TTD కీలక నిర్ణయం.. అలాంటి ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు!

TTD కీలక నిర్ణయం.. అలాంటి ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు!

నిత్యం వేలాది మంది శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమలకు వస్తుంటారు. అలానే భక్తుల సౌకర్యార్థం టీటీడీ అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. అయితే టీటీడీ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలపై కొందరు సోషల్ మీడియాలో అసత్య  ప్రచారాలు చేస్తుంటారు. ఇలాంటి తరుణంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ఏ.వీ ధర్మారెడ్డి కీలక విషయాలను వెల్లడించారు. శిథిలావస్థకు చేరిన రాతి మండపాలపై సామాజిక మాద్యమాల్లో అసత్యపు ప్రచారం చేస్తున్నారని  ఈవో ధర్మారెడ్డి మండిపడ్డారు. రాతి మండపాల నిర్మాణంపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో భక్తులు విశ్రాంతి తీసుకునే రెండు రాతి మండపాల్లో ఒకటి శిథిలావస్థకు చేరుకుందని ధర్మారెడ్డి తెలిపారు. కుడివైపు ఉన్న రాతిమండపం రిపేరు చేయడానికి కూడా వీలు లేకుండా శిథిలావస్థకు చేరుకుందని వెల్లడించారు. రాతి మండపాన్ని పునర్మిర్మాణం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇదే కాకుండా శిథిలావస్థకు చేరిన తిరుమలలోని పార్వేట మండపాన్ని కూల్చి పునర్నిర్మాణం చేస్తున్నట్లు వెల్లడించారు. శిథిలావస్థకు చేరిన రాతి మండపాలపై సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

16వ శతాబ్దంలో సాళువ వంశానికి చెందిన నరసింహరాయలు ఈ రాతి మండపాలను నిర్మించారు. వాటిని ఇప్పుడు యథావిధిగా రూ.1.36 లక్షలు వెచ్చించి 20 పిల్లర్లతో పునర్నిర్మాణం చేస్తున్నామని స్పష్టం చేశారు. ఇక ఈ రాతి మండపాలపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ధర్మారెడ్డిత తెలిపారు. అలానే నడక మార్గంలో చిరుతల సంచారంపై కూడా కీలక విషయాలను వెల్లడించారు. ఘాట్ రోడ్ లో బైక్ లను రాత్రి పది గంటల వరకు అనుమతిస్తున్నామని వెల్లడించారు. వన్యమృగాల కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచామని,సి.సి  కెమెరాలతో పాటు ట్రాప్ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

Show comments