సీమెన్స్‌ స్కాం: సంచలన విషయాలు వెల్లడించిన CID చీఫ్‌!

ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ను కేబినేట్‌ అనుమతి లేకుండా ఏర్పాటు చేశారని ఏపీ సీఐడీ చీఫ్‌ సంజయ్‌ తెలిపారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఏర్పాటులో చంద్రబాబు విధి విధానాలను పాటించలేదని, ప్రైవేట్‌ వ్యక్తి అయిన గంటా సుబ్బారావుకు మూడు బాధ్యతలు ఇచ్చారని వెల్లడించారు. బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేసిన సంజయ్‌ సీమెన్స్‌ స్కాంకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

సీఐడీ చీఫ్‌ సంజయ్‌ మాట్లాడుతూ.. ‘‘ ఈ డిపార్ట్‌మెంట్‌ నేరుగా చంద్రబాబును సంప్రదించేలా విధివిధానాలను సిద్ధం చేశారు. ఇందుకు సంబంధించిన జీవలో చంద్రబాబు మొత్తం 13 చోట్ల సంతకాలు చేశారు. బడ్జెట్‌ అనుమతి, నిధుల విడుదల, కౌన్సిల్‌ సమావేశం, చార్టెడ్‌ అకౌంటెంట్‌ నియామకం, డిప్యూటీ సీఈఓ అపర్ణ నియామకం, క్యాబినెట్‌ మినిట్స్‌ ఇలా మొత్తం 13 చోట్ల ఆయన సంతకం చేశారు. సీమెన్స్‌తో స్కిల్‌ సెంటర్లు పెట్టాలన్న విషయం ఎంవోయూలో లేదు. ఒప్పందం దురుద్ధేశపూర్వకంగా జరిగింది. సీమెన్స్‌ , డిజైన్‌ టెక్‌ సంస్థల ద్వారా నిధుల మళ్లింపు జరిగింది’’ అని అన్నారు.

కాగా, చంద్రబాబు నాయుడ్ని హౌస్‌ కస్టడీకి ఇవ్వాలన్న లూథ్రా పిటిషన్‌ను ఏసీబీ కోర్టు కొట్టి వేసింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు మళ్లీ జైలుకే పరిమితం అయ్యారు. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఉన్నారు. చంద్రబాబు భద్రత కోసం ఆయన ఓ ప్రత్యేక గదిని ఏర్పాటు చేశారు. ఇంటినుంచి భోజనం తెప్పించుకోవటానికి అవకాశం కల్పించారు. మరి, చంద్రబాబు నాయుడు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ను కేబినేట్‌ అనుమతి లేకుండా ఏర్పాటు చేసి, మోసానికి పాల్పడ్డారన్న సీఐడీ చీఫ్‌ కామెంట్లపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments