రూ. 20 రూపాయలకే భోజనం.. తండ్రి ఆశయాలు కొనసాగిస్తున్న కొడుకులు..!

అన్నిదానాల్లోకెల్ల అన్నదానం గొప్పదంటారు. ఆకలితో ఉన్నవారి కడుపు నింపితే.. చల్లగా ఉండాలని దివిస్తుంటారు. కనీ పెంచిన తల్లిదండ్రులను పట్టించుకోని ఈ కాలంలో తండ్రి ఆశయాలు కొనసాగించే వారు కూడా ఉన్నారు.

అన్నిదానాల్లోకెల్ల అన్నదానం గొప్పదంటారు. ఆకలితో ఉన్నవారి కడుపు నింపితే.. చల్లగా ఉండాలని దివిస్తుంటారు. కనీ పెంచిన తల్లిదండ్రులను పట్టించుకోని ఈ కాలంలో తండ్రి ఆశయాలు కొనసాగించే వారు కూడా ఉన్నారు.

తమ పిల్లలు సమాజంలో గొప్ప పొజిషన్లో ఉండాలని ప్రతీ తల్లిదండ్రులు కోరుకుంటారు. అందుకోసం తమ సుఖసంతోషాలను వదులుకొని పిల్లల్ని ఎంతో కష్టపడి ఉన్నత చదువులు చదివించి మంచి స్థాయికి తీసుకొస్తారు. తీరా ఉన్నత స్థాయికి వెళ్ళాక కొంతమంది పిల్లలు.. తమ తల్లిదండ్రులను భారంగా భావించి వారిని వృద్ధాశ్రమాల్లో వదిలేస్తున్నారు. కొంతమంది మాత్రం తమకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను దైవంగా భావించి వారికి గుడి కట్టి పూజిస్తున్నారు. వారి ఆశయ సాధన కోసం పాటుపడేవారు ఉన్నారు. అలాంటి కోవలోకే వస్తారు నెల్లూరు జిల్లాకు చెందిన ఇద్దరు అన్నదమ్ములు. గతంలో తమ తండ్రి చేసిన గొప్ప పనులు ఇంకా కొనసాగిస్తూ తండ్రికి తగ్గ తనయులుగా అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. వివరాల్లోకి వెళితే..

ప్రకాశం జిల్లాకు చెందిన కోట శివరామయ్య అనే వ్యక్తి 1989 లో నెల్లూరు నగరానికి వలస వచ్చాడు. సంతపేటలో సింహపురి హార్డ్ వేర్ షాప్ ఏర్పాటు చేసి వ్యాపారం మొదలు పెట్టాడు. నిజాయితీగా వ్యాపారం కొనసాగించిన శివరామయ్య అతి తక్కువ కాలంలోనే వ్యాపారాభివృద్ది చేశారు. వ్యాపారం బాగా నడుస్తుంది.. తనకు ఇంతగా తోడ్పాటు అందించిన ప్రజల కోసం ఏదైనా చేయాలనే ఆలోచనతో పేద ప్రజలకు సహాయం అందించడం మొదలు పెట్టాడు. అంతేకాదు పేదలకు అన్నదానం చేస్తూ ఆకలి కష్టాలు తీర్చాడు. శివరామయ్య కాలం చేసిన తర్వాత వ్యాపార నిర్వహణ బాధ్యతలు ఆయన ఇద్దరు కుమారులు అయిన సూర్య నారాయణ, రమేష్ బాబులు చేపట్టారు. తండ్రికి తగ్గ తనయులుగా పేరు తెచ్చుకొని వ్యాపారాభివృద్ధి చేస్తూ వచ్చారు. తమకు ఇంత గొప్ప వ్యాపారం, పేరు ప్రతిష్టలు అందించిన తండ్రి కోసం ఏదైనా చేయాలని భావించారు ఇద్దరు అన్నదమ్ములు. అనుకున్నదే తడవుగా నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా సింహపురి భోజనశాల ఏర్పాటు చేశారు. ఆస్పత్రికి వచ్చేవారికి కడుపునిండా భోజనం పెడుతున్నారు.

ప్లేటు భోజనానికి కేవలం రూ.20 మాత్రమే తీసుకుంటూ.. తిన్నంత పెడుతున్నారు. ఈ సందర్భంగా హోటల్ యాజమాన్యం మాట్లాడుతూ.. ‘తమకు ఉచితంగా భోజనం పెట్టే అవకాశం ఉన్నప్పటికీ.. దాన్ని కొంతమంది నిర్లక్ష్యం చేస్తుంటారు. అలా అన్నం వృధా కాకుండా ఉండాలనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నామని అన్నారు. హోటల్ సిబ్బందికి నెలసరి వేతనాలు చెల్లించాలనే ఆ స్వల్ప మొత్తం వసూలు చేస్తున్నామని అన్నారు. ఒక ప్లేటు భోజనం రూ. 70 వరకు పడుతుందని అన్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందే రోగులకు, అక్కడి సిబ్బందికి భోజనం అందిస్తున్నామని అన్నారు. వారి వెంట వచ్చిన వారు బయట భోజనం చేయాలంటే రూ.100 వరకు ఖర్చు అవుతుందని.. అలాంటి వారి కోసం సింహపురి భోజనశాల అండగా నిలవాలని భావించి రూ. 20 లకే కడుపునిండా భోజనం పెడుతున్నామని అన్నారు. దీంతో ఆస్పత్రికి, సొంత పనుల కోసం వచ్చేవారు, చుట్టుపక్కల షాపుల్లో పనిచేసేవారు, దినసరి కూలీలు, పక్కనే ఉన్న గ్రౌండ్ లో గేమ్స్ ప్రాక్టీస్ చేసుకునే విద్యార్థులు ఇక్కడికి వచ్చి తమ ఆకలి తీర్చుకుంటున్నారని వెల్లడించారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం.. ఆకలి వచ్చే వారిని తృప్తి పరుస్తున్నామన్న ఆనందం తమకు ఉందని.. తమ తండ్రి ఆశయాలు కొనసాగిస్తూనే ఉంటామని’ అన్నారు. ఈ కాలంలో ఇలాంటి కొడుకులను కన్న కోట శివరామయ్య ఎంతో గొప్పవారని స్థానికులు మెచ్చకుంటున్నారు. మరి తండ్రి ఆశయాన్ని ముందుకు నడిపిస్తున్న కొడుకులపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments