iDreamPost

ఈ యావే కదయ్యా కొంపముంచింది.. అయినా గానీ..?

ఈ యావే కదయ్యా కొంపముంచింది.. అయినా గానీ..?

ప్రచారం.. ఈ పదం తెలుగుదేశం పార్టీకి గానీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబుకుగానీ నచ్చినంతగా మరెవరికీ నచ్చదంటే అతిశయోక్తి కాదేమోననిపిస్తుంది. చేసినదానికి, చెయ్యనిదానికీ, తరువాత అధికారంలోకొచ్చి వాళ్ళు చేసిన దానికి కూడా తానే ప్రచారం చేసుకోవడంలో చంద్రబాబు, ఆయన పార్టీని మించినవారు లేరని ప్రత్యర్ధులు కూడా ఘాటు విమర్శలే చేస్తుంటారు. అయితే వీటినే మాత్రం పట్టించుకోకుండా తన ప్రచారమేమో తాను చేసుకుంటూ పోతుంటారు నారా వారు.

మొట్టమొదటి సారి సీయం అయినప్పుడు ఇదేదో కొత్తగా అన్పించి, జనాలు ఆసక్తిగా చూస్తుండేవారు. రాన్రాను దీంట్లో ఎంత పస ఉందో వారిక్కూడా అర్ధమైపోయింది. దీంతో పెద్దగా పట్టించుకోవడం మానేసినట్లు పలు సర్వేలు కూడా స్పష్టం చేస్తున్నాయి. అయినప్పటికీ మొదట్లో ఏ విధంగా ప్రచారం కోసం ప్రాకులాడేవారో అదే పాకులాట ఇప్పటిక్కూడాచంద్రబాబును ఆయన బృందాన్ని వదలడం లేదన్న విమర్శలు చెలరేగిపోతున్నాయి. ఒకప్పుడు పత్రిక, టీవీల ద్వారా మాత్రమే ఈ ప్రచారం కొనసాగేది. కానీ ఇప్పుడు సోషల్‌ మీడియా యుగంలో ట్విట్టర్, ఫేస్భుక్, వాట్సాప్‌.. అంటూ భిన్నమైన సాధనాలు అందుబాటులోకొచ్చేసాయి. అయితే ఇక్కడ వాటిల్లో వచ్చింది నిజమే కాదో, సదరు ఫోటో, వార్తను పెట్టిన వారు ఎంత వరకు విశ్వసించదగినవారో కన్ఫర్మ్‌ చేసుకోవడమే ఆలస్యమవుతోంది.

ఇక చంద్రబాబు విషయం దగ్గరకొస్తే సెల్‌ఫోన్‌ విప్లవానికి తానే ఆధ్యుడునని చెప్పుకునే ఈయన, అందులో వచ్చే విషయాలను గురించి మాత్రం పెద్దగా దృష్టిపెట్టినట్టుగా లేరంటున్నారు విమర్శకులు. ట్విట్టర్, జూమ్‌ అంటూ లేటెస్ట్‌ విధానాలను వాడుకుంటున్న ఆయన, వాటి ద్వారా వచ్చే ప్రచారంపైనే ఎక్కువగా మోజుపడుతున్నట్లుగా కన్పిస్తోంది. అదే సమయంలో తానే స్వయంగా పోస్టు చేస్తున్న విషయాలు ఎంత వరకు నిజం అన్నది కూడా ఖరారు చేసుకోకుండా చేస్తున్న ప్రయత్నాలు చివరకు ఆయన్నే నవ్వుల పాల్జేస్తున్నాయి. ఒక వేళ తాను చేసింది పొరపాటేనని గుర్తించినప్పటికీ, దానిని ఒప్పుకోవడం మానేసి, మళ్ళీ మరిన్ని ఆరోపణలకు తెరతీయాల్సి వస్తోంది.

ఇటీవలే వైజాగ్‌లో ఒక పోలీసు అధికారిని, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు దౌర్జన్యం చేసేసారంటూ స్వయంగా చంద్రబాబే ట్విట్టర్‌కెక్కేసారు. ఆయన భజన బృందం మొత్తం లోకేష్‌బాబుతో సహా ఆయన్ను అనుసరించేసింది. అయితే ఇదేం విడ్డూరం నేను కింద పడిపోతే వాళ్ళులేపారు.. ఇదంతా అబద్దం అంటూ సదరు పోలీసాయనే మీడియా ముందుకొచ్చి ఘొల్లుమన్నారు. కానీ అబ్బబ్బే అదేం కాదు.. మిమ్మల్ని కొట్టేసారంటే, కొట్టేసారంతే.. మీరు ఒప్పుకోవాల్సిందే.. అంటూ టీడీపీ నాయకులు చేస్తున్న సర్వహంగామాల ఎపిసోడ్‌ మరింతగా నవ్వులు పూయిస్తోంది. ఒక వేళ దౌర్జన్యం చేస్తే చూస్తూ ఊరుకోవడానికి ఆయనేమీ సామాన్యుడు కాదు, స్వయంగా పోలీసాయన. ఆయనే వచ్చి జరిగింది చెబుతున్నాడు. అయినా గానీ సదరు వ్యవహారాన్ని మరింతగా ఫోకస్‌ చేసి ప్రచారం పొందాలన్న ప్రయత్నాలను చేస్తుండడం పట్ల ప్రజలు ముక్కునవేలేసుకుంటున్నారు.

గతంలో కూడా ట్విట్టర్‌ ద్వారా చేసిన పలు నవ్వుతెప్పించే అంశాల్ని ఇప్పుడు మరోసారి గుర్తు చేసుకుంటున్నారు. ప్రభుత్వం మీద బురదజల్లే ఏ ఒక్క అవకాశాన్ని కూడా చంద్రబాబు వదులుకోవడం లేదనడానికి ఇటువంటివే నిదర్శనంగా పలువురు పేర్కొంటున్నారు. అయితే ఈ తతంగా ద్వారా చంద్రబాబుకు వచ్చే ప్రచారం మాట పక్కన పెడితే మరింత పలుచనవుతున్నారని బాధపడేవారు కూడా లేకపోలేదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి