iDreamPost

వై.సి.పిలో చేరిన టి.డి.పి సీనియర్ నేత కుమార్తె.

వై.సి.పిలో చేరిన టి.డి.పి సీనియర్ నేత కుమార్తె.

స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఉత్తరాంధ్రలో తెలుగుదేశం పార్టికి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతగా , రాష్ట్ర తెలుగుమహిళా అధ్యక్షురాలిగా చాలా కాలం పనిచేసిన శోభా హైమావతి కూతురు విజయనగరం టిడిపి జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ శోభా స్వాతిరాణి తెలుగుదేశం పార్టీని వీడి వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

డెంటల్ డాక్టర్‌ చదివి, తల్లి శోభా హైమావతి ప్రోద్బలంతో వారసత్వంగా రాజకీయాల్లో అడుగుపెట్టిన స్వాతిరాణి 2014లో జరిగిన ప్రాదేశిక ఎన్నికల్లో తొలిసారి వేపాడ మండల జెడ్పీటీసీ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. ఆ వెంటనే ఎస్టీ కోటా లో జెడ్పీ చైర్‌పర్సన్‌ అయ్యారు. రాజకీయాలకు కొత్త అయిన జిల్లా పరిషత్ చైర్మన్ పగ్గాలు చేపట్టగానే , పంచాయతి రాజ్ కార్యకలాపాలు, పరిపాలన, చైర్ పర్సన్ గా తనకి ఉన్న అధికారాలు పై పూర్తిగా అధ్యయనం చేసి 24 మండలాలు, 900 గ్రామ పంచాయతీలు, 12 లక్షల మంది జనాభాతో ఉన్న విజయనగరం జిల్లా అంత పర్యటించి, గ్రామీణ ప్రజలు ఎదుర్కుంటున్న అనేక సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించే విధంగా అత్యంత వేగంగా అడుగులు వేశారు. తన పనితీరుకు మెచ్చి భారత ప్రభుత్వం విజయనగరం జిల్లాకు పంచాయత్ సశక్తికరణ్ పురస్కార్ అవార్డుని అందించడం గమనార్హం. పనితీరులో అత్యంత వేగం చూపిన స్వాతి రాణిని అప్పటి మంత్రి అయిన నారా లోకెష్ తన టీంలోకి ఆహ్వానించడం కొసమెరుపు. అలాగే టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఏర్పాటు చేసిన 15 మంది సభ్యులతో కూడిన టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో కమిటీలో చిన్నవయస్సులోనే శోభా స్వాతిరాణి కూడా చోటు దక్కించుకున్నారు.

జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పదవి సంపాదించి కేంద్ర ప్రభుత్వం దగ్గర సైతం మన్ననలు పొందిన స్వాతి రాణి, గడచిన సార్వత్రిక ఎన్నికల్లో అరకు పార్లమెంటు స్థానం కోసం గట్టి ప్రయత్నమే చేశారు. అయితే ఆ స్థానాన్ని చంద్రబాబు కిషోర్ చంద్ర డియోకి అప్పచెప్పడంతో ఆనాడే కొంత నిరుత్సాహ పడ్డారు. దీనికి తోడు జిల్లాలో కోళ్ళ లలిత కుమారితో కార్పొరేషన్ చైర్మన్ల నియామకంలో వర్గ విభేదాలు తలెత్తి అవి తీవ్ర స్థాయి దాటడం, అలాగే జిల్లాలో తెలుగుదేశం గడించిన ఎన్నికల్లో పూర్తిగా భూస్థాపితం అవ్వడంతో కోన్ని రోజులు పాటు రాజకీయాల్లో స్తబ్దుగా ఉంటు వచ్చారు స్వాతి రాణి.

అయితే విజయసాయిరెడ్డి సమక్షంలో వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టిలో చెరిన సందర్భంగా స్వాతి రాణీ మాట్లాడుతు ముఖ్యమంత్రి వై.యస్ జగన్ గిరిజనుల కోసం ప్రవేశపెడుతున్న పథకాలు, అలాగే మూడు జిల్లాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని రాజధాని ప్రకటించడం వంటి సంక్షేమ పాలన చూసి ఆకర్షితులై నేడు పార్టీలో చేరుతున్నట్టు సోమవారం ముఖ్యమంత్రి గారితో భేటి అవుతునట్టు, రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి జగన్ గారి అడుగు జాడల్లో నడిచి వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తాం అని చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా , అశొక్ గజపతి రాజు, సుజయ కృష్ణ రంగారావు లాంటి సీనియర్ తెలుగుదేశం నేతలు ఇప్పటికే క్రియాశీలకంగా తెలుగుదేశం కార్యక్రమల్లో పాల్గొనటంలేదు. ఈ సమయంలో లోకేష్ టీం గా ముద్ర పడ్డ స్వాతిరాణి లాంటి నేతలు తెలుగుదేశం పార్టీని వీడటం ఆ పార్టీకి జిల్లాలో కోలుకోలేని దెబ్బగానే చెప్పాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి