iDreamPost

పుట్టిన‌రోజున చంద్ర‌బాబును ఇబ్బంది పెట్టిన బుద్దా

పుట్టిన‌రోజున చంద్ర‌బాబును ఇబ్బంది పెట్టిన బుద్దా

ఈ రోజు (ఏప్రిల్ 20) తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడి పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా చంద్రబాబుకు ఏపీ సీఎం జగన్ మోహ‌న్ రెడ్డి స‌హా సినీ, రాజ‌కీయ‌, ఇత‌ర రంగాల ప్ర‌ముఖులెంద‌రో జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు. విష్ యూ హ్యాపీ బర్త్ డే చంద్రబాబు గారూ అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు. ‘శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు… వారు కలకాలం సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని, అలా ఆశీర్వదించమని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను’ అంటూ మెగాస్టార్ చిరంజీవి కూడా ట్వీట్ చేశారు.

మ‌రోవైపు టీడీపీ శ్రేణులు కూడా ప‌లుచోట్ల బాబు పుట్టిన‌రోజు వేడుక‌లు నిర్వ‌హించారు. అలాగే.. 73వ పుట్టిన రోజు సందర్భంగా ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను చంద్రబాబు దర్శించుకున్నారు. అనంతరం టీడీపీ అధినేత మీడియాతో మాట్లాడుతూ… ప్రజల పక్షాన పోరాడేందుకు తనకు శక్తి సామర్ధ్యాలు ఇవ్వాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. ప్రజల ఇబ్బందులు తొలగించాలని వేడుకున్నానన్నారు. తెలుగు జాతికి పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు. తప్పకుండా జయం సాధిస్తానని నమ్మకం ఉందన్నారు. రాజీలేని పోరాటంతో ప్రజలకు అండగా నిలబడతానని బాబు తెలిపారు. అభిమానులకున్న అంచనాల ప్రకారం ముందుకెళ్తానని అన్నారు.

ఇలా శుభాకాంక్ష‌లు.. విజ‌యంపై ఆశ‌లు దిశ‌గా పుట్టిన‌రోజు పూట బాబు ఉత్సాహంగా గ‌డుపుతుంటే.. టీడీపీ సీనియ‌ర్ నేత బుద్దా వెంక‌న్న బాంబు పేల్చారు. టీడీపీలో వంద మందితో సూసైడ్ బ్యాచ్‌ సిద్ధం చేసుకున్నామని, అనవసరంగా నోరు పారేసుకుంటే చంపడానికైనా.. చావడానికైనా సిద్దమని ప్ర‌క‌టించారు. చంద్రబాబును తిడితే, టీడీపీ ఆఫీస్‌పై దాడి చేస్తే పదవులు వస్తాయనుకుంటున్నారని బుద్దా వెంకన్న ఎద్దేవా చేశారు. ఎవరైనా సరే నోరు అదుపులో పెట్టుకోకపోతే తీవ్ర పరిణామాలు చవిచూడాల్సి వస్తుందంటూ క‌ల‌క‌లం సృష్టించారు. బాబు పుట్టిన‌రోజున చ‌స్తాం.. చంపుతాం.. అంటూ బుద్దా చేసిన వ్యాఖ్య‌ల‌పై సోష‌ల్ మీడియాలో విప‌రీత‌మైన కామెంట్లు వైర‌ల్ అవుతున్నాయి. పార్టీ వ‌ర్గాల్లో కూడా బుద్దా వ్యాఖ్య‌లు క‌ల్లోలం రేపుతున్నాయి. దీనిపై చంద్ర‌బాబు కూడా అసంతృప్తికి లోనైన‌ట్లు తెలిసింది. బుద్దా స్టేట్ మెంట్ పై విమ‌ర్శ‌లు వ్య‌క్తం అవుతున్న నేప‌థ్యంలో బాబు మ‌న‌స్తాపానికి గురైన‌ట్లు తెలిసింది. ప్ర‌జ‌ల్లోకి వెళ్లేందుకు సిద్ధ‌మ‌వుతున్న త‌రుణంలో ఈ త‌ర‌హా వ్యాఖ్య‌లు వ‌ద్ద‌ని పార్టీ శ్రేణుల‌కు సూచించిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి