iDreamPost

వరదల్లో సినీ నటి గల్లంతు.. ఆందోళనలో కుటుంబ సభ్యులు!

వరదల్లో సినీ నటి గల్లంతు.. ఆందోళనలో కుటుంబ సభ్యులు!

సిక్కిం ఇంకా వరద గుప్పిట్లోనే ఉంది. ఇటీవల భారీగా కురిసిన వర్షాలకు తీస్తా నదికి ఆకస్మిక వరదలు వచ్చాయి. నీటి మట్టం ఒక్కసారిగా పెరగడంతో సమీపంలోని ప్రాంతాలన్నీ నీటమునిగాయి. ఈ వరదల్లో ఇప్పటి వరకు 53 మంది మరణించారు. వీరిలో ఏడుగురు సైనికులు కూడా ఉన్నారు. గల్లంతైన 142 మంది కోసం నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్), ఆర్మీ నేతృత్వంలోని సహాయక దళాలు గాలింపు చర్యలు చేపడుతున్నాయి. అలాగే తీస్తా నది ఉగ్రరూపం దాల్చడంతో పలు వంతెనలు, ఆనకట్టలు కూడా కుప్పకూలిపోతున్నాయి. సుమారు 11 వంతెలను కొట్టుకుపోయాయని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి సిక్కింకు వచ్చిన 3వేల మంది పర్యాటకులు అక్కడే చిక్కుకున్నట్లు తెలుస్తోంది.

ఈ సిక్కిం వరదల్లో తెలుగు నటి సరళకుమారి తప్పిపోయినట్లు తెలుస్తోంది. సరళకుమారి తన స్నేహితులతో కలిసి సిక్కిం పర్యటనకు వెళ్లినట్లు సమాచారం. సిక్కింలో వరదలు మొదలైన నాటి నుండి ఆమె ఆచూకీ లేదు. వరదల్లో తన తల్లి తప్పిపోయిందని, ఆమె ఆచూకీ కనిపెట్టాలని అమెరికాలో ఉంటున్న సరళ కుమార్తె సబిత తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. అక్టోబర్ 3వ తేదీన ఆమె చివరిసారిగా మాట్లాడారని, ఆ తర్వాత ఎటువంటి సమాచారం లేదని అన్నారు. వార్తలు చూసి ఆర్మీ హాట్ లైన్ నంబర్లకు ఫోన్ చేసినా అవి పనిచేయడం లేదని తెలిపారు. 1983లో మిస్ ఏపీగా ఎంపికైన సరళకుమారి.. ఆ తర్వాత సినీ రంగంలోకి అడుగుపెట్టారు. దాన వీర శూరకర్ణ, సంఘర్షణ వంటి చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం ఆమె హైదరాబాద్ లోని హైటెక్ సిటీ ప్రాంతాలో నివాసం ఉంటున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి