలించడం తెలిసిందే. రాముడు జన్మించిన పుణ్యస్థలం కాబట్టి అయోధ్యలో.. రాముడి కుమారుల్లో ఒకరైన కుశుడు రామ మందిరాన్ని నిర్మించాడు. ఆ సమయంలో అయోధ్యలో 3 వేల సీతారామాలయాలు ఉండేవని చెబుతారు. అయితే సామాన్య శక పూర్వం 5వ శతాబ్దంలో చాలా ఆలయాలు పాడైపోయాయని.. వాటిని ఉజ్జయిని రాజు అయినటువంటి విక్రమాదిత్యుడు బాగు చేయించాడని చెబుతారు. అప్పటి నుంచి చాలా ఏళ్ల పాటు ఆ మందిరాలు పూజలతో కళకళలాడేవి. 

1034: అయోధ్యపై సాలార్ మసూద్ ఘాజి దాడికి యత్నం

సాలార్ మసూద్ ఘాజి.. ఇతను మహ్మద్ గజినీ మేనల్లుడు. అనేక సార్లు సోమ్ నాథ్ ఆలయాన్ని లూటీ చేసిన మహ్మద్ గజినీ మేనల్లుడే ఈ సాలార్ మసూద్ ఘాజి. ఢిల్లీ, మీరట్, బులంద్ షహర్, బుదౌన్, కన్నాజ్ రాజులను ఓడించి ఆలయాలను ధ్వంసం చేసుకుంటూ ఉత్తరప్రదేశ్ లోని బారాబంకి చేరుకున్నాడు. బహ్రైచ్ మీద దాడి చేసి అయోధ్య చేరుకోవాలనుకున్నాడు మసూద్ ఘాజి. లక్ష 30 వేల మంది సైన్యంతో సాలార్ మసూద్ ఘాజీ బహ్రైచ్ పై దాడికి యత్నించాడు. ఆ సమయంలో శ్రావస్తి రాజ్యానికి చెందిన మహారాజా సుహేల్ దేవ్.. పక్క రాజ్యాల రాజులతో కలిసి.. సాలార్ మసూద్ కి చెందిన లక్ష 30 వేల మంది సైన్యాన్ని నేలమట్టం చేశాడు. దీంతో భయపడి ఆఫ్ఘన్ కి పారిపోయే ప్రయత్నం చేశాడు సాలార్ మసూద్ ఘాజి. సాలార్ మాసూద్ పారిపోతుంటే భోజ మహారాజు వెంటపడి మరీ తల నరికాడు. ఆ తర్వాత సాలార్ మసూద్ ఘాజి శవాన్ని బహ్రైచ్ లోనే సమాధి చేశారు. శత్రువైనప్పటికీ అతని ఆచారం ప్రకారం సమాధి చేశారు. ఆ తర్వాత చాలా ఏళ్ల పాటు భారతదేశం వైపు చూడాలంటేనే భయపడేవారు. 

1526: అయోధ్యలో కాలుమోపిన బాబర్ 

1526లో బాబర్, ఇబ్రహీం లోడి మధ్య యుద్ధం మొదలైంది. దీని పేరు పానిపట్టు యుద్ధం. 1526లో జరిగిన యుద్ధం మొఘలుల పరిపాలనకు నాంది పలకగా.. 1556లో జరిగిన రెండో యుద్ధం మొఘలుల పట్టు నిలుపుకునేందుకు కారణమైంది. మూడవ యుద్ధం 1761లో జరిగింది. ఇది మొఘలుల పాలన అంతమయ్యేందుకు కారణమయ్యింది. అయితే బాబర్, లోడీ మధ్య యుద్ధం తర్వాత అంటే 1528వ సంవత్సరం వచ్చేసరికి బాబర్ అయోధ్య మీద పూర్తిగా తన పట్టు సంపాదించుకున్నాడు. 

1528: అయోధ్య రామ మందిరాన్ని కూల్చమన్న బాబర్?

ప్రభుత్వ గెజిట్‌లలో దీని ప్రస్తావన ఉంది. దీని ప్రకారం 1528వ సంవత్సరంలో అప్పటికి అయోధ్యలో ఉన్న మందిరాలను కూల్చమని తన కమాండర్ మీర్ బాఖీకి ఆదేశాలు ఇచ్చాడు బాబర్. దీంతో అయోధ్యలో చాలా మందిరాలను కూల్చాడు మీర్ బాఖీ. వాటిలో అయోధ్య రామ మందిరం కూడా ఒకటి. అయితే అయోధ్య రామ మందిరాన్ని కూల్చి బాబర్ పేరు మీదుగా మసీదు కట్టించాడు. అదే బాబ్రీ మసీదు అయ్యింది. ఒక్క అయోధ్యనే కాకుండా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలను కూడా బాబర్ తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. బాబర్ తర్వాత చాలా ఏళ్ల పాటు మొఘలుల పాలన సాగింది. అయితే గుజరాత్ క్యాడర్ మాజీ ఐపీఎస్ ఆఫీసర్ కిషోర్ కునాల్ రాసిన ‘అయోధ్య రీవిజిటెడ్’ పుస్తకంలో రామ మందిరం కూల్చివేత గురించి రాసుకొచ్చారు. దీని ప్రకారం.. రామ మందిరం కూల్చివేత అనేది 1528లో జరగలేదని.. ఔరంగజేబు పాలనలో 1660లో జరిగింది. ఆ కూల్చివేసిన మందిరం మీదనే బాబర్ మసీదు కట్టించాడని చరిత్రకారులు క్లెయిమ్ చేస్తున్నారు. ఈ రెండు క్లెయిమ్స్ లో ఏది నిజమో తెలియదు కానీ మసీదుగా మారిన అయోధ్య రామ మందిరంలోకి ఆనాటి నుంచి ఒక్కరు కూడా అడుగుపెట్టలేదు. ఎప్పుడైతే రాజా జై సింగ్ వచ్చాడో.. అప్పుడే హిందువులకు ధైర్యం వచ్చింది.

1717: బాబ్రీ మసీదు స్థలాన్ని రాముడి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించిన రాజా జై సింగ్: 

అది 1717వ సంవత్సరం. బాబ్రీ మసీదు నిర్మించిన 190 సంవత్సరాల తర్వాత రాజ్ పుత్ వంశానికి చెందిన.. రాజా జై సింగ్ రాజు మసీదు చుట్టూ ఉన్న స్థలాన్ని సొంతం చేసుకోవాలని ప్రయత్నించాడు. కానీ ఆ ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఆ స్థలం హిందువులకు ఎంత ముఖ్యమో తెలిసిన రాజా జై సింగ్.. మొఘలులతో సత్సంబంధాలు ఏర్పరచుకున్నాడు. కానీ తాను అనుకున్నది జరగలేదు. దీంతో బాబ్రీ మసీదు బయట ఉన్న స్థలాన్ని కొని రాముడి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాడు. ఆ తర్వాత మసీదు ఎదురుగా ఉన్న స్థలంలో ఒక రామ్ చబుత్ర అనే పేరు మీద వేదిక కట్టి దాని మీద సీతారాముల విగ్రహాలు పెట్టుకుని హిందువులు పూజలు చేసుకునేవారు. ముస్లింలు మసీదు లోపల ప్రార్థనలు చేసుకునేవారు. 

1855: హనుమాన్ గర్హి ఆలయం వద్ద ఘర్షణలు

1855లో అయోధ్యలో హనుమాన్ గర్హి ఆలయం వద్ద సున్ని ముస్లింలు మరియు బైరాయ్ ల మధ్య ఘర్షణలు జరిగాయి. మసీదుని కూల్చి హనుమాన్ గర్హి ఆలయాన్ని నిర్మించారని వాదించారు. అయితే నవాబ్ వాజిద్ అలీ షా జోక్యం చేసుకుని గొడవను సద్దుమణిగేలా చేశాడు. 

1859: కంచెతో మసీదుని, మందిరాన్ని వేరు చేసిన బ్రిటిష్ ప్రభుత్వం

1859లో స్థానికులు బాబ్రీ మసీదు ఉన్న స్థలం రామ జన్మస్థలం అని నమ్మారు. అయితే బ్రిటిష్ వారు ఆ స్థలంలో ఒక కంచె ఏర్పాటు చేశారు. దీంతో ముస్లింలు మసీదు లోపల, హిందువులు మసీదు బయట ప్రార్థనలు చేసుకోవడం మొదలుపెట్టారు. 

1885: రామ మందిర నిర్మాణం కోసం మొట్టమొదటి పిటిషన్ 

1885లో మొదటిసారిగా అయోధ్య నివాసి మహంత్ రఘువీర్ దాస్.. మసీదు బయట స్థలంలో వేదిక లేదా రామ్ చబుత్ర నిర్మించుకోవడానికి అనుమతి ఇవ్వాలని ఫైజాబాద్ జిల్లా కోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఆ పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది.

మార్చి 1934: బాబ్రీ మసీదుపై దాడి 

1934లో షాజహాన్ పూర్ లో గోహత్య వార్త వైరల్ అవ్వడంతో మతపరమైన అల్లర్లు చోటు చేసుకున్నాయి. ఈ అల్లర్లలో బాబ్రీ మసీదుపై దాడి జరిగింది. ఆ తర్వాత ప్రభుత్వం మసీదుని మరమ్మత్తు చేయడం జరిగింది.   

1938-1947: మసీదు తమదే అంటూ క్లెయిమ్ చేసుకున్న సున్నీ, షియాలు 

బాబ్రీ మసీదు ఉన్న 2.77 ఎకరాల స్థలం తమదే అంటూ షియా మరియు సున్నీ వక్ఫ్ బోర్డులు స్థానిక కోర్టులో క్లెయిమ్ చేశాయి. బాబర్ సున్నీ అయినందున.. ఆ భూమి సున్నీల ఆస్తి సున్నీ వక్ఫ్ బోర్డు తెలపడంతో స్థానిక కోర్టు వారికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. 

డిసెంబర్ 22, 1949: మసీదులో వెలసిన రాములోరు

1949లో మసీదు లోపల రాముడి విగ్రహం ప్రత్యక్షమైంది. అయితే ఇది హిందూ మహాసభ కార్యకర్తలు చేసిన పని అని ముస్లింలు కోర్టులో సూట్ ఫైల్ వేశారు. అయితే రాముడు స్వయంభూగా వెలిశాడని.. కాబట్టి ఆ స్థలం తమకే చెందుతుందని అప్పటి హిందువులు కౌంటర్ సూట్ ఫైల్ చేశారు. 

డిసెంబర్ 26, 1949: మసీదు లోపల ఉన్న సీతారాముల విగ్రహాలను తొలగించమన్న నెహ్రూ

అప్పటి ప్రధాని, దివంగత జవహర్ లాల్ నెహ్రూ అయోధ్యను సందర్శించి పరిస్థితిని సమీక్షించాలని అనుకున్నారు. అప్పుడు న్యూఢిల్లీలో ఉన్న నెహ్రూకి.. అయోధ్యలో జరుగుతున్న అల్లర్లకి సంబంధించి నివేదికలు అందాయి. అయోధ్యలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ జవహర్ లాల్ నెహ్రూ.. లక్నోలోని యునైటెడ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి గోవింద్ బల్లభ్ పంత్‌ కు ఒక టెలిగ్రామ్ పంపించారు. ఆ టెలిగ్రామ్ లో ఇలా ఉంది. “అయోధ్యలో జరుగుతున్న పరిణామాల పట్ల నేను తీవ్రంగా కలత చెందాను. ఈ విషయంలో మీరు పర్సనల్ ఇంట్రస్ట్ చూపిస్తారని ఆశిస్తున్నా” అంటూ పంత్ కి రాసిన టెలిగ్రామ్ లో పేర్కొన్నారు. అయితే తనను తాను నాస్తికుడిగా ప్రకటించుకున్న నెహ్రూ.. మసీదు లోపల ఉన్న సీతారాముల విగ్రహాలను అక్కడ నుంచి షిఫ్ట్ చేయాలని అప్పటి రాష్ట్ర ప్రభుత్వానికి సూచించినట్లు నివేదికలు చెబుతున్నాయి. అయితే ఇది హిందూ, ముస్లింల మధ్య పెద్ద ఎత్తున అల్లర్లకు దారితీస్తుందని ఉద్దేశంతో అప్పటి జిల్లా మేజిస్ట్రేట్ కే.కే. నాయర్ మసీదు లోపల ఉన్న సీతారాముల విగ్రహాలను తొలగించేందుకు నిరాకరించారు. దీంతో ప్రభుత్వం వివాదాస్పద స్థలంగా ప్రకటించి మసీదు గేటుకి తాళం వేసింది. (ఆ తర్వాత కే.కే. నాయర్ భారతీయ జన్ సంఘ్ పార్టీలో చేరి ఎంపీగా ఎన్నికయ్యారు. భారతీయ జన్ సంఘ్ పార్టీ 1977లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా లెఫ్ట్, రైట్, సెంటర్ పార్టీలతో విలీనం అయ్యింది. దీంతో జన్ సంఘ్ పార్టీ జనతా పార్టీగా మారింది. ఆ తర్వాత బీజేపీగా మారింది.)

జనవరి 7, 1950: నెహ్రూ రాసిన మరో లేఖ

నెహ్రూ 1950 జనవరి 7న గవర్నర్ జనరల్ గా ఉన్న సి రాజగోపాలాచారికి లేఖ రాశారు. అందులో ఇలా ఉంది. “నేను గత రాత్రి అయోధ్య గురించి పంత్ జీకి ఒక లేఖ రాసి లక్నో వెళ్తున్న వ్యక్తికి ఇచ్చాను. ఆ తర్వాత పంత్ తనకు ఫోన్ చేశాడు. పంత్ చాలా ఆందోళన చెందుతున్నట్టు.. అయోధ్య విషయాన్ని వ్యక్తిగతంగా తీసుకున్నట్టు చెప్పాడు” అని ఆ లేఖలో ఉంది. 

ఫిబ్రవరి 5, 1950: అయోధ్య పరిస్థితిని తెలియజేస్తే సంతోషిస్తానన్న నెహ్రూ

1950 ఫిబ్రవరి 5న పంత్ కి మరో లేఖ రాశారు. అందులో ఇలా ఉంది. “ప్రియమైన పంత్ జీ.. అయోధ్య పరిస్థితిని తెలియజేస్తే సంతోషిస్తాను. దేశం మొత్తం మీద జరుగుతున్న వ్యవహారాలు, ముఖ్యంగా కాశ్మీర్ కి అత్యధిక ప్రాముఖ్యత ఇస్తానని మీకు తెలుసు. అవసరమైతే నేను అయోధ్య వెళ్తానని.. మీరు ఆఖరిసారిగా నన్ను కలిసినప్పుడు చెప్పాను. నేను అయోధ్య రావాలని మీరు అనుకుంటే చెప్పండి. నేను బిజీగా ఉన్నప్పటికీ అయోధ్య వచ్చేందుకు ఒక తేదీని ఫిక్స్ చేసుకుంటా” అని ఉంది. అయితే అయోధ్యలో పరిస్థితి మారలేదని పంత్ చెప్పడంతో నెహ్రూ అయోధ్య విజిట్ కార్యరూపం దాల్చలేదు. 

మార్చి 5, 1950: జిల్లా మెజిస్ట్రేట్ కే.కే. నాయర్ పై నిందలు

1950 మార్చి 5న నెహ్రూ రాసిన లేఖలో అప్పటి జిల్లా మెజిస్ట్రేట్ కే.కే. నాయర్ ని నిందించినట్టు ఉంది. అయితే తాను మసీదు లోపల ఉన్న విగ్రహాలను తొలగించాలని తీర్పు ఇవ్వకపోవడాన్ని సమర్థించుకున్నారు. విగ్రహాలను తొలగించేందుకు అంగీకరిస్తే ఎంతోమంది ప్రాణాలు కోల్పోతారని అన్నారు. 

1950: తొలిసారిగా కోర్టులో వేయబడిన రెండు పిటిషన్లు

1950లో హషిమ్ అన్సారీ అనే వ్యక్తి.. మసీదు గేట్లు ఓపెన్ చేయాలని, నమాజ్ చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని.. ఫైజాబాద్ కోర్టులో తొలి పిటిషన్ వేశారు. గోపాల్ సింగ్ విశారద్, మహంత్ పరమహంస రామచంద్ర దాస్ లిద్దరూ కూడా ఫైజాబాద్ కోర్టులో కౌంటర్ పిటిషన్ వేశారు. ఇది వివాదాస్పద స్థలం మీద వేయబడ్డ రెండో పిటిషన్. మసీదు లోపల రామ జన్మభూమి స్థలంలో ఉన్న విగ్రహాలకు పూజలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే మసీదు లోపల ప్రాంగణం తాళం వేసి ఉన్నప్పుడు బయట నుంచి పూజలు చేసుకునేందుకు కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అది కూడా ఏడాదికి ఒకసారి కేవలం పూజారికి మాత్రమే అనుమతి ఇచ్చింది. ఇతరులకు ప్రవేశం నిషేధించింది కోర్టు.     

1959: హిందూ, ముస్లిం మధ్యలో మూడో వర్గం

మహంత్ భాస్కర్ దాస్ నేతృత్వంలో నిర్మోహి అఖారా సంస్థ ఫైజాబాద్ కోర్టులో పిటిషన్ వేసింది. ఇది వివాదాస్పద స్థలం మీద వేసిన మూడవ పిటిషన్. ఆ మసీదు ఉన్న స్థలం మీద పూర్తి హక్కు తమదే అంటూ కోర్టులో పిటిషన్ వేసింది. ఎన్నో ఏళ్లుగా తమ పూర్వీకులు అక్కడ పూజలు చేసుకుంటున్నారని సదరు సంస్థ చెప్పుకొచ్చింది. నిర్మోహి అఖారా అనేది వైష్ణవ్ భైరాగి సాంప్రదాయంలో ఒక భాగం. అఖిల భారతీయ అఖారా పరిషత్ చేత గుర్తింపు పొందిన సంస్థ ఈ నిర్మోహి అఖారా. రామనంది వరగీస్ తో చేయబడిన పంచాయతీ మఠం ఈ నిర్మోహి అఖారా. 1400ఏడీ నుంచే అయోధ్యలో ప్రజా మతంగా ఉందని నిర్మోహి అఖారా చెబుతుంది. ఆ స్థలంలో పూజలు చేసుకునే హక్కు తమకే ఉందని నిర్మోహి అఖారా కోర్టులో పిటిషన్ వేసింది. 

1961: మసీదులో ప్రార్థనలు చేసుకునే హక్కు కోసం పిటిషన్

ఉత్తరప్రదేశ్ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు ఫైజాబాద్ కోర్టులో పిటిషన్ వేసింది. ఇది నాల్గవ పిటిషన్. ముస్లింలు మళ్ళీ మసీదులో ప్రార్థనలు చేసుకునే హక్కును పునరుద్ధరించాలని కోర్టును కోరారు. 

1964: విశ్వ హిందూ పరిషత్ ఏర్పాటు

హిందువులను ఏకం చేయడం కోసం.. హిందూ ధర్మ రక్షణ కోసం 1964లో విశ్వ హిందూ పరిషత్ సంస్థ ఏర్పడింది. దీన్ని ఎమ్.ఎస్. గోల్వాకర్, ఎస్.ఎస్. ఆప్టేలు స్థాపించారు. 

ఏప్రిల్ 6, 1980: బీజేపీ పార్టీ ఆవిర్భావం

భారతీయ జన్ సంఘ్ పార్టీ 1977లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా లెఫ్ట్, రైట్, సెంటర్ పార్టీలతో విలీనం అయ్యింది. దీంతో జన్ సంఘ్ పార్టీ జనతా పార్టీగా మారింది. ఆ తర్వాత జనతా పార్టీ రద్దుతో 1980 ఏప్రిల్ 6న బీజేపీ పార్టీ స్థాపించబడింది. 

1981: సెంట్రల్ వక్ఫ్ బోర్డు పిటిషన్

ఉత్తరప్రదేశ్ కి చెందిన సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు మసీదు స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు కోర్టులో పిటిషన్ వేసింది. 

1983: దేవుడి లాయర్  

అలహాబాద్ హైకోర్టు మాజీ జడ్జి, సీనియర్ లాయర్ అయిన నందన్ అగర్వాల్ 1983లో రిటైర్ అయ్యారు. ఆ తర్వాత ఆయన ఫైజాబాద్ వెళ్లి అక్కడ మసీదు ఉన్న స్థలం రామ జన్మస్థలం అని ప్రూవ్ చేయడానికి డేటా, రెవెన్యూ రికార్డ్స్ అన్నిటినీ సేకరించారు. 

1984: రామజన్మభూమి విముక్తి కోసం కమిటీ ఏర్పాటు

ఎల్.కే. అద్వానీ రామ జన్మస్థలంలో రామ మందిరం నిర్మించాలని ఒక ఉద్యమానికి తెరలేపారు. ఆ ఉద్యమం ఊపందుకోవడంతో రామ జన్మ స్థలానికి విముక్తి కల్పించి.. మందిరం నిర్మించడం కోసం విశ్వ హిందూ పరిషత్ సహా పలు హిందూ సంస్థలు ఒక కమిటీ వేశాయి. 

ఏప్రిల్ 1984: రామ మందిర నిర్మాణం జరగాలన్న డిమాండ్

1981లో మీనాక్షిపురంలో 400 నుంచి 800 మంది దళిత కుటుంబాలు ఇస్లాంలోకి మతం మారిన దానికి ప్రతిస్పందనగా విశ్వ హిందూ పరిషత్ ధర్మ సంసద్ ను నిర్వహించింది. విశ్వ హిందూ పరిషత్ జాయింట్ సెక్రటరీ అశోక్ సింఘాల్ నాయకత్వంలో అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరగాలన్న డిమాండ్ ఎక్కువైంది. 

సెప్టెంబర్ 25, 1984: రథయాత్ర

1984 సెప్టెంబర్ 25న బీహార్ లోని సీతామర్హి నుంచి ఢిల్లీకి శ్రీరామ్- జానకి రథయాత్ర చేపట్టారు. ఉత్తరప్రదేశ్ లో మరో ఆరు యాత్రలు చేపట్టారు. 

1984 నవంబర్: బలహీనపడిన రామజన్మభూమి ఉద్యమం

ఇందిరా గాంధీ హత్య తర్వాత 9వ లోక్ సభ జనరల్ ఎన్నికలు జరిగాయి. 541 సీట్లకు గాను బీజేపీ కేవలం 2 స్థానాలు మాత్రమే గెలుచుకుంది. దీంతో బలహీనంగా ఉన్న బీజేపీ.. రామజన్మభూమి ఉద్యమానికి మద్దతు ఇవ్వడంలో విఫలమైంది.  

ఏప్రిల్ 2, 1985: మహ్మద్ అహ్మద్ ఖాన్, షాబానో బేగం కేసుతో మలుపు

మహ్మద్ అహ్మద్ ఖాన్, షాబానో బేగం కేసులో ఆమెకు మెయింటెనెన్స్ కింద భరణం ఇవ్వాలని హైకోర్టు ఇచ్చిన తీర్పుని సుప్రీంకోర్టు సమర్థించింది. అయితే ఈ తీర్పును ముస్లిం నేతలు ఖండించారు. 

ఫిబ్రవరి 1, 1986: మసీదు లోపలికి హిందువులకు అనుమతి

1986లో 2.77 ఎకరాల భూమిలో ఉన్న రామ్ చబుత్రలో పూజలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని విశ్వ హిందూ పరిషత్ కోర్టులో పిటిషన్ వేసింది. కోర్టు అనుమతితో మసీదు గేట్లు తెరవబడ్డాయి. హిందువులు పూజలు చేసుకునేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. కోర్టు తీర్పు నచ్చని నిరసనకారులు బాబ్రీ మసీదు యాక్షన్ కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. చరిత్రకారుడు రామచంద్ర గుహ ప్రకారం.. ఢిల్లీలోని ప్రధాని కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు కోర్టు న్యాయమూర్తి తీర్పు ఇచ్చినట్లు అప్పట్లో బలంగా నమ్మరు. తీర్పు వెలువడిన గంటలోనే మసీదు తాళాలు తెరవడంతో స్థానిక ప్రభుత్వానికి ఈ తీర్పు అనుకూలంగా వస్తుందని ముందే తెలిసినట్లు అయ్యింది. ఆ సమయంలో రాజీవ్ గాంధీ ప్రధాని మంత్రిగా ఉన్నారు. అప్పటి ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు వస్తున్న క్రమంలో చేసిన విభజించు, పాలించు చర్యలో భాగంగా చేసిన చర్యగా అప్పట్లో వాదనలు వినిపించాయి. కొన్ని నెలల తర్వాత ఆయన హిందువులను, ఆ తర్వాత ముస్లింలను బుజ్జగించే ప్రయత్నం చేశారు.        . 

మే నెల, 1986: షాబానో కేసుతో అయోధ్య ఉద్యమానికి బలం 

1986 మే నెలలో షాబానో కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో విడాకుల మీద ముస్లిం మహిళలకు రక్షణ ఇవ్వాలన్న ఉద్దేశంతో పార్లమెంట్ 1986 చట్టాన్ని పాస్ చేసింది. ఇక ఇదే ఏడాదిన రాజీవ్ గాంధీ ప్రభుత్వం మసీదు తలుపులు తెరవాలని నిర్ణయం తీసుకోవడం.. షాబానో కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై వెనక్కి తగ్గడం వంటి అంశాలు అయోధ్య ఉద్యమంలో పాల్గొనేందుకు బీజేపీ పార్టీకి బలంగా సహకరించాయి. అప్పటి వరకూ బలహీనంగా ఉన్న బీజేపీకి షాబానో కేసు విషయంలో సుప్రీంకోర్టు తీర్పు ఒక్కసారిగా బలాన్ని ఇచ్చింది. ఆ సమయంలో ఎల్.కే. అద్వానీ బీజేపీ ప్రెసిడెంట్ గా ఉన్నారు.        

జూలై నెల, 1989: ఆ స్థలం రాముడిదే.. ఇవిగో ఆధారాలు

అది 1989వ సంవత్సరం. విశ్వ హిందూ పరిషత్ వైస్ ప్రెసిడెంట్, అలహాబాద్ హైకోర్టు రిటైర్డ్ జడ్జి డియోకి నందన్ అగర్వాల్ ఒక పిటిషన్ వేశారు. 1983లో జడ్జిగా రిటైర్ అయిన తర్వాత ఆ స్థలం అయోధ్య రాముడిదే అని నిరూపించేలా ఉన్న ఆధారాలను కోర్టుకు సబ్మిట్ చేశారు. 1989 జూలై 1న అలహాబాద్ హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. తనను రామ్ లల్లా (రాముడి) మిత్రుడిగా నియమించాలని లక్నో బెంచ్ ను కోరారు. అప్పటి నుంచి నందన్ అగర్వాల్ అయోధ్య రాముడికి కమిటెడ్ న్యాయవాదిగా, భక్తుడిగా ఉన్నారు. ఈయన వేసిన పిటిషన్ తో పాటు అయోధ్య రామ జన్మస్థలం తరపున వేసిన పిటిషన్స్ అన్నిటినీ జూలై 1996లో కోర్టు కలిపేసింది.  

ఆగస్టు 14, 1989: కొనసాగించాలని హైకోర్టు ఆదేశం

1989 ఆగస్టు 14న బాబ్రీ మసీదుకు సంబంధించి యథాతథ స్థితిని కొనసాగించాలని అలహాబాద్ హైకోర్టు ఆదేశించింది.  

నవంబర్ 9, 1989: రామ జన్మభూమి స్థలంలో పడిన తొలి పునాది రాయి

అప్పటి జనరల్ ఎలక్షన్స్ లో 89 సీట్లు గెలుచుకోవడంతో దేశంలో మూడవ పెద్ద పార్టీగా అవతరించింది. బీజేపీ, సీపీఐ(ఎం) మద్దతుతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ కి మద్దతు ఇవ్వడంతో ఆయన ప్రధానమంత్రి అయ్యారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ డిమాండ్ ని నెరవేర్చింది. రామ జన్మభూమి స్థలంలో పునాది రాయి వేయడానికి విశ్వ హిందూ పరిషత్ కి అనుమతి ఇచ్చింది. నవంబర్ 9న రామ మందిరం కోసం వివాదాస్పద స్థలంలో.. విశ్వ హిందూ పరిషత్ ఆ ల్యాండ్ లో పునాదులు వేస్తూ ఒక ఉద్యమానికి తెరలేపింది.

సెప్టెంబర్ 25, 1990: ఎల్.కె. అద్వానీ నేతృత్వంలో రథయాత్ర

1990 సెప్టెంబర్ 25న బీజేపీ నేత ఎల్.కె. అద్వానీ సోమ్ నాథ్ లో రథయాత్ర ప్రారంభించారు. 

అక్టోబర్ 30, 1990: బీజేపీ కరసేవకుల మీద పోలీసుల కాల్పులు

1990 అక్టోబర్ 30న పోలీసుల ఆదేశాలను ధిక్కరించి మసీదు ల్యాండ్ లోకి కవాతు చేస్తున్న బీజేపీ కరసేవకుల మీద పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 20 మంది కరసేవకులు మరణించారు. ఆ సమయంలో ములాయం సింగ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ లో వరుస మత ఘర్షణలు చెలరేగాయి. రథయాత్ర తర్వాత విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ నేతృత్వంలోని నేషనల్ ఫ్రంట్ సెంట్రల్ గవర్నమెంట్ కి బీజేపీ తన మద్దతును ఉపసంహరించుకుంది. ఇది ప్రభుత్వ పతనానికి దారి తీసింది.    

1991: బాబ్రీ మసీదుకు హాని జరగదని హామీ ఇచ్చిన బీజేపీ సీఎం

లోక్ సభ జనరల్ ఎలక్షన్స్ లో 121 సీట్లు గెలుచుకుని దేశంలోనే రెండవ అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది. పీవీ నరసింహారావు నేతృత్వంలోని కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా.. బీజేపీ మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ఫామ్ చేసింది. ఆ సమయంలో ఉత్తరప్రదేశ్ సీఎంగా కళ్యాణ్ సింగ్ ఎన్నికయ్యారు. అప్పుడు బాబ్రీ మసీదుకి ఎలాంటి హాని జరగదని కళ్యాణ్ సింగ్ వాగ్దానం చేస్తూ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. 

డిసెంబర్ 6, 1992: బాబ్రీ మసీదు మీద దాడి 

1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదు వద్ద ర్యాలీని చేపట్టాలని బీజేపీ నాయకులు ఫిక్స్ అయ్యారు. దీంతో అల్లర్లు జరిగే అవకాశం ఉందని పోలీసులు మసీదు చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. ల్యాండ్ లోపలికి ఎవరినీ ఎంటర్ అవ్వకుండా పోలీసులు బారికేడ్ల చుట్టూ నిలబడ్డారు. ఆర్ఎస్ఎస్ మరియు దాని అనుబంధ సంస్థలు.. లక్ష 50 వేల మంది విశ్వ హిందూ పరిషత్ మరియు బీజేపీ కరసేవకులతో బాబ్రీ మసీదు ల్యాండ్ వద్ద ఒక మహా ర్యాలీని చేపట్టాయి. దీంతో పోలీసులకు అంతమందిని అడ్డుకోవడం కష్టమైంది. ఎల్.కే. అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమా భారతి వంటి బీజేపీ నాయకులు ఉద్వేగభరితమైన ప్రసంగాలు ఇచ్చారు. ఆ ప్రసంగాలకు ప్రభావితమైన భజరంగ్ దళ్, శివసేన కార్యకర్తలు.. బాబ్రీ మసీదు మీద దాడి చేశారు. బారికేడ్లను దాటుకుంటూ మసీదు పైకి ఎక్కి మరీ ధ్వంసం చేశారు. పోలీసులు కూడా ఏమీ చేయలేకపోయారు. ఇక బాబ్రీ మసీదు మీద దాడి జరిగిన రోజు సాయంత్రం కరసేవకులు.. అయోధ్యలోని స్థానిక ముస్లింల ఇళ్లను కూల్చడం మొదలుపెట్టారు. ఈ ఘటనలో 18 మంది ముస్లింలు మరణించారు. 23 మసీదులతో సహా దాదాపు చాలా మంది ముస్లింల ఇళ్ళు, దుకాణాలు తగులబడ్డాయి. ముంబై సహా దేశంలోని పలుప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనల వల్ల సుమారు 2 వేల మంది మరణించారు. అయితే తన వాగ్దానం బ్రేక్ అయ్యిందని భావించిన కళ్యాణ్ సింగ్.. బాబ్రీ మసీదు కూల్చిన రోజునే తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. బీజేపీ నాయకులైన అద్వానీ, ఉమాభారతి, ఎం.ఎం. జోషిల మీద ఛార్జ్ షీట్ ఫైల్ అయ్యింది. అయోధ్యలో రామ మందిరం కట్టాలన్న హిందువుల ఆశయానికి ఆయనొక ఐకాన్ గా పరిగణించబడ్డారు. అయితే తన వాగ్దానం బ్రేక్ అయ్యిందని పదవికి రాజీనామా చేశారు.

డిసెంబర్ 8, 1992: పాకిస్తాన్ లో హిందూ ఆలయాల కూల్చివేత

పాకిస్తాన్ లోని ముస్లింలు 30కి పైగా హిందూ ఆలయాల మీద దాడి చేశారు. భారతదేశంలో బాబ్రీ మసీదు కూల్చివేతను నిరసిస్తూ పాకిస్తాన్ ప్రభుత్వం ఒక రోజంతా కార్యాలయాలు, పాఠశాలలు మూసివేసింది. 

డిసెంబర్ 16, 1992: లిబర్హాన్ కమిషన్ నియామకం

1992లో ప్రధానిగా ఉన్న పీవీ నరసింహారావు.. బీజేపీ మద్దతుదారులే బాబ్రీ మసీదుని కూల్చారని నాలుగు రాష్ట్రాల్లో ఉన్న బీజేపీ ప్రభుత్వాలను బర్తరఫ్ చేశారు. ఇక ఇదే సంవత్సరంలో బాబ్రీ మసీదు కూల్చివేతపై విచారణ చేపట్టేందుకు పీవీ నరసింహారావు ప్రభుత్వం ‘లిబర్హాన్ కమిషన్’ ని నియమించింది. దీనికి జస్టిస్ మన్మోహన్ సింగ్ లిబర్హాన్ అధ్యక్షత వహించారు. అయోధ్యలో మసీదుని కూల్చి వేయడానికి దారితీసిన సంఘటనలు, పరిస్థితులు వంటి విషయాలను నిర్ధారించడం మాత్రమే లిబర్హాన్ కమిషన్ కి అందిన ఆదేశాలు. 

మార్చి నెల, 1993: బొంబాయిలో బాంబ్ బ్లాస్ట్ లు

బాబ్రీ మసీదు కూల్చివేతను నిరసిస్తూ.. ఉగ్రవాదులు బొంబాయి అంతటా బాంబు పేలుళ్లకు శ్రీకారం చుట్టారు. 

ఏప్రిల్ 3, 1993: ఎల్.కే. అద్వానీపై ఛార్జ్ షీట్

బాబ్రీ మసీదు చుట్టూ ఉన్న 67.703 ఎకరాల భూమిని కేంద్రం స్వాధీనం చేసుకునే దాని కింద ఉన్న అయోధ్యలో నిర్దిష్ట ప్రాంతాన్ని స్వాధీనం చేసుకునే చట్టాన్ని ఆమోదించింది. అయితే ఈ చట్టంలోని కొన్ని అంశాలను సవాలు చేస్తూ ఇస్మాయిల్ ఫారూకీ ఒక వ్రాతపూర్వక పిటిషన్ వేశారు. ఇక ఇదే ఏడాది లిబర్హాన్ కమిషన్ తమ పరిశోధనను ప్రారంభించింది. ఈ కేసుని సీబీఐ తీసుకుని.. బీజేపీ నాయకుడు ఎల్.కే. అద్వానీపై ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది. మసీదు కూల్చివేత ఘటనలో 19 మందిని నిందితులుగా చేర్చింది. వీరంతా మసీదు కూల్చివేయడానికి కుట్ర పన్నినట్లు సీబీఐ తేల్చింది.    

అక్టోబర్ 24, 1994: నమాజ్ అనేది ఎక్కడైనా చేసుకోవచ్చన్న సుప్రీంకోర్టు

ఇస్మాయిల్ ఫారూఖీ వేసిన పిటిషన్ ని విచారించిన సుప్రీంకోర్టు.. మసీదు అనేది ఇస్లాంలో అంతర్భాగం అయినది కాదు కాబట్టి నమాజ్ అనేది ఎక్కడైనా చేసుకోవచ్చు అని తెలిపింది. అలానే మసీదు కూల్చివేతలో ఉత్తరప్రదేశ్ సీఎం కళ్యాణ్ సింగ్ ని బాధ్యుడిని చేస్తూ ఒక రోజు జైలు శిక్షతో పాటు 20 వేల రూపాయల జరిమానా విధించింది. 

1998: బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు

1998వ సంవత్సరంలో ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి నేతృత్వంలోని బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.     

2001: ఆలయం నిర్మిస్తామని ప్రతిజ్ఞ

మసీదు కూల్చివేత వార్షికోత్సవం సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. విశ్వ హిందూ పరిషత్ మరోసారి వివాదాస్పద స్థలంలో హిందూ ఆలయం నిర్మిస్తామని ప్రతిజ్ఞ చేసింది.

మే నెల, 2001: అద్వానీ వంటి లీడర్లపై కుట్ర ఆరోపణలను ఉపసంహరించుకున్న స్పెషల్ సీబీఐ కోర్టు

అద్వానీ, ఎం.ఎం. జోషి, ఉమా భారతి, బాల్ ఠాక్రే వంటి వారిపై వేసిన ఛార్జ్ షీట్స్ ని, కుట్ర ఆరోపణలు, విచారణను స్పెషల్ సీబీఐ కోర్టు ఉపసంహరించుకుంది.  

జనవరి నెల, 2002: మసీద్, మందిర్ వివాదానికి పరిష్కారం కోసం చర్చలు 

2002లో అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి.. మసీదు, మందిర్ వివాదానికి పరిష్కారం కోసం హిందూ, ముస్లిం నాయకులతో మాట్లాడాలని అనుకున్నారు. అందుకోసం ప్రధాని కార్యాలయంలో ఒక సెల్ ని ఏర్పాటు చేసి శత్రుఘ్న సింగ్ ను నియమించారు. 

ఫిబ్రవరి 2002: అయోధ్యలో రామ మందిరం నిర్మిస్తాం.. మేనిఫెస్టోలో బీజేపీ హామీ

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలప్పుడు బీజేపీ తమ మేనిఫెస్టోలో అయోధ్యలో రామ మందిరం నిర్మిస్తామని హామీని చేర్చింది. విశ్వ హిందూ పరిషత్ కూడా రామ మందిర నిర్మాణాన్ని ప్రారంభించడానికి మార్చి 15న గడువు తేదీగా నిర్ధారించింది. మార్చి నెలలో వందలాది మంది వాలంటీర్లు అయోధ్యలో కలిశారు. అయోధ్య నుంచి తిరిగి వస్తుండగా గోద్రాలో హిందూ కార్యకర్తలతో వస్తున్న రైలు మీద దాడి జరిగింది. ఈ దాడిలో 58 మంది మరణించారు. మార్చిలో జరిగిన గోద్రా రైలు ఘటన తర్వాత గుజరాత్ లో జరిగిన అల్లర్లలో వెయ్యి నుంచి 2 వేల మందిలో ఎక్కువగా ముస్లింలు మరణించారు. ఆ సమయంలో నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు.

ఆగస్టు నెల, 2003: మసీదు కింద 10వ శతాబ్దానికి చెందిన ఆలయం

మసీదు కింద 10వ శతాబ్దానికి చెందిన ఆలయం ఉన్నట్టు ఆధారం ఉందని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) ఒక నివేదికను సమర్పించింది. అయితే ఈ నివేదికను ఆర్కియాలజిస్టులు, చరిత్రకారులు ఖండించారు. 

సెప్టెంబర్ నెల, 2003: మసీదు కూల్చివేతకు కారణమైన వారిపై విచారణ

బాబ్రీ మసీదు కూల్చివేతకు ప్రేరేపించిన ఏడుగురు హిందుత్వ నాయకులపై విచారణ జరగాలని సీబీఐ స్పెషల్ కోర్టు తీర్పు ఇచ్చింది. కానీ మసీదు కూల్చివేత సమయంలో అక్కడే ఉన్న అద్వానీ మీద ఎలాంటి ఆరోపణలు లేవు.

నవంబర్ నెల, 2004: మసీదుపై దాడిలో నిర్దోషిగా అద్వానీ

మసీదుపై దాడిలో అద్వానీ పాత్రను నిర్దోషిగా పేర్కొంటూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను సమీక్షించాలని కోర్టు మరోసారి తీర్పునిచ్చింది.

జూలై నెల, 2005: రామ జన్మభూమి కాంప్లెక్స్ పై ఉగ్రవాదుల దాడి

అయోధ్య రామ జన్మభూమి కాంప్లెక్స్ పై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో ఆరుగురు లష్కరే తోయిబా ఉగ్రవాదులు అనుమానితులుగా ఉన్నారు. అయితే భద్రతా లోపానికి కేంద్రమే బాధ్యత వహించాలని.. విశ్వ హిందూ పరిషత్ ఇంటర్నేషనల్ జనరల్ సెక్రటరీ ప్రవీణ్ తొగాడియా యూపీఏ ప్రభుత్వాన్ని నిందించారు. తవ్విన ఆధారాలను నాశనం చేయడానికే ఈ దాడి చేశారని విశ్వ హిందూ పరిషత్ ప్రెసిడెంట్ అశోక్ సింఘాల్ అన్నారు.

జూన్ నెల, 2009: ర్యాలీలో రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు

అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు నియమించిన లిబర్హాన్ కమిషన్.. బాబ్రీ మసీదు కూల్చివేతకు సంబంధించిన నివేదికను ప్రధాని మన్మోహన్ సింగ్ కి సమర్పించింది. 100 మందికి పైగా సాక్షులను విచారించిన అనంతరం 17 ఏళ్ల తర్వాత కమిషన్ నివేదికను సమర్పించింది. దేశంలో ఇన్నేళ్ల పాటు విచారణ సాగిన కమిషన్ ఇదే. ఈ నివేదికలో అటల్ బిహారీ వాజ్ పేయి, ఎల్.కే. అద్వానీ, మురళీ మనోహర్ జోషి, కళ్యాణ్ సింగ్, ప్రమోద్ మహాజన్, ఉమా భారతి, విజయరాజి సిందియా వంటి బీజేపీ నేతలు దోషులుగా ఉన్నారు. అలానే గిరిరాజ్ కిషోర్, అశోక్ సింఘాల్ వంటి వీహెచ్పీ లీడర్స్, శివసేన అధినేత బాల్ థాక్రే, మాజీ ఆర్ఎస్ఎస్ లీటర్ కే.ఎన్. గోవిందాచార్య వంటి వారు దోషులుగా ఉన్నారు. ర్యాలీలో రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు ఉన్నాయని.. అయితే మసీదు కూల్చివేత అనేది ప్రణాళికబద్ధంగా జరగలేదని నివేదికలో పేర్కొంది. 

సెప్టెంబర్ నెల, 2010: బాబ్రీ మసీదు స్థలాన్ని ముగ్గురూ పంచుకోవాలని అలహాబాద్ హైకోర్టు తీర్పు

అయోధ్యలో ఉన్న బాబ్రీ మసీదు ఉన్న వివాదాస్పద స్థలాన్ని మూడు భాగాలుగా విభజించాలని అలహాబాద్ హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ స్థలంలో రెండు వంతుల భూమిని హిందువులను రిప్రజెంట్ చేసే విశ్వ హిందూ పరిషత్, నిర్మోహి అఖారా సంస్థ వారు పంచుకోవాలని.. మిగతా మూడవ వంతు భూమిని సున్నీ ముస్లిం వక్ఫ్ బోర్డు తీసుకోవాలని కోర్టు తీర్పు ఇచ్చింది. నిర్మోహి అఖారా, వక్ఫ్ బోర్డులకు ప్రాతినిధ్యం వహిస్తున్న వారిని ఈ స్థలానికి జాయింట్ టైటిల్ హోల్డర్స్ గా ప్రకటించింది. దీంతో హిందువులు, ముస్లింలు సుప్రీంకోర్టులో అప్పీలు చేశారు. 

మే నెల, 2011: అలహాబాద్ హైకోర్టు తీర్పును సస్పెండ్ చేసిన సుప్రీంకోర్టు

2010లో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును హిందూ, ముస్లింలు అప్పీల్ చేయడంతో ఆ తీర్పును సుప్రీంకోర్టు సస్పెండ్ చేసింది.

మే నెల, 2014: కేంద్రంలో అధికారంలోకి బీజేపీ 

కేంద్రంలో బీజేపీ నాయకుడు నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది.

ఫిబ్రవరి 26, 2016: మసీదు స్థలంలో రామ మందిరాన్ని నిర్మించాలని పిటిషన్

2016 ఫిబ్రవరి 26న బాబ్రీ మసీదు ఉన్న స్థలంలో రామ మందిరాన్ని నిర్మించాలని బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.

జూలై 20, 2016: హషీన్ అన్సారీ మరణం

బాబ్రీ మసీదు కేసులో మసీదు తరపున తొలి పిటిషన్ వేసిన హషీన్ అన్సారీ 95 ఏళ్ల వయసులో మరణించారు.

మార్చి నెల, 2017: ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకారం

అన్ని పార్టీలు ఈ అయోధ్య స్థల వివాదానికి సంబంధించి సున్నితమైన, సెంటిమెంటల్ మేటర్ లో పరిష్కారం తీసుకొచ్చేందుకు తాజాగా ప్రయత్నాలు మొదలుపెట్టాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జే.ఎస్. ఖేహర్ సూచించారు. ఇక ఇదే ఏడాది యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచింది. హిందూ యువ వాహిని సంస్థ వ్యవస్థాకుడు యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

ఏప్రిల్ నెల, 2017: రెండేళ్లలో విచారణ పూర్తి చేయాలన్న సుప్రీంకోర్టు

అద్వానీ, మురళీ మనోహర్ జోషి, కేంద్ర మంత్రి ఉమా భారతి సహా ఇతర బీజేపీ సభ్యులు, కరసేవకులు బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో నేరపూరిత అభియోగాలను ఉపసంహరించుకోలేమని.. ఆ అభియోగాలను పునరుద్ధరించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అలానే ఈ విచారణను రెండేళ్లలో పూర్తి చేయాలని లక్నో ట్రయల్ కోర్టుని సుప్రీంకోర్టు కోరింది. అయితే ఈ కేసులో నిందితుడిగా ఉన్న కళ్యాణ్ సింగ్ ని మినహాయించింది. ఎందుకంటే ఆయన రాజస్థాన్ కి గవర్నర్ గా ఉన్నారు. ఈ విచారణ సమయంలో శివసేన లీడర్ బాల్ ఠాక్రే సహా పలువురు అసలు నిందితులు మరణించారు.  

మే 30, 2017: కోర్టులో హాజరైన అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమా భారతి

అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమా భారతి మీద సీబీఐ స్పెషల్ కోర్టు బాబ్రీ మసీదు కూల్చివేత కుట్రలో భాగమైనందుకు వారిని కోర్టులో హాజరుపరిచింది. ఆ తర్వాత వారికి బెయిల్ మంజూరయ్యింది. 

జూలై నెల, 2017: మొదలైన రామ మందిర నిర్మాణ పనులు 

బాబ్రీ మసీదు స్థలంలో రామ మందిర నిర్మాణం కోసం పనులు మొదలయ్యాయి. ఆలయ నిర్మాణం కోసం ఉపయోగించే రాళ్లతో ట్రక్కులు అయోధ్యకు చేరుకోవడం ప్రారంభించాయి.     

ఆగస్టు నెల, 2017: జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఏర్పాటు

అయోధ్య ల్యాండ్ వివాదం కేసులో అలహాబాద్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించేందుకు జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనాన్ని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది.

ఆగస్టు 8, 2017: అభ్యంతరం లేదన్న షియా సెంట్రల్ వక్ఫ్ బోర్డు

అయోధ్య వివాద స్థలానికి కొంత దూరంలో సహేతుకంగా అనిపించే ముస్లింలు అధికంగా ఉండే ప్రదేశంలో మసీదు నిర్మించడానికి అభ్యంతరం లేదని ఉత్తరప్రదేశ్ కి చెందిన షియా సెంట్రల్ వక్ఫ్ బోర్డు సుప్రీంకోర్టుకు తెలిపింది.

నవంబర్ 24, 2017: అయోధ్య రామ మందిరం మాత్రమే నిర్మించాలి

వివాదాస్పద స్థలంలో కేవలం అయోధ్య రామ మందిరం మాత్రమే నిర్మించాలని.. వేరే ఇంకేదీ నిర్మించకూడదని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు.

నవంబర్ 20, 2017: లక్నోలో మసీదు నిర్మించడానికి అభ్యంతరం లేదన్న షియా సెంట్రల్ వక్ఫ్ బోర్డు

అయోధ్యలో రామ మందిరం లక్నోలో మసీదు నిర్మించడానికి అభ్యంతరం లేదని ఉత్తరప్రదేశ్ షియా సెంట్రల్ వక్ఫ్ బోర్డు సుప్రీంకోర్టుకు తెలిపింది. 

డిసెంబర్ 1, 2017: 32 మంది పిటిషన్

2017 డిసెంబర్ 1న 32 మంది పౌర హక్కుల కార్యకర్తలు 2010లో అలహాబాద్ హైకోర్టు తీర్పుని సవాల్ చేస్తూ పిటిషన్ వేశారు. 2010లో అలహాబాద్ హైకోర్టు ఆ ల్యాండ్ ని 3 భాగాలుగా విభజిస్తూ తీర్పు ఇచ్చింది. దీన్నే సవాలు చేస్తూ 32 మంది పిటిషన్ వేశారు. 

మార్చి 14, 2018: అన్ని మధ్యంతర పిటిషన్లను తిరస్కరించిన సుప్రీంకోర్టు

2018 మార్చి 14న పౌర హక్కుల కార్యకర్తలు వేసిన పిటిషన్ ను  సుప్రీంకోర్టు విచారణ ప్రారంభించింది. 2016లో సుబ్రమణ్య స్వామి వేసిన పిటిషన్ సహా అన్ని మధ్యంతర పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ కేసులో పక్షాలుగా జోక్యం చేసుకోవాలని కోరింది.    

జూలై 6, 2018: యూపీ ప్రభుత్వం ఆరోపణలు

1994 నాటి తీర్పును మరలా పరిశీలించాలని కొంతమంది ముస్లిం గ్రూప్ లు విచారణను ఆలస్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని యూపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది.   

జనవరి 8, 2019: ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం ఏర్పాటు

బాబ్రీ మసీదు ల్యాండ్ ఇష్యూ కేసును విచారించేందుకు సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది.

నవంబర్ 9, 2019: చారిత్రాత్మక తీర్పు

అనేక వాదనలు, విచారణల అనంతరం సుప్రీంకోర్టు 2019 నవంబర్ 9న చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. 2.77 ఎకరాల వివాదాస్పద ల్యాండ్ రామ్ లల్లాకి చెందుతుందని.. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. కేంద్రం మూడు నెలల్లో ఒక ట్రస్టుని ఏర్పాటు చేస్తే భూమిని వారికి అప్పజెప్పడం జరుగుతుందని తెలిపింది. సున్నీ వక్ఫ్ బోర్డుకి మసీదు నిర్మించుకోవడానికి అయోధ్యలో మరొక ప్రత్యేక ప్రదేశంలో 5 ఎకరాల భూమిని ఇవ్వడం జరుగుతుందని సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం ఏకగ్రీవ తీర్పుని ఇచ్చింది.    

ఆగస్టు 5, 2020: రామ మందిర శంకుస్థాపన

సుప్రీంకోర్టు తీర్పుతో కేంద్రం రామ మందిర ట్రస్టుని ఏర్పాటు చేసింది. ఆగస్టు 5న అయోధ్య రామ మందిర నిర్మాణానికి అధికారికంగా పునాది పడింది. ఆగస్టు 5 ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30 వరకూ భూమి పూజ ఉంటుందని రామ మందిర ట్రస్టు ప్రకటించినట్టుగానే భూమి పూజ ఘనంగా జరిగింది. ఈ అయోధ్య భూమి పూజకు ప్రధాని నరేంద్రమోదీ హాజరయ్యారు. మోదీ రామ మందిర శంకుస్థాపన చేశారు. భూమి పూజ అనంతరం ఆలయ నిర్మాణం మొదలైంది. 

జనవరి 22, 2024: నెరవేరిన 500 ఏళ్ల నాటి హిందువుల కల..  

జనవరి 22న ప్రధాని మోదీ.. నిర్మాణంలో ఉన్న అయోధ్య రామ మందిరంలోని బాల రాముడి ప్రాణ ప్రతిష్ట మహోత్సవంలో మరోసారి ముఖ్య భూమిక పోషించనున్నారు. 

ఇదే బాబ్రీ, అయోధ్య రామ మందిరం పూర్తి చరిత్ర!

సారాంశం:

అయోధ్యలో ఎప్పటి నుంచో రామ మందిరం ఉందని.. బాబర్ రామ మందిరాన్ని కూల్చి మసీదు కట్టించాడని హిందువుల వాదన. అలా ఏం లేదు.. రామ మందిరం కూల్చలేదని ముస్లింల వాదన. దీంతో 2010లో అలహాబాద్ హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఆ 2.77 ఎకరాల స్థలం ముగ్గురికీ సమానంగా చెందుతుందని.. ముగ్గురూ సమానంగా పంచుకోండని చెప్పింది. ఈ తీర్పు ఎవరికీ నచ్చలేదు. సుప్రీంకోర్టులో కేసు వేశారు. ల్యాండ్ మీకే చెందుతుందని ఎవరు నిరూపించుకుంటే ఆ స్థలాన్ని వారికే ఇస్తామని సుప్రీంకోర్టు చెప్పింది. ల్యాండ్ గురించి వాస్తవాలు తెలియడానికి ‘ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా’ని నియమించింది. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టుకి తన వాదనలు వినిపించింది. మసీదు కింద 10వ శతాబ్దానికి చెందిన ఆలయం ఉన్నట్టు ఆధారం ఉందని అయితే దాన్ని కూల్చి మసీదు కట్టారనడానికి ఆధారాలు లేవని తెలిపింది. అయితే స్థలం లోపల కాంపౌండ్ లో ఎప్పటి నుంచో హిందువులు ప్రార్థన చేసుకుంటున్నట్లు సాక్ష్యం ఉందని, అలానే మసీదులో ముస్లింలు ఎప్పటి నుంచో ప్రార్థనలు చేసుకుంటున్నట్లు కూడా సాక్ష్యం ఉందని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తేల్చింది. ఇక ఆ స్థలం శ్రీరాముడికి చెందినట్లు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉన్నాయని, ముస్లింలు ప్రార్ధన చేసుకునే మసీదుని కూల్చేశారనే దానికి కూడా సాక్ష్యం ఉందని తెలిపింది. ఈ సాక్ష్యాలను ఆధారంగా చేసుకుని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. 2.77 ఎకరాల భూమి శ్రీరాముడి పేరు మీద రిజిస్టర్ అయి ఉంది కాబట్టి శ్రీరాముడి గుడి కట్టుకోవచ్చునని తీర్పు ఇచ్చింది. అలానే కేంద్ర ప్రభుత్వం ఒక ట్రస్ట్ ని ఏర్పాటు చేసి దానికి గుడిని కట్టే బాధ్యతను, తర్వాత ఉండే మెయింటెనెన్స్ ని అప్పగించాలని కోర్టు వెల్లడించింది. ముస్లింల ప్రార్థన చేసుకునే మందిరాన్ని కూల్చివేశారు కాబట్టి అయోధ్యలోనే ఏదైనా ముఖ్యమైన ప్రదేశంలో మసీదు కట్టుకోవడానికి 5 ఎకరాల ల్యాండ్ రాష్ట్ర ప్రభుత్వం గానీ కేంద్ర ప్రభుత్వం గానీ ఉచితంగా ఇవ్వాలని పేర్కొంది. ఇక నిర్మోహి అఖారా సంస్థకు ఆ ల్యాండ్ మీద ఎటువంటి హక్కు లేదని.. ఎప్పటి నుంచో పూజలు చేస్తున్నారు కనుక ట్రస్టులో వారికి ఏదైనా మంచి పదవి ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.

భిన్నమైన వాదనలు.. కానీ ఆలయం కూల్చింది నిజం..

అయితే రామ మందిరాన్ని బాబర్ కూల్చలేదని.. ఔరంగజేబు కూల్చాడని చరిత్ర చెబుతుంది. దేవాలయాలను కూల్చి మసీదులు కట్టించాడని చరిత్రకారులు చెబుతున్నారు. అలా కూల్చిన వాటిలో రామ మందిరం కూడా ఉందనేది వాదన. బాబర్ కాకపోతే ఔరంగజేబు.. కూల్చారని చరిత్రకారులు చెబుతున్నప్పుడు అక్కడ అయోధ్య రామ మందిరం కట్టడంలో తప్పు లేదు. అయితే మసీదుని కూల్చి కట్టడం అనేది ప్రజాస్వామ్య దేశంలో కరెక్ట్ కాదు. అలా చేస్తే ఔరంగజేబుకి, మనకి తేడా ఉండదు. అప్పుడు అతను ఆలయాన్ని కూల్చాడు, ఇప్పుడు మసీదుని కూల్చారు. కానీ ఇవన్నీ మర్చిపోయి ప్రశాంతంగా జీవించేలా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ విషయంలో మనుషులంతా గెలిచినట్టే. మరి మీరేమంటారు?

Show comments