iDreamPost

బాబుకు వెళ్లక తప్పడం లేదు..!

బాబుకు వెళ్లక తప్పడం లేదు..!

పంచాయతీ ఎన్నికల ఫలితాల ప్రభావం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడపై బాగా పడినట్లుగా ఉంది. 40 శాతం స్థానాలు గెలిచామని పైకి చెబుతున్నా.. అందులో వాస్తవం ఏమిటన్నది బాబుకు బాగనే ఎరుకుంది. ముఖ్యంగా తన సొంత నియోజకవర్గమై కుప్పంలో వెల్లడైన పంచాయతీ ఎన్నికల ఫలితాలు బాబుకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నారు. 89 పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా.. వైసీపీ అభ్యర్థులు 75 స్థానాల్లో విజయదుందుభిమోగించడంతో చంద్రబాబులో వణుకు మొదలైంది. నష్టనివారణ చేపట్టేందుకు, ప్రజలను ప్రసన్నం చేసుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 25, 26, 27 తేదీల్లో కుప్పం టూర్‌కు రెడీ అయ్యారు. మూడు రోజుల పర్యటనలో చంద్రబాబు.. పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలతో మమేకం అవబోతున్నారు.

పంచాయతీ ఎన్నికల ఫలితాలు ముగిసిన వెంటనే చంద్రబాబు ఈ తరహా పర్యటనకు సిద్ధమవడం విశేషం. కుప్పంలోని పంచాయతీ ఫలితాలపై.. తనదైన శైలిలో చంద్రబాబు విమర్శలు చేశారు. వైసీపీ నేతలు అక్రమాలకు పాల్పడ్డారని, ఓటర్లను బెదిరించారని, 20 కోట్ల రూపాయలు పంచారని ఆరోపణలు గుప్పించారు. కుప్పంలో ప్రజా స్వామ్యం ఖూనీ అయిందన్నారు. టీడీపీ ఓటమిని ఒప్పుకోవడం ఇష్టంలేని చంద్రబాబు.. ఈ తరహా ఆరోపణలు, విమర్శలు చేసి.. ఇప్పుడు మూడు రోజుల పర్యటనకు వెళుతూ పరోక్షంగా ఓటమిని ఒప్పుకున్నారు.

పార్టీ గుర్తులపై జరగని పంచాయతీ ఎన్నికల ఫలితాలపై తనకున్న మీడియా బలంతో ఎలాగోలా మేనేజ్‌ చేసిన చంద్రబాబుకు రాబోయే మున్సిపల్‌ ఎన్నికల్లో అసలైన పరీక్ష ఎదురుకాబోతోంది. పార్టీ గుర్తులపై మున్సిపల్‌ ఎన్నికలు జరగబోతున్న తరుణంలో.. కాకి లెక్కలు చెప్పే అవకాశం ఎవరికీ ఉండదు. ఏ పార్టీ తరఫున ఎంత మంది కౌన్సిలర్లు, కార్పొరేటర్లు గెలిచారన్నది పక్కాగా రిటర్నింగ్‌ అధికారులు వెల్లడిస్తారు. ఎన్నికల కమిషన్‌ తన వెబ్‌సైట్‌లో పొందుపరుస్తుంది. అందుకే పంచాయతీ ఎన్నికల్లో పార్టీ కార్యాలయంలో పర్యవేక్షణకే పరిమితమైన చంద్రబాబు.. మున్సిపల్‌ ఎన్నికలకు మాత్రం ప్రజల్లోకి రావాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 1వ తేదీ నుంచి మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించాలని యోచిస్తున్నారు.

వచ్చే నెల 10వ తేదీన మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ జరగబోతోంది. 12 కార్పొరేషన్లు, 75 మున్సిపల్, నగర పంచాయతీలకు పోలింగ్‌ నిర్వహించేందుకు అనుగుణంగా ఇప్పటికే ఎన్నికల కమిషన్‌ షెడ్యూల్‌ జారీ చేసింది. 14వ తేదీన లెక్కింపు చేపట్టనుంది. పంచాయతీ ఫలితాలతో ఓటర్లు తమ పార్టీ పట్ల ఎలా ఉన్నారో వైసీపీ నేతలకు స్పష్టంగా తెలియడంతో.. మున్సిపల్‌ ఎన్నికల్లో రెట్టించిన ఉత్సాహంతో ప్రచారం చేస్తున్నారు. అదే సమయంలో టీడీపీ నేతలు తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు. కనీసం మున్సిపల్‌ ఎన్నికలలోనైనా చెప్పుకోదగ్గ స్థానాలను గెల్చుకుని పరువు నిలుపుకోవాలనే లక్ష్యంతో టీడీపీ అధినేత ఉన్నారు. పోలింగ్‌కు రెండు రోజుల ముందే ప్రచారం ముగుస్తుంది. అంటే వచ్చే నెల 1వ తేదీ నుంచి 8వ తేదీ వరకూ చంద్రబాబు రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో సుడిగాలి పర్యటన చేయబోతున్నారు. మరి చంద్రబాబు జాగ్రత్త ఏ మేరకు ఫలితాన్ని ఇస్తుందో మార్చి 14వ తేదీన తేలిపోతుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి