యువతిని కాపాడిన AP పోలీసులు.. వెల్లువెత్తిన అభినందనలు!

ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ పనితీరుపై అభినందలను వెల్లువెత్తున్న విషయం తెలిసిందే. సామాన్యుల సమస్యలకు సకాలం స్పందిస్తూ.. ప్రశంసలు అందుకుంటున్నారు. గతంలో దట్టమైన అడవిలో కూడా మృతదేహాన్ని మోసుకుంటూ వచ్చిన కానిస్టేబుల్ ఘటన మనందరికి తెలిసిందే. అలానే వివిధ విపత్కర పరిస్థితుల్లో ఏపీ పోలీసులు స్పందించి..అనేక మంది ప్రాణాలు కాపాడారు. తాజాగా మరోసారి తాడేపల్లి పోలీసులపై ప్రశంసలు వెళ్లువెత్తాయి. ఆత్మహత్యకు యత్నించిన యువతిని సకాలంలో స్పందించి తాడేపల్లి పోలీసులు కాపాడారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..

గురువారం అర్థరాత్రి విజయవాడలోని రాణిగారి తోటకు చెందిన ఓ యువతి ఇంట్లో తల్లిదండ్రులతో గొడవ పడింది. అనంతరం ఇంటి నుంచి బైక్ పై కనకదుర్గ వారధికి వచ్చింది. గుంటూరు నుంచి విజయవాడ వెళ్లే కృష్ణా బ్రిడ్జీ రహదారిలో 26–27 పిల్లర్ల వద్ద బైక్ పార్క్‌ చేసింది. అనంతరం సదరు యువతి కృష్ణా నదిలోకి దూకింది. దూరం నుంచి గమనించిన ఒకరు పోలీసుల కు సమాచారం అందించారు. దీంతో విజయవాడ, తాడేపల్లి పోలీసులు కనకదుర్గ వంతెన వద్దకు చేరుకున్నారు. తొలుత తాడేపల్లి ఎస్‌ఐ రమేష్‌, హెడ్‌ కానిస్టేబుల్‌ రామకృష్ణ, బీట్‌ కానిస్టేబుల్‌ షరీమ్‌ స్వామిలతో కలసి కృష్ణానదిలో యువతి దూకిన ప్రాంతం వద్దకు వెళ్లారు. సుమారు 1.5 కిలోమీటర్లు ఇసుకలో నడుచుకుంటూ నది వద్దకు వెళ్లారు. అప్పటికే నదిలో అపస్మారక స్థితిలో పడిఉన్న యువతిని గుర్తించారు.

ఒడ్డుకు తీసుకు వచ్చి.. తాగిన నది నీటిని కక్కించి, ప్రాథమిక చికిత్స చేశారు. అప్పటికీ కూడా యువతి తేరుకోలేదు. దీంతో ఆ యువతిని దుప్పటి సాయంతో మోసుకుంటూ వారధి వద్దకు తీసుకు వచ్చారు. మెరుగైన వైద్యనిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. యువతి ప్రాణానికి అపాయం లేదని వైద్యులు చెప్పడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. అర్థరాత్రి యువతిని కాపాడిన సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు. అలాగే పోలీసులకు సమాచారం ఇచ్చిన యువకుడికి కూడా పోలీస్‌శాఖ తరుపున అభినందనలు తెలియజేశారు. స్థానికులు సైతం తాడేపల్లి పోలీసులపై ప్రశంసల వర్షం కురిపిస్తోన్నారు. మరి..యువతి ప్రాణాలు కాపాడిన ఈ పోలీసులపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments