iDreamPost

తిరుపతి ఉప ఎన్నిక కేంద్రానికి, టీడీపీకి మధ్య యుద్ధమని బాబుకు తెలుసా పనబాక లక్ష్మీ గారు..?

తిరుపతి ఉప ఎన్నిక కేంద్రానికి, టీడీపీకి మధ్య యుద్ధమని బాబుకు తెలుసా పనబాక లక్ష్మీ గారు..?

తిరుపతి ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మీ చేస్తున్న ప్రచారం ఆసక్తిని కలిగిస్తోంది. టీడీపీ నేతలు రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తుంటే.. పనబాక లక్ష్మీ మాత్రం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తూ హాట్‌ టాపిక్‌గా మారారు. ‘‘ తిరుపతి ఉప ఎన్నిక కేంద్రానికి, టీడీపీకి మధ్య జరుగుతున్న యుద్ధం’’ అంటూ పనబాక లక్ష్మీ బాంబ్‌ పేల్చారు. అంతేకాదు ఈ ఎన్నికల్లో తనను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే.. పార్లమెంట్‌లో ఆంధ్రుల ఆత్మగౌరవం నిలిచినట్లేనని కూడా ఆమె తన ప్రచారంలో చెబుతున్నారు.

టీడీపీ విధానానికి పూర్తి భిన్నంగా పనబాక లక్ష్మీ ప్రచారం చేస్తున్నారని.. తిరుపతి ఉప ఎన్నిక కేంద్రానికి, టీడీపీకి మధ్య యుద్ధమని ఆమె చేసిన వ్యాఖ్యలతోనే స్పష్టంగా తెలుస్తోంది. చంద్రబాబుకు చెప్పే పనబాక లక్ష్మీ ఈ తరహా వ్యాఖ్యలు చేశారా..? అనేదే తెలియాలి.

ఎందుకంటే.. 2019 ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఇప్పటి వరకూ బీజేపీపైగానీ, కేంద్రంపైన గానీ టీడీపీ నేతలు, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పల్లెత్తు మాట అనలేదు. పైగా కేంద్రాన్ని, బీజేపీని ప్రసన్నం చేసుకునేందుకు అమిత్‌షా పుట్టినరోజు లాంటి ఏ చిన్న అవకాశం వచ్చినా వదల్లేదు.

ప్రత్యేక హోదాపైన, పోలవరం నిధులు విషయంలోనూ చివరికి స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరించాలనే నిర్ణయం తీసుకున్న సమయంలోనూ చంద్రబాబు.. కేంద్రాన్ని కానీ, ప్రధాని నరేంద్ర మోదీని గానీ విమర్శించలేదు. కేంద్ర ప్రభుత్వ విధానాలను తప్పుబట్టలేదు. మరి ఇలాంటిది తిరుపతి ఉప ఎన్నిక.. కేంద్రానికి, టీడీపీకి మధ్య యుద్ధమని పనబాక లక్ష్మీ ఎలా చెప్పారు..? అంటే ఆమె 2018లోనే ఉన్నట్లు అర్థమవుతోంది.

Also Read : రత్నప్రభ గెలిస్తే కేంద్ర మంత్రి పదవంట.. అవునా.. అంత సీన్ ఉందా?

2014 ఎన్నికల్లో బీజేపీతో పొత్తుపెట్టుకున్న టీడీపీ అధికారంలోకి వచ్చింది. రాష్ట్రంలో, కేంద్రంలో ఆ రెండు పార్టీలు అధికారాన్ని పంచుకున్నాయి. ప్రత్యేక హోదా ఇవ్వని బీజేపీతో ఉంటే నష్టమని భావించిన చంద్రబాబు.. 2019 ఎన్నికలకు ఏడాది ఉందనగా బీజేపీతో తెగతెంపులు చేసుకున్నారు. బీజేపీపై, ప్రధాని మోదీపై తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు.

సీన్‌ కట్‌ చేస్తే.. ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది. వైసీపీ గెలిచింది. కేంద్రంలో బీజేపీ మళ్లీ వచ్చింది. బాబు లెక్క తప్పడంతో.. నాలుక్కరుచుకున్నారు. అవినీతి కేసులు, అమరావతి భూ కుంభకోణం, టీడీపీ దారుణ పరిస్థితి.. నుంచి గట్టెక్కాలంటే బీజేపీతో దోస్తీనే దిక్కు అని చంద్రబాబు భావించారు. మళ్లీ బీజేపీతో దోస్తీకి ఎన్నికల ఫలితాలు వెల్లడైన వెంటనే ప్రయత్నాలు ప్రారంభించారు. బీజేపీతో విభేధించి నష్టపోయామనేలా పరోక్ష అర్థం వచ్చేలా.. కేంద్రంతో విభేధించి నష్టపోయామని చెప్పుకొచ్చారు. తన పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులను బీజేపీలోకి పంపారు. ఎన్నికలు జరిగి దాదాపు రెండేళ్లు కావస్తున్నా.. ఇప్పటికి ఒక్కసారి కూడా చంద్రబాబు బీజేపీని పల్లెత్తు మాట అనలేదు.

2019 తర్వాత టీడీపీ రాజకీయ విధానాన్ని, ఏపీ రాజకీయాలను.. ముఖ్యంగా టీడీపీ రాజకీయాలను పనబాక లక్ష్మీ పెద్దగా ఫాలో కానట్లుగా ఉంది. అందుకే ఆమె తిరుపతి ఉప ఎన్నికల కేంద్రానికి, టీడీపీ మధ్య యుద్దం అని అభివర్ణించినట్లుగా ఉంది. పనిలో పనిగా ఎన్టీఆర్‌ ద్వారా వెలుగులోకి వచ్చిన ఆంధ్రుల ఆత్మగౌరవం అనే మాటను కూడా పనబాక తన ప్రచారంలో చెబుతుండడం విశేషం. పనబాక వ్యాఖ్యలు సీరియస్‌గా తీసుకుంటే.. కేంద్రంతో టీడీపీ యుద్ధం చేస్తుందీ.. లేనిది.. చంద్రబాబే చెప్పాలి.

Also Read : గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు వైసీపీ కుట్రట.. జనసేనకు అసలు నిబంధనలు తెలుసా..?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి