iDreamPost

తిరుప‌తిలో టీడీపీ ఇక ఇర‌గ‌దీస్తుందట‌..!

తిరుప‌తిలో టీడీపీ ఇక ఇర‌గ‌దీస్తుందట‌..!

పోటీ చేయాలా.. వ‌ద్దా.. అనే మీమాంస నుంచి.. చేయ‌క‌పోతే ఉన్న ప‌రువు కాస్తా గోవిందా.. అని ఆలోచించి చివ‌ర‌కు రంగంలోకి దిగుతున్న తెలుగుదేశం ఇక ఇర‌గ‌దీసేస్తుందట‌. త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే తిరుప‌తి లోక్ సభ ఉప ఎన్నికల్లో దుమ్ము రేపుతుంద‌ట‌. ఇక్క‌డ వ‌చ్చిన చిక్క‌ల్లా అక్క‌డ ప్ర‌చారానికి తాము రాలేమ‌ని, వ‌చ్చినా ఉప‌యోగం లేద‌ని కొంత మంది టీడీపీ సీనియ‌ర్లు వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం. తిరుప‌తిలో టీడీపీ ప్రచారం మొద‌లుపెడుతుంద‌ని ఆ పార్టీ నేత‌లు చెబుతున్నారు. దీనిలో భాగంగానే ఈనెల 17వ తేదీన తిరుపతిలో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. అంటే లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు తిరుపతిలో ఏర్పాటు చేయబోయే కార్యాలయం సెంట్రల్ ఆఫీసులాగ ఉండబోతోంది. ఇక్కడి నుండి మొత్తం ఎన్నికల వ్యవహారాలను పర్యవేక్షించబోతున్నారు నేతలు. ఎలాగైనా లోక్ సభ స్ధానాన్ని గెలవాలన్న టార్గెట్ పెట్టుకుని నేతలకు పని విభజన చేశారు. గ్రామస్ధాయి నుంచి నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ వరకు వివిధ స్ధాయిలో పార్టీ కమిటీలను వేయాలని డిసైడ్ చేశారు. తిరుపతి లోక్ సభ పరిధిలోని నేతలతో చంద్రబాబునాయుడు మాట్లాడుతూ మొత్తం 70 క్లస్టర్లను ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. అలాగే 9 10 11 తేదీల్లో పార్టీ నేతలంతా సమావేశమై నియోజక వ‌ర్గాల స్ధాయి కమిటీలను నియమించుకోవాలని చెప్పారు.

ఇర‌గ‌దీసే స‌మ‌యంలో అంద‌రిలోనూ అదే టెన్ష‌న్

నిజానికి అంతకుముందే లోక్ సభ నియోజకవర్గ సమన్వయకమిటి ఛైర్మన్ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కమిటి సభ్యులు సమావేశమయ్యారు. గ్రామస్ధాయి నుండి నియోజకవర్గ స్దాయి వరకు కమిటీల ఏర్పాటుపై చర్చించారు. తర్వాత చంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో సోమిరెడ్డి తమ సమావేశం వివరాలను చెప్పారు. 17వ తేదీన తిరుపతిలో ఏర్పాటుచేయబోయే పార్టీ కార్యాలయాన్ని రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఇదంతా బాగానే ఉంది ఆ త‌ర్వాత రోజునే నాకు పాజిటివ్ వ‌చ్చింద‌ని ప్ర‌క‌టించారు. ఆయ‌న ప్ర‌క‌ట‌న‌తో అంద‌రిలోనూ టెన్ష‌న్ మొద‌లైంది. మూడు రోజుల క్రితం జరిగిన పోలిట్ బ్యూరో సమావేశానికి టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటూ ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మిగిలిన సభ్యులు హాజరయ్యారు. అంతేకాదు అదే రోజు తిరుపతి ఉప ఎన్నికపైనా ముఖ్య నేతలతో చర్చించారు. ఈ భేటీకి కూడా సోమిరెడ్డి వెళ్లారు. దీంతో టీడీపీ నేతల్లో కూడా టెన్షన్ మొదలైంది. అయితే తాను మాత్రం ఆరోగ్యంగానే ఉన్నాని చెప్పడం కాస్త ఊరట కలిగించే విషయం. కాకపోతే టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటూ సీనియర్ నేతలు ఉండటం టెన్షన్ పెట్టిస్తోంది.

అభ్య‌ర్థిలో కాన‌రాని జోష్..

తిరుప‌తిలో ఇర‌గ‌దీసేందుకు ఆ పార్టీ నేత‌లంద‌రూ సిద్ధ‌మ‌వుతుంటే… అభ్యర్ధి పనబాక లక్ష్మి మాత్రం ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. ప్ర‌చారం ప్రారంభించ‌డం లేదు. ఆమెలో తాను టీడీపీ అభ్య‌ర్థిన‌నే జోష్ క‌నిపించ‌డం లేద‌ని ఆ పార్టీ వ‌ర్గాల్లోనే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. దీనికితోడు గమనించాల్సిన మ‌రో విషయం ఏమిటంటే తాను కానీ నారా లోకేష్ కానీ ఎప్పటి నుండి ప్రచారంలోకి దిగేది చంద్రబాబు చెప్పలేదు. అలాగే అభ్యర్ధి పనబాక లక్ష్మి ప్రచారం మొదలుపెట్టే విషయంపైన కూడా క్లారిటీ ఇవ్వలేదు. కుమార్తె వివాహ కార్య‌క్ర‌మాల్లో ప్ర‌స్తుతం ఆమె బిజీగా ఉన్నార‌ని కొంద‌రు నేత‌లు చెబుతున్నారు. కాగా, అభ్యర్ధి ప్రచారంలోకి దిగకుండా తాము రంగంలోకి దిగటం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదని చాలా మంది సీనియర్ నేతలు దూరంగా ఉండిపోయారు. మరి పార్టీ నేతలకు ఈ విషయంలో చంద్రబాబు ఎందుకని క్లారిటీ ఇవ్వలేదో అర్ధం కావటం లేదు. ఏ అంశం పైనా క్లారిటీ లేకుండా మ‌రి ఎలా ఇర‌గ‌దీస్తారో ఆ పార్టీ నాయ‌కుల‌కే తెలియాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి