iDreamPost

మాకొద్దు బాబోయ్‌ గన్నవరం

మాకొద్దు బాబోయ్‌ గన్నవరం

మూడు వారాల కిందట ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని గుంటూరు వెస్ట్‌ టీడీపీ ఎమ్మెల్యే మద్దాలి గిరి కలవగానే.. తెల్లారిసరికే ఆ నియోజకవర్గానికి కొత్త ఇంచార్జిని ప్రకటించారు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు. అయితే రెండు నెలల కిందటే టీడీపీకి రాజీనామా చేసి ప్రభుత్వ అనుకూలంగా వ్యవహరిస్తున్న వల్లభనేని వంశీ నియోజకవర్గం గన్నవరంలో మాత్రం ఇప్పటికీ కొత్త ఇంచార్జి నియామకం జరగలేదు. దీనికి కారణం ఆ బాధ్యతలు తీసుకోవడానికి ఎవరూ ముందుకు రాకపోవడమేనని తెలుస్తోంది. వల్లభనేని వంశీ వెంటే ఉంటామని నియోజకవర్గంలోని మెజారిటీ కార్యకర్తలు, మండల నాయకులు తేల్చి చెప్పడంతో అక్కడ టీడీపీ పరిస్థితి చుక్కానిలేని నావలా తయారైంది. అక్కడక్కడా ఉన్న కార్యకర్తలకు నాయకత్వ లేమి వెంటాడుతోంది.

మొదట్లో గన్నవరం టీడీపీ ఇంచార్జిగా పలువురి పేర్లు తెరపైకి వచ్చాయి. గతంలో ఈ నియోజకవర్గం నుంచి స్వతంత్య్ర అభ్యర్థిగా విజయం సాధించిన గద్దె రామ్మోహన్‌రావును మొదట పార్టీ అధినేత సంప్రదించారు. ప్రస్తుతం గద్దె విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఆయనకు గన్నవరంలో అనుచర వర్గం ఉంది. ఆ నేపథ్యంలోనే ఆయన భార్య గద్దె అనురాధకు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించాలని చూశారు. అయితే ఆమె ససేమిరా అన్నట్లు సమాచారం. తాము ప్రస్తుతం విజయవాడ రాజకీయాల్లో కొనసాగుతున్నామని, మళ్లీ గన్నవరం వెళ్లి పనిచేయడానికి సమయం సరిపోదంటూ చంద్రబాబు ప్రతిపాదనను తోచిపుచ్చారు.

అలాగే నియోజకవర్గంలో పలు సేవాకార్యక్రమాలు చేస్తున్న పుట్టగుంట సతీష్‌ అనే వ్యక్తిని కూడా చంద్రబాబు సంప్రదించారట. డైరెక్ట్‌గా ఫోన్‌ చేసి మరీ నియోజకవర్గ బాధ్యతలు ఆఫర్‌ చేశారట. అయితే ఆయన కూడా తిరస్కరించారు. తనకు రాజకీయాలపై పెద్దగా ఆసక్తి లేదని చెప్పారు. ఈ పరిస్థితుల్లో త్వరలో జరగనున్న పంచాయతీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పార్టీ భవిష్యత్తు ఏంటి అన్న దానిపై నియోజకవర్గంలో ఆసక్తికర చర్చ మొదలయ్యింది. గ్రామస్థాయిలో అక్కడక్కడా బలమైన నాయకులు ఉన్నా.. వారిదెవరిదీ నియోజకవర్గ స్థాయి కాకపోవడంతో టీడీపీ ఎదురీదుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి