iDreamPost

చీవాట్లు తప్పేలా లేవు తమ్ముడు..!

చీవాట్లు తప్పేలా లేవు తమ్ముడు..!

సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీ నేతలు.. ప్రజల నుంచి చీవాట్లు తింటావేమోనన్న భయంతో ఉంటారు. కానీ ఏపీలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నేతలు ప్రజల చేత చీవాట్లు తింటావేమోనన్న ఆందోళనతో ప్రస్తుతం ఉన్నారు. దీనికి ప్రధాన కారణం ఇళ్ల స్థలాల పంపిణీ వ్యవహారం. వచ్చే నెల 25వ తేదీన రాష్ట్రంలో కోర్టు సేలు ఉన్న భూములు మినహా మిగతా ప్రాంతాలలో ఇళ్ల పట్టాల పంపిణీ చేసేందుకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నిర్ణయించారు.

ఇదే ఇప్పుడు టీడీపీ నేతలకు ఆందోళన కలిగిస్తోంది. కోర్టు స్టేలు ఉన్నవి మినహా.. అని సీఎం జగన్‌ స్పష్టంగా చెప్పారు. అంటే ఆయా ప్రాంతాలలోని పేదలకు ఇళ్ల పట్టాలు డిసెంబర్‌ 25వ తేదీన అందవు. అప్పుడు దీనికి కారణం ఎవరనేది లబ్ధిదారులు ఆలోచిస్తారు. అధికార పార్టీ నేతలు ఎలాగూ చెబుతారు. పరికించి చూస్తే.. తమకు ఇళ్ల స్థలాలు రాకుండా కోర్టుల్లో పిటిషన్లు వేసింది టీడీపీ నేతలని లబ్ధిదారులకు తెలుస్తుంది. ఇతర ప్రాంతాలలోని లబ్ధిదారులు పట్టాలు అందుకున్న మరుక్షణమే.. కోర్టు స్టేలు ఉన్న ప్రాంతాలలోని వారు తెలుగుదేశం పార్టీని, ఆ పార్టీ స్థానిక నాయకులను చీల్చి చెండాడేందుకు తమ నోటికి పని చెప్పడం ఖాయం. ఈ పరిస్థితి ఆలోచించే స్థానిక టీడీపీ నేతలు వణికిపోతున్నారు. మొదులే అరకొరగా ఉన్న తమ పరిస్థితి ఈ వ్యవహారంతో పూర్తిగా చెడిపోతుందని భయపడుతున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ గ్రామాల్లో ఒకటిన్నర సెంటు, పట్టణాల్లో సెంటు చొప్పున ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. చివరి అర్హుడి వరకూ దరఖాస్తులు స్వీకరించింది. దాదాపు 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వబోతున్నారు. ఇందు కోసం 60 వేల ఎకరాలు సేకరించారు. ఇందులో రెండు వేల ఎకరాలపై కోర్టు స్టేలు ఉన్నాయి. అంటే.. దాదాపు 1.50 లక్షల మందికి డిసెంబర్‌ 25వ తేదీన పట్టాలు అందవు. కోర్టు స్టేలు తొలగిపోయే వరకూ వారు ఎదురుచూడాల్సిందే.

వాస్తవంగా… ఈ ఏడాది ఉగాదికే ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. టీడీపీ కోర్టులకు వెళ్లింది. ఆ తర్వాత శ్రీరామనవమికి ఇవ్వాలని తలపెడితే కోర్టు వివాదాలు పరిష్కారం కాలేదు. జూలై 8న వైఎస్సార్‌ జయంతి నాటికి వివాదాలు పరిష్కారం అవుతాయని తేదీ ప్రకటించారు. కానీ మళ్లీ కోర్టులకు వెళ్లారు. ఆగస్టు 15న స్వాతంత్రం దినోత్సవం రోజున ఇవ్వాలని తలపెట్టినా.. తెలుగుదేశం పార్టీ తమ కార్యకర్తలతో కోర్టుల్లో పిటిషన్లు వేయించింది.

ఈ గ్యాప్‌లో టిడ్కో ఇళ్లు, ఇళ్ల స్థలాల కేటాయింపులో ఆలస్యాన్ని తమ రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకునేందుకు టీడీపీ ప్రయత్నించింది. అందుకే అసలు వాస్తవం చెప్పి ఇళ్లు, ఇళ్ల పట్టాలు ఇవ్వాలని సీఎం జగన్‌ నిర్ణయించారు. ఇందులో భాగంగా లబ్ధిదారులుగా ఎంపికైన వారి ఇళ్లకు వలంటీర్లను పంపాలని నిర్ణయించారు. ఇళ్ల స్థలాల పంపిణీని అడ్డుకోవడం ద్వారా.. చంద్రబాబు తీసిన గోతిలో తామే పడ్డామని తమ్ముళ్లు ఇప్పుడు బాధపడుతున్నారు.

Read Also : తిరుపతి వైసీపీ ఎంపీ అభ్యర్థి ఖరారు..?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి