iDreamPost

వైసీపీకి మేలు చేస్తున్న టీడీపీ మాజీ ఎంపీ..!

వైసీపీకి మేలు చేస్తున్న టీడీపీ మాజీ ఎంపీ..!

ఇటీవల టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలు వైసీపీ ప్రభుత్వానికి పరోక్షంగా మేలు చేస్తున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ పథకాలపై టీడీపీ తాజా, మాజీ ప్రజాప్రతినిధులు విడుదల చేస్తున్న ప్రెస్‌ నోట్లు, మీడియా సమావేశాల్లో మాట్లాడుతున్న మాటలు.. ప్రభుత్వ పథకాలను ప్రచారం చేసేలా ఉన్నాయి. ప్రభుత్వ పథకాలు అమలు జరుగుతున్నాయని చెప్పడంతోపాటు, ఎంత మంది ఆ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారనేది కూడా టీడీపీ నేతలు తమ విమర్శల్లో చెబుతూ ప్రభుత్వానికి బాగా ప్రచారం చేస్తున్నారు.

తాజాగా టీడీపీ నేత, మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప వైఎస్సార్‌ నేతన్న హస్తం పథకంపై విమర్శలు చేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే వైఎస్సార్‌ నేతన్న హస్తం పథకం కింద మగ్గం ఉన్న ప్రతి నేత కార్మికుడుకు ఏడాదికి ఒకే సారి 24 వేల రూపాయల ఆర్థిక సహాయం చేస్తోంది. ఈ క్రమంలో రెండో దఫా ఆర్థిక సహాయం ఈ నెల 20 తేదీన లబ్ధిదారులు ఖాతాల్లో నేరుగా జమ చేసింది. 81 వేల మందికి దాదాపు 200 కోట్ల రూపాయలు అందించారు. కరోనా కష్టకాలంలో నేతన్నలను ఆదుకునేందుకు ఆరు నెలల ముందుగానే రెండో ఏడాదిలో పథకం అమలు చేస్తున్నట్లు సీఎం వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.

అయితే నిమ్మల కిష్టప్ప మాత్రం సీఎం వైఎస్‌ జగన్‌ చేనేతలకు తీరన ద్రోహం చేస్తున్నారని విమర్శించారు. వైఎస్సార్‌ నేతన్న హస్తం పథకం చేనేతదార్ల సంక్షేమానికి గొడ్డలిపెట్టుగా మారిందని పడికట్టు పదాలతో విమర్శలు చేశారు. రాష్ట్రంలో 3.50 లక్షల మంది చేనేతలు ఉంటే.. వైసీపీ ప్రభుత్వం కేవలం 81 వేల మందికే నేతన్న హస్తం పథకం అందించిందని విమర్శించారు. అర్హులైన వారందరికీ పథకం వర్తింపజేయాలని డిమాండ్‌ చేశారు.

అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వపథకాలు అందించే లక్ష్యంతో నేరుగా వాలంటర్లీ ద్వారా ప్రభుత్వం పథకాలు అందిస్తోంది. మధ్యలో ఎమ్మెల్యే నుంచి చోటా మోటా నేతల ప్రమేయం ఏ మాత్రం లేకుండా గ్రామ సచివాలయాల నుంచి వాలంటీర్లు పథకాలు అందిస్తున్నారు. మగ్గం ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ పథకం అందిస్తున్నారు. ఎవరైనా అర్హత ఉండి పథకం అందకపోతే మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని కూడా సీఎం జగన్‌ సూచిస్తున్నారు. అర్హత ఉండి పథకం రాలేదన్న మాట ఒక్కరి నుంచి కూడా వినిపించకూడదని ప్రతి పథకం విషయంలో స్పష్టం చేస్తున్నారు. నేతన్న హస్తం పథకంలో మగ్గం లేకపోతే మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ పథకం ఇవ్వడంలేదు.

నిమ్మల కిష్టప్ప క్షేత్రస్థాయి పరిస్థితులకు భిన్నంగా ఏదో విమర్శలు చేయాలి కాబట్టి చేస్తున్నట్లుగా ఉంది. ఓ పక్క ఈ పథకం చేనేతదార్ల సంక్షేమానికి గొడ్డలి పెట్టు అంటూనే.. 81 వేల మందికే ఇచ్చారనడం ఆయన తెలివికి నిదర్శనం. రజకులు, టైలర్లు, క్షరకులకు ఏడాదికి 10 వేల ఆర్థిక సహయం చేస్తూ ప్రభుత్వం ప్రారంభించిన జగనన్న తోడు పథకంపై కూడా ఇటీవల అచ్చెం నాయుడు ఇలాంటి విమర్శలే చేసి అబాసుపాలయ్యారు. అయితే ఆయా పథకాల ద్వారా ఎంత మంది లబ్ధి పొందుతున్నారనే విషయం చెబుతున్న టీడీపీ నేతలు వైసీపీకి మేలు చేస్తున్నారని ఖాయంగా చెప్పవచ్చు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి