iDreamPost

టీడీపీని ఆవహిస్తున్నఅసహనం

టీడీపీని ఆవహిస్తున్నఅసహనం

మొన్నామధ్య బాలకృష్ణ ఓ యువకుడి చెంప ఛెళ్లు మనిపిస్తే.. అది ఆయన నైజం అనుకున్నారు.. 

శాంతమూర్తి గా పేరొందిన అశోక్ గజపతి ఓ మహిళా కార్యకర్తను కొడితే.. ఆయన్ను బాలయ్య ఆవహించాడన్నారు.. తాజాగా జె.సి.ప్రభాకర్ రెడ్డి సొంత పార్టీ నేతపైనే దాడికి పాల్పడ్డారు…వరుసగా జరుగుతున్న ఘటనలను, సొంత పార్టీవారినే కొడుతున్న తీరు చూస్తుంటే.. టీడీపీ నేతలకు బాలయ్య ఆవహించడం కాదు. నిలువెల్లా అసహనం ఆవహించిందనిపిస్తోంది. యథా రాజా తథా ప్రజ.. అన్నట్లు పార్టీ అధినేత చంద్రబాబు లో ఇటీవలి కాలంలో ప్రజ్వరిల్లుతున్న ఫ్రాస్ట్రేషన్.. క్రమంగా పార్టీ క్యాడర్ నూ కమ్మేస్తోంది.

2019 ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం మొదలు.. వరుసగా తగులుతున్న షాక్ లు, జరుగుతున్న అవమానాలు అధినేత నుంచి కార్యకర్త వరకు తీవ్రంగా కుంగదీసి ఫ్రస్ట్రేషన్ లోకి నెట్టేస్తున్నాయి. చివరికి సొంత పార్టీ వారిపైనే చేయి చేసుకునే పరిస్థితి కల్పిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో ఎదురైన దారుణ పరాభవాన్ని ఇప్పటికీ చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారు.

Also Read : అశోక్ ను ఆవహించిన బాలయ్య !! మహిళా కార్యకర్తను కొట్టిన ఇజీనారం మారాజు..!

రాష్ట్రానికి ఎంతో చేసాను. ప్రపంచ స్థాయి నగరంగా అమరావతి నిర్మాణానికి శ్రీకారం చుట్టినా టీడీపీని ఎందుకు ఓడించారని.. చంద్రబాబు ఇప్పటికీ ప్రజలను నిలదీస్తుంటారు. ఆడిపోసుకుంటుంటారు. ప్రభుత్వం తీసుకొనే ప్రతి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. ప్రభుత్వం పై తిరగబడమని తరచూ పిలుపిస్తూ.. మీకు పౌరుషం లేదా, రోషం. రాదా.. అని రెచ్చగొడుతుంటారు.

స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఎస్ఈసీ వ్యవహార శైలి టీడీపీకి అనుకూలిస్తుందన్న ఆశతో మొదట్లో ఆయన్ను వెనకేసుకొచ్చిన చంద్రబాబు.. అది ఏమాత్రం కలిసి రాకపోవడంతో నిమ్మగడ్డను తిట్టడం మొదలు పెట్టారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలు సార్వత్రిక ఫలితాలనే పునరావృతం చేయడం, ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థులే దొరకని దయనీయ పరిస్థితులు ఆయన గారిలో అసహనాన్ని పెంచాయి.

మరో వైపు పార్టీ నేతలే ఆయన ఆదేశాలను ధిక్కరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. విజయవాడలో కేశినేని వివాదం దీనికి నిదర్శనం. విజయవాడకు తానే అధిష్టానం అన్నంతగా కేశినేని వ్యవహరించడం.. ఆయనకు వ్యతిరేకంగా బోండా ఉమ, బుద్దా వెంకన్న, నాగుల మీరా తదితరులు జట్టుకట్టి.. కేసినేనిని చెప్పుతో కొడతానని బుద్దా రెచ్చిపోవడమే కాకుండా.. ఎన్నికల ప్రచారంలో కేసినేనితో కలిసి పాల్గొంటే.. తామంతా పర్యటనను బహిష్కరిస్తామని ఏకంగా అధినేతకు అల్టిమేటం ఇచ్చేవరకు వెళ్లారు.

Also Read : అధికారములో ప్రవచనాలు , విపక్ష పాత్రలో పరుష పదజాలం ఇదీ బాబు తీరు ..

రౌడీయిజం నా దగ్గర చెల్లదని మాటిమాటికి గద్దించే చంద్రబాబు.. తన పార్టీలోని మాటల రౌడీలనే అదుపులో పెట్టలేకపోతున్నారు. ఇవన్నీ బాబు గారిలో సహనాన్ని నశింపజేసి.. పొంతన లేని ఆరోపణలు, వ్యాఖ్యలు చేయిస్తున్నాయి. అంతిమంగా కిందిస్థాయి నాయకులపై ప్రభావం చూపుతున్నాయి. అవే సొంత పార్టీ వారిపైనే రెచ్చిపోయే పరిస్థితి కల్పిస్తున్నాయి.

హిందూపురంలో బాలకృష్ణ టీడీపీ అభ్యర్థి సోదరుడినే కొట్టడం, ఎప్పుడూ ప్రశాంతంగా కనిపించే అశోక్ గజపతి రాజు ఫూలు చల్లిన పాపానికి మహిళా కార్యకర్తనే కొట్టడం, పోలీసులతో గొడవ పెరగకుండా నచ్చజెప్పాడానికి ప్రయత్నించిన చోటా నేతపై  తాడిపత్రిలో  జె సీ ప్రభాకర్ రెడ్డి దాడి చేసి చెంపలు వాయించేయడం.. ఆ పార్టీలోనే అంతర్మథనానికి తావిచ్చాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి