iDreamPost

ఉద్యోగాల భర్తీ చుట్టూ రాజకీయాలు

ఉద్యోగాల భర్తీ చుట్టూ రాజకీయాలు

తెలంగాణ ప్రభుత్వ తాజా నిర్ణయంపై ప్రతిపక్షాలు దాడిని ముమ్మరం చేశాయి. కేసీఆర్ ఢిల్లీ పర్యటన తరువాత రాష్ట్రంలో ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ, హోం శాఖ మంత్రి అమిత్ షా, జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ని కలిసిన ముఖ్యమంత్రి రాష్ట్రానికి రావల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టుల గురించి చర్చించారు. ఢిల్లీ నుంచి వచ్చిన వెంటనే 50 ఉద్యోగాల భర్తీకి ఆదేశాలు జారిచేశారు. ముఖ్యమంత్రి ఈ నిర్ణయంపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. బీజేపీ దూకుడుగా విమర్శలు గుప్పిస్తోంది. తాజాగా విజయశాంతి కేసీఆర్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 50వేల పోస్టుల భర్తీకి సిద్ధమైన కేసీఆర్ పై మరోమారు ప్రతిపక్షాల దాడి మొదలైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలను నమ్మొద్దని.. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసమే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని విమర్శిస్తున్నాయి. తెలంగాణ జన సమితి నేత ప్రొఫెసర్ కోదండరాం సైతం కేసీఆర్ ప్రకటనను తప్పుబట్టారు. ఎమ్మెల్సీ ఎన్నికలు, నాగార్జున సాగర్‌ ఉపఎన్నిక నేపథ్యంలోనే ఉద్యోగాల భర్తీ ప్రకటన చేశారని విమర్శించారు. చిత్తశుద్ధి ఉంటే ప్రకటించిన 50 వేల ఉద్యోగాలను మార్చిలోపే భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ శాఖల్లో ఎన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయో ఫైనాన్స్‌ కమిషన్‌ వద్ద లెక్కలు ఉండగా, ఖాళీల భర్తీకి కమిటీలు ఎందుకని ప్రశ్నించారు. జో నల్‌ వ్యవస్థ పరిష్కారం కాకుండా ఖాళీల భర్తీ అసాధ్యమన్నారు. మూడేళ్ల నుంచి ప్రభుత్వం టెట్ నిర్వహించలేదని, అలాంటప్పుడు ఉపాధ్యాయ పోస్టులను ఎలా భర్తీచేస్తారని ప్రశ్నించారు.

ఉద్యోగాల భర్తీ నిర్ణయంపై బీజేపీ నేత విజయశాంతి ఘాటుగా స్పందించారు. కేసీఆర్ ఉచ్చులో పడి యువత మోసపోవద్దని, తెలంగాణలో 50వేల ఉద్యోగాల భర్తీకి అవకాశమే లేదని అన్నారు. దుబ్బాక, గ్రేటర్ వైఫల్యాల తరువాత కేసీఆర్ కు నిరుద్యోగులు గుర్తొచ్చారా? అంటూ ఎద్దేవా చేశారు. ఆరేళ్లుగా పట్టించుకోని ముఖ్యమంత్రి ఇంత హడావడిగా ఉద్యోగాల భర్తీ నిర్ణయం తీసుకోవడం వెనక కుట్రను అర్థం చేసుకోవాలన్నారు. నీళ్లు, నిధులు, నియమకాలు అంటూ ఉద్యమాన్ని నడిపి అధికారంలోకి రాగానే ఆ మాటే విస్మరించారని విమర్శించారు. బీజేపీకి భయపడే కేసీఆర్ ఉద్యోగాల భర్తీకి సిద్ధమయ్యారని అన్నారు. ఉద్యోగాల భర్తీ ప్రకటన సిద్ధిపేటకు అంతర్జాతీయ విమానాశ్రయం లాంటి జోక్ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. కేసీఆర్ మాటలను ప్రజలు సీరియస్ గా తీసుకోవడం లేదన్నారు.

తెలంగాణలో లక్షలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాల భర్తీ కోసం ఎదురుచూస్తున్నారు. అలాంటి వారికి తాజా ప్రభుత్వ నిర్ణయం కొత్త ఆశలను రేకెత్తిస్తోంది. అదే సమయంలో రాష్ట్రంలో లక్షకు పైగా ఖాళీలున్నాయని, అన్ని ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ముందుకు రావాలనే వాదనా వినిపిస్తోంది. ప్రతిపక్షాల వాదన ఎలా ఉన్నా ప్రభుత్వం అనుకున్న రీతిలో నిర్ణీత సమయంలో ఉద్యోగాల భర్తీ చేయగలిగితే కొంతలో కొంతైనా నిరుద్యోగ యువతకు మేలు జరుగుతుంది. ప్రభుత్వం ఆ దిశలో అడుగులేయాని ఉద్యోగార్థులు ఆశిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి