iDreamPost

కదులుతున్న టీడీపీ పునాదులు

కదులుతున్న టీడీపీ పునాదులు

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పేదల ఇళ్లకు పునాదులు పడుతుంటే.. తెలుగుదేశం పార్టీ పునాదులు కదిలిపోతున్నాయి. 38 ఏళ్ల పార్టీ చరిత్రలో ఎన్నడూ లేనంత కుదుపు ఇప్పుడు ప్రారంభమైంది. దశబ్దాల తరబడి సాగుతున్న కాంగ్రెస్‌ పాలనకు బ్రేక్‌ వేసిన ప్రాంతీయ పార్టీగా నందమూరి తారకరామరావు హయాంలో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన టీడీపీ భవిష్యత్‌ ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. 2019 ఎన్నికల్లో ఊహించని విధంగా కేవలం 23 సీట్లకే పరిమితం అయిన ఆ పార్టీకి అప్పటి నుంచే గడ్డుకాలం మొదలైంది.

జగన్మోహన్‌రెడ్డి మూడు రాజధానుల ప్రకటన అనంతరం టీడీపీ మరింత ఇరకాటంలో పడింది. ఇక అప్పటి నుంచి ఆ పార్టీ అధినేత చంద్రబాబు కష్టాలు కూడా మరింత పెరిగాయి. అమరావతి ఉద్యమంతో పేరుతో జూమ్‌ మీటింగ్‌లు, ప్రజాభిప్రాయ సేకరణలు, రిఫరెండెం సవాళ్లు ఎన్ని మార్గాలు ఎంచుకున్నా ఆశించిన స్థాయిలో ఊపు రాలేదు. సరికదా.. సొంత ఎమ్మెల్యేలు సైతం జారుకున్నారు. ఉత్తరాంధ్రలో అయితే దాదాపు తుడుచుకుపెట్టుకుపోయే పరిస్థితి. బలంగా ఉందనుకున్న విజయనగరం జిల్లాలో కూడా నేతల మధ్య అంతర్గత కుమ్ములాటలతో కేడర్‌ అయోమయంలో పడింది. ఫలితంగా పార్టీ కోటకు బీటలు వారుతున్నాయి. చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడినా.. ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్వయంగా వెళ్లి మాట్లాడినా అక్కడి పరిస్థితిలో మార్పు కనిపించడం లేదు.

ఇటు సంక్షేమం.. అటు క్షామం..

ప్రస్తుతం ఏపీలో సంక్షేమం మరింత ఊపందుకుంది. ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమంతో ఎక్కడ చూసినా కోలాహలమే కనిపిస్తోంది. మూడు రోజులుగా ఆ కార్యక్రమం నిరాటంకంగా కొనసాగుతోంది. 15 రోజుల పాటు పండగలా నిర్వహిస్తామని తొలిరోజే సీఎం జగన్‌ ప్రకటించారు. ఆ మేరకు పార్టీ ఎమ్మెల్యేలు అందరూ ఆ కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు. వీలైనంతర త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా లబ్దిదారులు అందరికీ పట్టాలు అందజేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో సోమవారం జరిగిన పట్టాల పంపిణీ కార్యక్రమంలో సీఎం జగన్‌ పాల్గొన్నారు. మూడు రోజుల క్రితం తూర్పుగోదావరి జిల్లా కొమరగిరిలో జరిగిన కార్యక్రమంలో కూడా జగన్‌ పాల్గొన్నారు. ఆ రెండు చోట్లా ప్రజల్లో వచ్చిన స్పందన అపూర్వమైనది. ఇప్పటికే ఎన్నో సంక్షేమ పథకాలతో దేశంలోనే ముందు వరుసలో నిలిచిన జగన్‌ ఇప్పుడు నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంతో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. ఇవన్నీ తెలుగుదేశం పార్టీలో కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే అంతంత మాత్రమే ఉన్న పార్టీ పరిస్థితి ఇళ్ల స్థలాల కార్యక్రమం ప్రారంభంతో గందరగోళంలో పడింది. ఇప్పటి వరకూ పేదలకు ఇళ్లు అందకపోవడానికి టీడీపీయే కారణమని విపరీతంగా ప్రచారం జరుగుతోంది. అది కూడా పార్టీకి నష్టం కలిగించింది. ఇలా ఏ రకంగా చూసినా ఏపీలో టీడీపీ గ్రాఫ్‌ పడిపోతుండడం చంద్రబాబు సహా నేతలందరికీ ‘‘క్షామ’కరంగా మారింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి