ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఆంధ్ర్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పథంలో వడివడిగా దూసుకెళ్తోంది. అన్ని రంగాలపై దృష్టి పెట్టిన సీఎం జగన్.. ఏపీని అన్నింటా ముందంజలో నిలపాలనే ఉద్దేశంతో పాలనను పరుగులు పెట్టిస్తున్నారు. విద్యా రంగంపై కూడా ముఖ్యమంత్రి స్పెషల్ ఫోకస్ పెట్టారు. అందుకు తగినట్లుగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. దాని ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నివేదిక ప్రకారం.. దేశంలోనే విద్యా రంగంలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా నిలిచింది.
రాష్ట్రంలో విద్యా రంగాన్ని మరింత బలోపేతం చేయడంలో భాగంగా జగన్ సర్కారు తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ వ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో మొబైల్ ఫోన్ల వాడకం మీద విద్యా శాఖ నిషేధం విధించింది. స్కూళ్లకు విద్యార్థులు మొబైల్ ఫోన్లు తీసుకురావడంపై పూర్తి నిషేధం విధిస్తూ మెమో జారీ చేసింది. టీచర్లు కూడా తరగతి గదుల్లోకి ఫోన్లు తీసుకురాకుండా ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఉపాధ్యాయులు తరగతి గదులకు వెళ్లడానికి ముందు తమ మొబైల్ ఫోన్లను ప్రధానోపాధ్యాయుడికి అప్పగించాలని సూచించింది.
యునెస్కో రిలీజ్ చేసిన గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ రిపోర్ట్ ఆధారంగా.. బోధనకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. ఉపాధ్యాయ సంఘాలతో పాటు ఇతర వర్గాలతో చర్చించిన అనంతరమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది పాఠశాల విద్యాశాఖ. రూల్స్ ఉల్లంఘించిన టీచర్ల మీద క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. స్కూల్ ప్రిన్సిపాల్, పైఅధికారులు ఈ నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా చూడాలని ఆదేశాలు జారీ చేసింది.