iDreamPost

ముగియనున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారం

ముగియనున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారం

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఇవాళ (సోమవారం) సాయంత్రం 5 గంటలతో ముగిసిపోనుంది. దీంతో బహిరంగ సభలు, పార్టీల ప్రచారాలు, వీడియోల ప్రచారం, రోడ్ షోలు ఉండరాదని ఎన్నికల అధికారులు పోలీసు యంత్రాంగం దీనిపై నిఘా ఉంచాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఇప్పటికే స్పష్టంచేసింది.

మొత్తంగా ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఎటువంటి యాక్టివిటిలు ఉండరాదని ఎన్నికల అధికారులకు సర్కులర్ ద్వారా తెలిపింది. మరోవైపు పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, ఓటర్ల జాబితా, బ్యాలెట్ పత్రాల ముద్రణ కూడా పూర్తయింది. దాదాపుగా 55వేలమంది సిబ్బంది ఈ మున్సిపల్ ఎన్నికల విధులు నిర్వహించనున్నారు. వీరికి అవసరమైన శిక్షణను ఇప్పటికే పూర్తి అయ్యింది. మొత్తంమీద సగటున 800మంది ఓటర్లకు ఓ పోలింగ్ కేంద్రం చొప్పున 8111 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేశారు. వాటిలో ఓటర్లకు సదుపాయాలు కల్పించే ఏర్పాట్లు చేస్తున్నారు.

120 మున్సిపాలిటీల్లో 2,727 వార్డులు, తొమ్మిది కార్పొరేషన్లలోని 325డివిజన్లకు 80వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 2,972 వార్డుల్లో ఎన్నికలు జరగునున్నాయి. మొత్తంగా 12,898 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిని పార్టీలవారీగా చూస్తే అధికార టిఆర్ఎస్ నుంచి ఎక్కువగా 2972 మంది, కాంగ్రెస్ నుండి 2616 మంది, బిజెపి నుంచి 2313మంది బరిలో నిలిచారు. సీపీఎం 166, సీపీఐ 177 మందిని పోటీలో నిలిపాయి.. టిడిపి నుంచి 347 మంది, ఎంఐఎం నుండి 276 మంది, ఇతర రాష్ట్రాల్లో రాష్ర్టస్థాయి గుర్తింపు ఉన్న పార్టీల నుంచి 281 మంది ఉండగా ఇండిపెండెండ్లు ఏకంగా 3750 మంది బరిలోకి దిగుతున్నారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో 60 వార్డులకు అత్యధికంగా 415 మంది అభ్యర్థులుండగా, అతి తక్కువ వడ్డెపల్లి మున్సిపాలిటీలో 10వార్డులకు కేవలం 29మంది మాత్రమే బరిలో నిలిచారు.

డిసెంబర్ 23న ఎన్నికల షెడ్యూల్ విడుదల సందర్భంగా ఇచ్చిన గుడువు అభ్యంతరాలు స్వీకరించి పరిష్కరించేందుకు సరిపోదనీ తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. అయినా ఎస్ఇసి మాత్రం అనుకున్నట్టుగా ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల, అభ్యంతరాల స్వీకరణ, పరిష్కారం అయిపోయినట్టు ప్రకటించింది. ఆ వెంటనే రిజర్వేషన్ల ఖరారు, ఎన్నికల నోటిఫికేషన్ విడుదల, నామినేషన్ల స్వీకరణ, తిరస్కరణ, ఉపసంహరణ, ఏకగ్రీవాల ప్రకటన ఎన్నికలు నిర్వహించటానికి అవసరమైన ప్రక్రియ వేగంగా జరిగిపోయింది. మరికొన్నిగంటల్లో అభ్యర్థుల భవితవ్యం ఓటర్ల చేతినుండి బ్యాలెట్ బాక్సుల్లోకి వెళ్లనుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి