iDreamPost

పెత్తందారీ న్యాయం..!

పెత్తందారీ న్యాయం..!

గ్రామాల్లో అనధికారికంగా పెత్తందారీ న్యాయం అనేదొకటి నడుస్తుంటుంది.. అదేంటంటే.. క్రిందిస్థాయి నుంచి కష్టపడి ఆర్ధికంగా, సామాజికంగా ఎదిగే వ్యక్తిని పెద్దలు / పెత్తందార్లు ఎంపిక చేసుకుంటారు. అతడి ఇంట్లో కథాకార్యం ఏదైనా వచ్చినప్పుడు అక్కడికి చేరుతారు. మీ ముత్తాత ఎంతో.. మీ తాత ఇలా.. మీ నాన్న ఇలా.. వాళ్ళని బట్టి చూస్తే ఇప్పుడొచ్చిన కార్యక్రమాన్ని నెవ్వెంతో గొప్పగా చేసి వాళ్ళ పేరు నిలబెట్టాలబ్బాయ్‌ అంటూ.. ఉబ్బేస్తారు.

గ్రామంలో పెద్దలంతా వచ్చి చెప్పిన మాటలకు ఉబ్బితబ్బిబ్బైపోయిన సదరు ఆసామి కష్టపడిందంతా ఖర్చు చేసి సదరు కథాకార్యాన్ని పూర్తిచేసేస్తాడు. ఆ తరువాత లెక్కలు చూసుకున్నాక దాచిపెట్టుకుంన్నదంతా ఖర్చైపోయిన విషయం గుర్తించి పైకి చెప్పుకోలేక, లోలోపలే లబోదిబోమంటాడు. మళ్ళీ బ్రతుకు నడిపించేందుకు సమాజానికి దూరంగా తన కష్టాన్నే నమ్ముకుంటాడు. ఎదుగుతున్న వాడ్ని తొక్కేయడమే.. ఈ పెత్తందారీ న్యాయం లక్ష్యమని ఇప్పటికే అర్ధమై ఉంటుంది.

ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న టీడీపీలో ఇది ఎప్పటినుంచో కొనసాగుతుందని చాలా మంది చెబుతుంటే విని ఊరుకున్నాంగానీ ఇది నిజమేనని ఇటీవలి కొన్ని పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. అప్పుడెప్పుడో దగ్గుబాటి వేంకటేశ్వరరావు నుంచి మొదలు పెడితే మొన్నీ మధ్యే మైకులముందుకొచ్చి ఊదరగొట్టే బొండా ఉమా, బుద్దా వెంకన్న తదితరుల వరకు ఒక్కో పేరుకు ‘పెత్తందారీ న్యాయం’ తరపున ఒక్కో కథ గుర్తురాక మానదు.

ఇప్పుడు తాజాగా కింజరపు ఎర్రన్నాయుడి కుమారుడు రామ్మోహననాయుడు పేరు కూడా ఈ జాబితాలో చేరే అవకాశాలు పుష్కలంగా కన్పిస్తున్నాయని విశ్లేషకుల మాట. ఈయనక్కూడా సదరు అర్హతలు అన్నీ ఉన్నట్లుగా తోస్తోంది. పెద్దబాబు తన పేరు పరిశీలిస్తున్నారని తెలిసిన వెంటనే సదరు బరువు బాధ్యతలన్ని వెంటనే నెత్తికెత్తేసుకుని ట్విట్టర్‌లో కత్తి దూసేయడం మొదలెట్టేసారు. మరి ఈయన కథ ఎలా సాగుతుందో.. ఎక్కడ వరకు చేరుకుంటుందో చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి