iDreamPost

ప్రేక్షక పాత్రకే ఇక చంద్రబాబు పరిమితమా..?

ప్రేక్షక పాత్రకే ఇక చంద్రబాబు పరిమితమా..?

కరోనా వైరస్‌ అన్నింటినీ మార్చేసింది. ప్రజల జీవన విధానంతోపాటు వ్యాపార, వాణిజ్య కార్యకలాపాల తీరును మార్చింది. వాటితోపాటు రాజకీయ కార్యకలాపాలు కూడా కొత్త పంథాలో సాగుతున్నాయి. వర్చువల్‌ మీటింగ్‌లు, జూమ్‌ సమావేశాలు, వీడియో కాన్ఫరెన్స్‌లు.. ఇలా సాగుతున్నాయి రాజకీయాలు. ఈ దిశగా రాజకీయాలు చేయడం అందరి కన్నా ముందుగా ప్రారంభించిన ఘనత టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు దక్కుతుంది.

ఆన్‌లైన్‌ రాజకీయం చేస్తున్న చంద్రబాబు.. క్షేత్రస్థాయి పర్యటనలు, కార్యక్రమాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు. కెప్టెన్‌గా మైదానంలో టీంను నడిపించాల్సిన చంద్రబాబు.. తమ నేతలను ఆడిస్తూ ఆయన మాత్రం గ్యాలరీలో కూర్చుని ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. హైదరాబాద్‌లోని తన రాజభవనం నుంచి ఏపీ రాజకీయాలను ఆన్‌లైన్‌ సాగిస్తున్న చంద్రబాబు.. అడపా దడపా ఆఫ్‌లైన్‌లో చేసే రాజకీయాలకు కూడా దూరంగా ఉంటున్నారు. బహుసా కరోనా భయం వల్ల చంద్రబాబు ఇలా ప్రవర్తిస్తుండొచ్చు.

కరోనా బాధితులకు అందుతున్న చికిత్స, ఆహారం, సౌకర్యాలు పరిశీలించేందుకంటూ టీడీపీ ఆస్పత్రుల సందర్శన అనే కార్యక్రమం ఈ రోజు తలపెట్టింది. కోవిడ్‌ సమయంలో భౌతిక దూరం పాటిస్తూ.. తగిన జాగ్రత్తలు తీసుకుంటున్న తరుణంలో కోవిడ్‌ ఆస్పత్రుల సందర్శన అంటూ టీడీపీ ప్రకటించిన కార్యక్రమాన్ని చూసిన వారు ఆశ్చర్యపోయారు. ఈ కార్యక్రమం ఎలాగూ సాధ్యపడదు.. పోలీసులు అడ్డుకుంటారు.. కాబట్టి మనకు రావాల్సిన ప్రచారం వస్తుందనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని టీడీపీ అధినేత రూపొందించినట్లున్నారు.

నేతలను పంపుతామని చెప్పిన చంద్రబాబు.. తాను మాత్రం హైదరాబాద్‌లోని రాజభవనానికే పరిమితం అయ్యారు. టీడీపీ నేతలను పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేయడంతో.. జూమ్‌లోకి వచ్చిన చంద్రబాబు.. ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ఎప్పటిలాగే పొలిటికల్‌ మైలేజీకి యత్నించారు. ఆయన చేపట్టిన కార్యక్రమంలో నిజాయతీ ఉంటే.. చంద్రబాబు కూడా ఏదో ఒక ఆస్పత్రిని సందర్శించేందుకు వచ్చేవారు. కానీ అలా చేయకుండా.. నేతలను పంపుతామని చెప్పి.. ఆయన మాత్రం గ్యాలరీలో కూర్చున్నారు. మరి ఇలాంటి రాజకీయాలు ఎన్నాళ్లు సాగుతాయో..? వీటికి ఎప్పుడు శుభం కార్డు పడుతుందన్నది కరోనా వైరస్‌ తగ్గుదలపై ఆధారపడి ఉంది.

Also Read : బాబు, కేసీఆర్‌ మధ్య ఏం ఒప్పందం జరిగింది..?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి