iDreamPost

బాబు పరిషత్ బహిష్కరణ ‘విప్’ ధిక్కరణ !

బాబు పరిషత్ బహిష్కరణ ‘విప్’ ధిక్కరణ !

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను బహిష్కరించాలని టీడీపీ అధినేత చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ వర్గాలు ధిక్కరిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణుల మనోగతం తెలుసుకోకుండా.. ప్రజల్లో ఉండాలంటే, పార్టీ ఓట్ బ్యాంక్ ను కాపాడుకోవాలంటే ఎన్నికల్లో పాల్గొనక తప్పదని బలంగా విశ్వసిస్తున్న పార్టీ కిందిస్థాయి క్యాడర్ అధినేత నిర్ణయాన్ని జీర్ణించుకోలేక పోతున్నాయి. దానికి నిరసనగా రాజీనామాలు, వైఎస్సార్సీపీలో చేరిపోవడం చేస్తున్నారు.

మరోవైపు పార్టీలో ఉన్నత పదవుల్లో ఉన్నవారు సైతం చంద్రబాబు ఆదేశాలను ధిక్కరించి ఎన్నికల్లో పోటీకి సై అంటున్నారు. శ్రీకాకుళం జిల్లాలోనూ ఈ పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. సాక్షాత్తు టీడీపీ జిల్లా అధ్యక్షుడు, పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ విప్ హోదాలో అధికార దర్పం ప్రదర్శించిన కూన రవికుమార్ తన నియోజకవర్గంలో పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా అభ్యర్థులను పోటీలో కొనసాగాలని ప్రోత్సహిస్తున్నారు. టీడీపీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఇచ్చాపురంతో సహా పలు నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి నెలకొంది.

ప్రకటన ఒకలా.. ఆచరణ మరోలా..

పరిషత్ ఎన్నికలను మొదటి నుంచి కాకుండా గత ఏడాది ఆగిపోయిన చోట నుంచి కొనసాగిస్తూ ఎస్ ఈసీ నోటిఫికేషన్ జారీ చేయడాన్ని వ్యతిరేకిస్తున్నామన్న నెపంతో ఈ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. పార్టీ ఆదేశాలను అందరూ పాటించాల్సిందేనని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా స్పష్టంచేశారు. ఆ మేరకు పార్టీ శ్రీకాకుళం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, మాజీ విప్ కూన రవికుమార్ ప్రెస్ మీట్ పెట్టి జిల్లాలో ఎన్నికలు బహిష్కరిస్తున్నట్లు చెప్పారు.

కానీ ఆచరణలో ఆయనే పార్టీ నిర్ణయాన్ని ధిక్కరిస్తున్నారు. తన నియోజకవర్గమైన ఆమదాలవలస పరిధిలోని అన్ని మండలాల్లో ఎన్నికల బరిలో కొనసాగేలా టీడీపీ అభ్యర్థులను ప్రోత్సహిస్తున్నారు. వారికి మార్గదర్శిగా ఉండాలని కాబోలు.. తన స్వగ్రామమైన పొందూరు మండలం కోటిపల్లిలో ఎంపీటీసీగా పోటీ చేస్తున్న తన సతీమణి ప్రమీల తరపున స్వయంగా ప్రచారం కూడా చేస్తున్నారు. కాగా ఇదే నియోజకవర్గ పరిధిలోని బూర్జ మండలంలో పార్టీ సీనియర్ నేత రామకృష్ణనాయుడు కూన బాటలోనే నడుస్తూ మండలంలో టీడీపీ అభ్యర్థులను ప్రోత్సహిస్తూ ప్రచారం చేస్తున్నారు.

జిల్లా అంతటా ఇదే సీన్

ఒక్క ఆమదాలవలసలొనే కాకుండా జిల్లా వ్యాప్తంగా దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. గత సార్వత్రిక ఎన్నికల్లో -జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాలకు గాను టెక్కలి, ఇచ్చాపురాల్లో మాత్రమే టీడీపీ గెలిచింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు టెక్కలికి ప్రాతినిధ్యం వహిస్తుండగా .. మరో నియోజకవర్గం ఇచ్చాపురానికి బెందాళం అశోక్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన ఇలాఖాలోను అన్ని మండలాల్లో పోటీ చేయాల్సిందేనని తీర్మానించారు. నాలుగు మండలాల కార్యకర్తలతో సమావేశం నిర్వహించి పార్టీ నిర్ణయాన్ని గౌరవించాలని ఒకరిద్దరు నేతలు చెప్పబోగా కార్యకర్తలు మూక్కుమ్మడిగా అభ్యంతరం చెప్పారు. గ్రామస్థాయిలో బలం కాపాడుకోవడానికి పోటీ చేయకతప్పదని స్పష్టం చేశారు. పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కళా వెంకటరావు నియోజకవర్గమైన ఎచ్చెర్ల, పలాస, రాజాం, పాలకొండ, నరసన్నపేట నియోజకవర్గాల్లోనూ అధికశాతం టీడీపీ నేతలు అధిష్టానం నిర్ణయంపై తిరుగుబాటు బావుటా ఎగరేసి ఎన్నికల బరిలో నిలిచారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి