తిరుపతి అలిపిరి నడక మార్గంలో పట్టుబడ్డ చిరుత! ఇది నాలుగోది

రెండు నెలలుగా తిరుపతిలో చిరుత పులుల సంచారంతో శ్రీవారి భక్తులు భయాందోళనలకు గురవుతున్నారు. కొన్ని వారాల క్రితం ఓ చిన్నారిపై చిరుత దాడి చేసి, చంపేసిన విషయం తెలిసిందే. ఆ ఘటన తర్వాత కూడా చిరుతలు పట్టుపడ్డాయి. తాజాగా సోమవారం కూడా మరో చిరుత కూడా పట్టుబడింది. దీంతో ఇప్పటి వరకు మొత్తం నాలుగు చిరుతలను అధికారులు బంధించారు. ఈ చిరుతను ఎస్వీ జూకు తరలిస్తున్నారు అధికారులు. ఇప్పటికే ఆ జూలో రెండు పట్టుబడిన చిరుతలు ఉన్నాయి. అయితే.. తిరుపతిలో చిరుతల సంచారంపై తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటు.. రాష్ట్ర ప్రభుత్వం సైతం ప్రత్యేక దృష్టి పెట్టి.. పటిష్ట చర్యలు తీసుకుంటోంది.

తిరుపతి అలిపిరి ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేసిన ప్రభుత్వం.. భారీ సంఖ్యలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి.. అటవీ శాక అధికారులను అప్రమత్తంగా ఉంచుతోంది. శ్రీవారి దర్శనానికి కాలినడక మార్గంలో వెళ్లే భక్తులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా.. ముఖ్యంగా చిరుతల సంచారంపై ఫోకస్‌ పెట్టారు అధికారులు. చిన్నారిపై దాడి తర్వాత.. భద్రతను ఎంతో పటిష్టంగా పెంచింది. కాగా.. ఆదివారం అలిపిరి నడక మార్గంలో పట్టుబడిన చిరుత 7వ మైలు వద్ద బోన్‌లో పట్టుబడింది. దాదాపు పది రోజులుగా ఈ చిరుత అటవీశాఖ అధికారులను తిప్పలు పెట్టింది.

చాలా సార్లు బోను వరకు వచ్చి దొరక్కుండా తెలివిగా వ్యవహరించింది. చిరుత సంచరిస్తున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో సైతం చిక్కాయి. అటవీ శాఖ అధికారులు తీవ్రంగా శ్రమించి.. ఎట్టకేలకు ఆపరేషన్‌ చిరుతను సక్సెస్‌ చేశారు. నాలుగో చిరుతను బంధించడంతో శ్రీవారి భక్తులతో పాటు అటవీ శాఖ అధికారులు సైతం ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పటి వరకైతే.. రాష్ట్రప్రభుత్వం తీసుకుంటున్న భద్రతా చర్యలతో తిరుమలకు వచ్చే భక్తులు సంతృప్తిగా ఉన్నారు. వారి భద్రత కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఉన్నత అధికారులు ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. మరి తిరుపతిలో నాలుగో చిరుతను అటవీ శాఖ అధికారులు బంధించడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: పోరాటాల నుంచి వచ్చినోడ్ని.. విమర్శకులకు TTD ఛైర్మన్ భూమన కౌంటర్!

Show comments