iDreamPost

ఎన్నికలను ఆపండి ప్లీజ్‌..!

ఎన్నికలను ఆపండి ప్లీజ్‌..!

తెలంగాణలో కరోనా కేసులు ఉధృతంగా పెరుగుతుంటే, రాజకీయ నాయకులకు మాత్రం మున్సిపల్‌ ఎన్నికల టెన్షన్‌ పట్టుకుంది. నాగార్జునసాగర్‌ ఉప ఎన్నిక అనంతరం వెలుగులోకి వస్తున్న పొలిటికల్‌ లీడర్ల పాజిటివ్‌ వార్తలు కలకలం సృష్టిస్తున్నాయి. ఏకంగా సీఎం కేసీఆర్‌ కుటుంబంలో పలువురు కరోనా బారిన పడడానికి ఆ ఎన్నికే కారణమన్న వాదన వినిపిస్తోంది. ఈ క్రమంలో మినీ మునిసిపల్‌ ఎన్నికలను వాయిదా వేయాలన్న డిమాండ్‌ రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటికే కరోనా కట్టడి చర్యలలో భాగంగా, ఎన్నికల ప్రచారంపై ఎస్‌ఈసీ పరిమితులు విధించింది. సాయంత్రం 7 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు సభలు, రోడ్డు షోలను నిషేధించింది. ఈ నెల 27వ తేదీ సాయంత్రం 5 గంటలతో ప్రచారం ముగించాలని స్పష్టం చేసింది. ఈ నెల 30న పోలింగ్‌ నిర్వహించనున్నారు. ఎన్నికలను ఆపాలన్న డిమాండ్లు పెరుగుతున్న నేపథ్యంలో ఉత్కంఠ ఏర్పడింది.

వాయిదా వేసే అవకాశాలపై గవర్నర్‌ ఆరా!

కరోనా కేసుల సంఖ్య ప్రతి రోజూ వేలల్లో ఉంటుండటంతో మినీ మునిసిపల్‌ ఎన్నికలను వాయిదా వేయాలని పలు రాజకీయ పార్టీలు, సంస్థలు కోరుతున్నాయి. ఈ మేరకు ప్రభుత్వానికి, ఎస్‌ఈసీకి వినతులను కూడా సమర్పించాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల నిర్వహణ సరైంది కాదని, గవర్నర్‌ జోక్యం చేసుకోవాలని కోరుతూ కాంగ్రెస్‌ ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆమెకు లేఖ రాశారు. లేఖ అందిన వెంటనే ఆయనకు ఫోన్‌ చేసిన తమిళిసూ, ఈ విషయంపై ఎస్‌ఈసీతో మాట్లాడతానని హామీ ఇవ్వడమే కాదు.. వెంటనే ఎస్‌ఈసీ పార్థసారధికి ఫోన్‌ చేసి ఎన్నికలపై వివరాలు కనుక్కున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న మినీ మునిసి‘పోల్స్‌’ను వాయిదా వేసేందకు గల సాధ్యాసాధ్యాలపై గవర్నర్‌ తమిళిసై ఆరా తీసినట్లు తెలిసింది.

సీఎం కేసీఆర్‌కు విపక్ష నేతల బహిరంగ లేఖ

ఇదిలా ఉండగా, కరోనా వైరస్‌ కరాళ నృత్యం చేస్తున్న వేళ రాష్ట్రంలో మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహించడం బాధ్యతారాహిత్యమని టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, విద్యావేత్త చుక్కారామయ్య అన్నారు. ప్రజల జీవించే హక్కును కాపాడేందుకు వెంటనే ఎన్నికలను నిలిపేయాలని సీఎం కేసీఆర్‌ను వారు కోరారు. శనివారం వారు ఈ మేరకు సీఎంకు బహిరంగ లేఖ రాశారు. కరోనా కట్టడికి చర్యలు తీసుకోవాల్సిన సమయంలో ఎన్నికలు నిర్వహించటం వైరస్‌ ఉధృతికి కారణమవుతోందని, ‘సాగర్‌’లో విపరీతంగా పెరిగిన కరోనా కేసులే దీనికి సాక్ష్యమన్నారు. దేశవ్యాప్తంగానూ ఎక్కడ ఎన్నికలు జరిగితే అక్కడ కోవిడ్‌ కేసులు పెరిగాయని గుర్తు చేశారు. ఈ ఎన్నికలేమీ రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేవవి కావని, ఐదారు నెలల పాటు వాయిదా వేసినా ప్రజాస్వామిక ప్రక్రియకు వచ్చే నష్టం ఏమీ లేదన్నారు. పరిరిస్థితులు మారిన తరుణంలో ఎన్నికలు అవాంఛనీయమన్నారు. బలవంతంగా ఎన్నికలు జరిపి మరిన్ని ప్రాణాలను బలితీసుకోవద్దంటూ విజ్ఞప్తి చేశారు.

ఎన్నికల వాయిదా కోరుతూ డిమాండ్లు వెల్లువెత్తుతుండడం, ఎన్నికల నిర్వహణ తీరుపై నివేదిక ఇవ్వాలని గవర్నర్‌ ఆదేశించడం.. వంటి నేపథ్యంలో మినీ మున్సిపల్‌ సంగ్రామం నిర్వహణపై ఆసక్తి ఏర్పడింది.

Also Read : కరోనా వ్యాక్సిన్‌ అలా కూడా ఉపయోగపడుతోంది..!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి