iDreamPost

బాబూ మజాకా..! పంచాయతీ ఎన్నికలకు మేనిఫెస్టో..! !

బాబూ  మజాకా..! పంచాయతీ ఎన్నికలకు మేనిఫెస్టో..! !

మేనిఫెస్టో.. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తామో తెలిపే రాజకీయ పార్టీల ప్రమాణ పత్రం. ఈ మేనిఫెస్టోకు తెలుగుదేశం పార్టీకి ప్రత్యేకమైన అనుబంధమే ఉంది. 2014లో అధికారంలోకి రావడానికి టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన దాదాపు 650 హామీలే ప్రధాన కారణం కాగా.. అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిలో ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో అమలు చేయని ఘనతను చంద్రబాబు పార్టీ సొంతం చేసుకుంది. అన్ని వైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో.. చివరికి తమ మేనిఫెస్టోను కనిపించకుండా.. అఫిషియల్‌ వెబ్‌సైట్‌ నుంచి టీడీపీ తొలగించాల్సిన పరిస్థితి నెలకొంది. అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం వైఎస్‌ జగన్‌.. ఈ విషయాన్ని పదే పదే తన ప్రజా సంకల్ప పాదయాత్ర సభల్లో చెబుతూ టీడీపీని ప్రజల ముందు దోషిగా నిలబెట్టారు. గడచిన ఎన్నికల్లో ప్రజలు టీడీపీకి తగిన గుణపాఠం చెప్పారు.. ఇది గడిచిపోయిన చరిత్ర.

మళ్లీ ఎన్నికలొచ్చాయి. ఇవి పంచాయతీ ఎన్నికలు. ఈ ఎన్నికలకు కూడా తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసింది. ‘పల్లె ప్రగతి – పంచ సూత్రాలు’ పేరిట ఐదు అంశాలతో కూడిన మేనిఫెస్టోను చంద్రబాబు కొద్ది సేపటి క్రితం విడుదల చేశారు. సురక్షితమైన తాగునీరు, భద్రత–ప్రశాంతతకు భరోసా, ఆదర్శగ్రామాలుగా తీర్చిదిద్దడం, స్వయం సమృద్ధి, ఆస్తిపన్ను తగ్గింపు–పౌరసేవలు.. అందిస్తామని తన పార్టీ మేనిఫెస్టోలో చంద్రబాబు పేర్కొన్నారు.

సాధారణ ఎన్నికలకు హామీలతో కూడిన మేనిఫెస్టోను అన్ని పార్టీలు విడుదల చేస్తాయి. ఇందులో పెద్ద ఆశ్చర్యం లేదు. కానీ రాజకీయ పార్టీలతో ప్రత్యక్ష ప్రమేయం లేకుండా జరిగే పంచాయతీ ఎన్నికలకు చంద్రబాబు మేనిఫెస్టో విడుదల చేయడమే విడ్డూరంగా ఉంది. మండల పరిషత్, జిల్లా పరిషత్‌ ఎన్నికలు రాజకీయ పార్టీల గుర్తులతో జరుగుతాయి. కానీ పంచాయతీ ఎన్నికలు మాత్రం స్వతంత్ర గుర్తులతో నిర్వహిస్తారు. రాజకీయ పార్టీలు అభ్యర్థులను మాత్రమే బలపరుస్తాయి. గ్రామ ప్రజల మధ్య రాజకీయపరమైన విభేదాలు లేకుండా, ఎన్నికల తర్వాత సమిష్టి అభిప్రాయంతో సమస్యల పరిష్కారం, అభివృద్ధి పనులు జరిగేందుకు వీలుగా ఈ ప్రక్రియను అమలు చేస్తున్న విషయం చంద్రబాబుకు తెలుసో..? లేదో..? గానీ పంచాయతీ ఎన్నికలకు మేనిఫెస్టోను విడుదల చేసి వార్తల్లో నిలిచారు. దేశంలోనే సీనియర్‌ రాజకీయ నాయకుడును అని చెప్పుకునే చంద్రబాబు.. మూడుసార్లు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేశారు. నాలుగు దశాబ్ధాలకు పైబడి రాజకీయాల్లో కొనసాగుతున్నారు. అనుకూల మీడియా చంద్రబాబును గొప్ప అడ్మినిస్ట్రేటర్‌గా ఫోకస్‌ చేసింది. అలాంటి చంద్రబాబు.. రాజకీయ పార్టీల గుర్తులతో జరగని ఎన్నికలకు.. తమ పార్టీ తరఫున మేనిఫెస్టోను విడుదల చేయడం విశేషం.

ఈ రోజు పంచాయతీ ఎన్నికలపై మీడియాతో మాట్లాడిన చంద్రబాబు.. ప్రజలు ఆలోచించి ఓటేయాలని పిలుపునిచ్చారు. అధికార పార్టీ డబ్బు దోచుకునేందుకు వస్తోందంటూ విమర్శించారు. పంచాయతీలకు నిధులు ఢిల్లీ నుంచి వస్తాయని, రాష్ట్ర ప్రభుత్వం కూడా తప్పకుండా ఇవ్వాల్సిందేనని చెప్పుకొచ్చారు. స్థానిక సమస్యలు పరిష్కరించుకునేలా.. ఎన్నికల్లో ఓటు వేయాలని, అందుకే మిమ్మల్ని చైతన్యవంతులను చేస్తున్నామని చెప్పుకొచ్చారు. సుదీర్ఘంగా ప్రసంగించిన చంద్రబాబు.. ఎక్కడా తమ పార్టీకి మద్ధతు తెలపాలనిగానీ, సైకిల్‌ గుర్తుకు ఓటేయాలని గానీ అడగలేదు. ఎన్నికలు మరో మూడు వారాల్లో ముగుస్తాయి. పంచాయతీలకు పాలకమండళ్లు ఏర్పడతాయి. ఆ తర్వాత.. చంద్రబాబు రిలీజ్‌ చేసిన టీడీపీ పంచాయతీ మేనిఫెస్టోను.. అమలు చేసే బాధ్యత ఎవరికి అప్పజెబుతారు..? బాబు చేతలకు.. మాటలకు పొంతన ఉండదనే నానుడి ఉంది. దాన్ని మరోమారు రుజువుచేసేలా.. తాజాగా విడుదల చేసిన పంచాయతీ మేనిఫెస్టో ఉంది. దీనిపై బాబు ప్రత్యర్థులు ఆయనకు ఎలాంటి చురకలు అంటిస్తారో చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి