iDreamPost

చంద్రబాబును బహిష్కరిస్తున్నారు.. !

చంద్రబాబును బహిష్కరిస్తున్నారు.. !

తెలుగుదేశం తరఫున పరిషత్ ఎన్నికల్లో పోటీ చేస్తాం… ఇది కర్నూలు జిల్లా టిడిపి నేత భూమా అఖిలప్రియ మాట. ఎన్నికల్లో పోటీ చేయకుండా వెన్ను చూపడం వీరుడి లక్షణం కాదు అందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నా… గుడివాడ నియోజకవర్గం లోని నందివాడ మండలం టిడిపి జడ్పిటిసి అభ్యర్థి దాసరి మేరీ కుమారి ఆవేదన ఇది. తెలుగుదేశం తీసుకున్న పరిషత్ ఎన్నికల బహిష్కరణ ఆ పార్టీ ఉనికికె ప్రమాదకరంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.

చంద్రబాబు మండల పరిషత్ జిల్లా పరిషత్ ఎన్నికలను బహిష్కరించాలని తీసుకున్న నిర్ణయం ఆ పార్టీ నేతలను విస్మయానికి గురిచేస్తోంది. క్షేత్రస్థాయిలో టిడిపి తరఫున పోటీ చేయాలని భావించిన నేతలు ఒక్కొక్కరుగా పార్టీ నుంచి బయటకు వస్తున్నారు. గోదావరి జిల్లాలతోపాటు గుంటూరు జిల్లాల్లో భారీగా అధికార పార్టీ లోకి వలసలు ఊపందుకున్న అవకాశం కనిపిస్తోంది. ఎన్నికల బహిష్కరణకు చంద్రబాబు చెబుతున్న కారణాలు ఆ పార్టీ నేతలకే సహేతుకంగా అనిపించడం లేదు.

ఇటు రాయలసీమ లోను, అటు కోస్తా జిల్లాల్లోనూ పార్టీని విడిచి వెళ్లిపోవాలని ఎప్పటినుంచో భావిస్తున్న నేతలు బయటకు రావడానికి మంచి మార్గంగా ఈ సమయాన్ని వాడుకుంటున్నారు. దిగువ స్థాయి కార్యకర్తలు సైతం పార్టీని వీడి, బయటకు రావడమే ఉత్తమం అనే కోణంలో భారీగా ఇతర పార్టీల వైపు వెళుతున్నారు. ముఖ్యంగా వైఎస్సార్సీపీలోకి కార్యకర్తలు వెళ్లేందుకు సుముఖత చుపుతున్నారు.

తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు ఉండదు అనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ముఖ్యంగా పరిషత్ ఎన్నికలు బహిష్కరించడం అనేది చారిత్రాత్మక తప్పిదం గా టిడిపి అభిమానులు భావిస్తున్నారు. దీనివల్ల పార్టీ ప్రభావం కోల్పోతుంది అని చంద్రబాబే ఒప్పుకున్నట్లే ఉందని వారు ఆవేదన చెందుతున్నారు. మరోపక్క మొన్నటివరకు టిడిపి కి అనుకూలంగా వ్యవహరించిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల కమిషనర్ గా ఉన్నా రాని ఫలితాలు, ఇప్పుడు న్యాయ బద్దంగా అసలు రావు అనేది టీడీపీ బయట పెట్టుకున్నట్లు అయిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ముఖ్యంగా రాజకీయాల్లో పోటీ నుంచి వైదొలగడం అనేది సాధారణ కార్యకర్తలు ఎవ్వరూ ఇష్టపడరు. ఒక్కోసారి ఓటమి రావొచ్చు కానీ పోటీ నుంచి పూర్తిగా బయటకు రావడం అనేదాన్ని మాత్రం సహించారు. అయితే చంద్రబాబు తీసుకున్న నిర్ణయం పూర్తిగా తెలుగు తమ్ముళ్లకు రుచించడం లేదు. దీంతో పోటీలో ఉన్న తెలుగుదేశం అభ్యర్థులంతా ఎవరికి వారే తమ తమ ప్రచారం చేసుకునే దిశగా ఆలోచనలు చేస్తున్నారు. పార్టీ నిర్ణయాన్ని కాదని ఏకపక్షంగా నే ముందుకు వెళ్తున్నారు. దింతో టీడీపీ పూర్తిగా ఖాళీ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

ఓ వైపు పార్టీ నేతల నుంచి మరో పక్క కార్యకర్తల నుంచి ఎన్నికల బహిష్కరణ మీద వ్యతిరేకత తీవ్రంగా రావడంతో టీడీపీ అధిష్టానం కొత్త రాగం అందుకుంది. స్థానికంగా ఉన్న పరిస్థితులను బట్టి ఎక్కడైనా పోటీలో కొనసాగాలని టీడీపీ నేతలు భావిస్తే, దానికి పార్టీ అభ్యంతరం చెప్పకూడదని భావిస్తున్నట్లు సమాచారం. దీనిపై పార్టీ అధినేత చంద్రబాబు త్వరలోనే ఒక అధికారిక ప్రకటన చేసి, పార్టీ నాయకులను కార్యకర్తలను చల్లబరిచే ప్రయత్నానికి పూనుకోనున్నట్లు తెలుస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి