iDreamPost

ఎవరి కోసం ఈ ముట్టడి?

ఎవరి కోసం ఈ ముట్టడి?

అధికారంలో ఉంటే కట్టడి, లేదంటే ముట్టడి …

చంద్రబాబు అధికారంలో ఉంటే వేదాలు వల్లిస్తుంటారు. ప్రజాస్వామ్యం గురించి భారీ ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు. గత ఐదేళ్ళు, ముఖ్యంగా అర్ధరాత్రి విజయవాడకు వచ్చిన దగ్గరనుండి, అమరావతి పేరుతో రాజధానికి భూసమీకరణ వరకూ ఆ తర్వాత నాలుగేళ్ళూ చంద్రబాబు చెప్పని ప్రజాస్వామ్య నీతులు లేవు. అభివృద్ధి అంటూ ధర్నాలు, నిరసనలు తీవ్రంగా వ్యతిరేకించారు. నిరసన అన్నా వారిపై ఉక్కుపాదం మోపారు.

భూసమీకరణతో ఉపాధి కోల్పోయిన రైతు కూలీలు, కౌలు రైతులు, చిన్న రైతులపై పోలీసు జులుం ప్రదర్శించారు. మొత్తం నాలుగేళ్ళలో ఒక్కరోజు కూడా రాజధాని గ్రామాల్లో నిరసనలు జరగనివ్వలేదు. సచివాలయం, అసెంబ్లీ రోడ్లపై ఒక్క నిరసన ప్రదర్శనకు కూడా అనుమతివ్వలేదు. నిరసనకారులను రాజధాని గ్రామాల్లోకి అడుగుపెట్టనివ్వలేదు. నిరసనలు అభివృద్ధి వ్యతిరేకం అన్నారు. సమ్మెలు, నిరసనలు జరిగితే పెట్టుబడులు రావు అన్నారు. కొత్తరాష్ట్రం, కష్టపడి పనిచేద్దాం. జపాన్ మోడల్ తీసుకొని ఇంకొంచెం ఎక్కువ పనిచేద్దాం అంటూ ఉపన్యాసాలు ఇచ్చారు.

Read Also: ముఖ్యమంత్రిని బలివ్వాలా వద్దా? చంద్రబాబు అనుచిత వాఖ్యలు.

కాపులకు టిడిపి ఇచ్చిన ఎన్నికల హామీ నిలపాలని కోరుతూ “చలో అమరావతి” పిలుపు ఇచ్చిన మాజీమంత్రి ముద్రగడ పద్మనాభంని గృహ నిర్బంధం చేశారు. ముద్రగడను, ఆయన భార్యను, కోడలిని ఇంట్లోకి ప్రవేశించి పోలీసులు చిత్రహింసలు పెట్టారు. నెలల తరబడి ముద్రగడ గృహనిర్బంధంలో ఉన్నారు. నెలల తరబడి కిర్లంపూడి గ్రామం పోలీసు పహారాలో ఉంది. కిర్లంపూడినుండి కనీసం పాదయాత్ర చేసేందుకు కూడా ముద్రగడకు అనుమతి ఇవ్వలేదు.

పశ్చిమగోదావరి జిల్లా తుందుర్రు గ్రామంలో ప్రజలు ఆక్వా పరిశ్రమకు వ్యతిరేకంగా పోరాటం చేస్తే ఉక్కుపాదంతో అణచివేశారు. మహిళలను నిర్దాక్షిణ్యంగా హింసించారు. ఇప్పుడు అమరావతి పేరుతో టిడిపి నేతలు ప్రచారంలో పెడుతున్న కొన్ని ఫోటోలు అప్పట్లో కిర్లంపూడి, తుందుర్రు గ్రామాల్లోనివే.ఒకే కుటంబంలో తల్లిని ఒక జైలు,కొడుకు మరో జైలు,కూతురు ఇంకో జైలు… కాన్సర్ ఉన్న ఒక మహిళను 90 రోజుల పాటు బెయిల్ ఇవ్వకుండా జైల్లో పెట్టారు.

Read Also: ప్రపంచ స్థాయి నుంచి – గ్రామ స్థాయికి పడిన చంద్రబాబు

మాదిగ రిజర్వేషన్ పోరాటం పేరుతో మందా కృష్ణ మాదిగ రెండుసార్లుగా అసెంబ్లీ ముట్టడి పిలుపు ఇస్తే ఉక్కుపాదంతో అణచివేశారు. కృష్ణమాదిగను ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిసర ప్రాంతాల్లోనే అరెస్టు చేసి పంపించేశారు. కార్యకర్తలను ఇటు ప్రకాశం బ్యారేజి, అటు మంగళగిరి, మూడోవైపు తాడికొండ దగ్గరే అరెస్టు చేసి వెలగపూడి పరిసర ప్రాంతాల్లోకి కూడా రానివ్వలేదు. అంతెందుకు, 29 గ్రామాల్లోని ఎమ్మార్పీఎస్ కార్యకర్తలను ముందురోజే గృహనిర్బంధం చేయించారు.

ఉద్యమాలు రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా అడ్డుకుంటాయని ప్రజలకు నీతులు చెప్పారు. రాష్ట్రంలో జరిగే ప్రతి ఉద్యమం రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేసే కుట్రలో భాగమే అన్నారు. తాను కుటుంబాన్ని, మనవణ్ణి వదిలేసి రేయింబవళ్ళు రాష్ట్రం కోసం కష్టపడుతుంటే ప్రతిపక్షాలు రాక్షసుల్లా అడ్డుకుంటున్నాయని ఆరోపణలు చేశారు. తాను ఫైళ్లు చేతిలో పెట్టుకొని దేశదేశాలు తిరిగి పెట్టుబడులు ఆకర్షిస్తుంటే ప్రతిపక్షాలు నిరసనల పేరుతో అడ్డుకుంటున్నాయని చెప్పారు.

కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి పెట్టుబడులు తేవడం కోసం స్నానం కూడా చేయకుండా విమానాల్లోనే ముఖం కడుక్కొని తిరుగుతున్నానని, ప్రతిపక్షాలు మాత్రం నిరసనల పేరుతో అడ్డుతగులుతున్నాయని చెప్పారు. ఇవన్నీ గత నాలుగేళ్ళుగా చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో చెప్పిన కబుర్లు.

Read Also: పార్టీ అధ్యక్షుడు అలా.. ఎమ్మెల్యే ఇలా.. చర్యలు ఉంటాయా..?

ఇప్పుడు అధికారం కోల్పోయాక అవే అమరావతి రోడ్లపై, ప్రత్యేకించి అసెంబ్లీ గేట్లముందు నిరసన ప్రదర్శనలు చేసిన మొదటి వ్యక్తి చంద్రబాబు. వెలగపూడి రోడ్లపై మొదటి నిరసన ప్రదర్శన చేసిన వ్యక్తి చంద్రబాబు. ఇప్పుడు అసెంబ్లీ ముట్టడికి పిలుపు ఇచ్చారు. ఏ చర్యలైతే రాష్ట్రాభివృద్ధికి విఘాతం అన్నారో, ఎలాంటి నిరసనల వల్ల రాష్ట్రానికి రావలసిన పెట్టుబడులు ఆగిపోతాయి అన్నారో అవే నిరసనలు ఇప్పుడు ఆయన ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ప్రజలను స్వయంగా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.

రాష్ట్రంలోని జిల్లాలు తిరుగుతున్నారు. ఎక్కడికక్కడ నిరసనలు చేయిస్తున్నారు. తన పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టి హింసకు ప్రేరేపిస్తున్నారు. “సూసైడ్ స్క్వాడ్” లు తయారవుతాయి అని బహిరంగంగా హెచ్చరిస్తున్నారు.”ఇలాంటి ముఖ్యమంత్రిని బాలి ఇవ్వాలా లేదా” అంటు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు చెప్పేవి అన్నీ గతంలో ఆయన తప్పు పట్టిన అంశాలే. అధికారంలో ఉన్నప్పుడు ఏది తప్పు అన్నారో, ఇప్పుడు అధికారం కోల్పోయేసరికి స్వయంగా దగ్గరుండి అవేపనులు చేస్తున్నారు. పైగా ప్రజలను రెచ్చగొడుతున్నారు.

Read Also: ఏపీ కేబినెట్‌ తీర్మానాలు ఇవే..

అమరావతి ఇప్పుడు చంద్రబాబు ఎజండా అయింది. అది టిడిపి ఎజెండా. అది టిడిపి నాయకుల ఎజెండా. ఇందులో ప్రజా సంక్షేమం శాతం నామమాత్రం. అమరావతిని రాజధానిగా ప్రకటించక ముందే చంద్రబాబు, ఆయన బినామీలు ఇక్కడ రైతుల దగ్గరనుండి తక్కువధరలకు భూములు కొనుగోలు చేశారు. ఇదే ఇన్సైడర్ ట్రేడింగ్ అని ప్రభుత్వం చెపుతోంది. అందుకు సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయంటున్నారు. రేపో, ఎల్లుండో ఆ ఆధారాలను విచారణ సంస్థకు అప్పగించే ప్రయత్నాలు జరగొచ్చు. ఆయన అవినీతి బయట పడొచ్చు. అదే ఆయన భయం. ఆ భయంతోనే ఇప్పుడు ఉద్యమం చేస్తున్నారు.పోలింగ్ ముగిసిన తరువాత ఈవీఎంల మీద దేశవ్యాప్త ఉద్యమం అని చేసిన హడావుడికి ఇప్పుడు చేస్తున్న ఉద్యమానికి ఏమాత్రం తేడా లేదు.ఓటమికి కారణం గా ఈవీఎం లను చూపాలనుకున్నట్లే అమరావతిలో జరిగిన అవకతవకల మీద “నా మీద రాజకీయ కక్ష” అని చెప్పుకోవటానికి ఈ ఉద్యమం.

ఇప్పుడు ప్రభుత్వం అధికార వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో చర్యలు చేపడితే కోట్ల పెట్టుబడులు కోల్పోతున్నామని భయం పట్టుకుంది. అందుకే ఇప్పుడు చంద్రబాబుకు ఉద్యమాలు అవసరం అయ్యాయి. ఇప్పుడు రాష్ట్రంలోకి పెట్టుబడులు రాకపోయినా పర్లేదు. తన పెట్టుబడులకు రక్షణ కావాలి. అదీ చంద్రబాబు లక్ష్యం. అందుకోసమే ఆయన ఉద్యమం.

ఇన్సైడర్ ట్రేండింగ్ వలన అమరావతిని మారుస్తున్నారనిప్రభుత్వం చెప్తున్నట్లు చంద్రబాబు ప్రచారంచేస్తున్నారు. “వికేంద్రీకరణ” అన్న పెద్ద లక్ష్యం మీద ప్రజల దృష్టి వెళ్లకుండా బినామీ భూములు,కులం అని అప్రాధాన్య వాదనలను హైలైట్ చేస్తున్నారు.

Read Also: బిజెపి నేతల చెంప పగలగొట్టిన మహిళా కలెక్టర్

తాను అధికారంలో ఉంటే అసెంబ్లీ ముట్టడి లాంటి కార్యక్రమాలను రాష్ట్ర ప్రగతి నిరోధక చర్యలుగా అభివర్ణించిన చంద్రబాబు, ఇప్పుడు అధికారం కోల్పోగానే అదే అసెంబ్లీ ముట్టడికి పూనుకోవడం ఆయన ద్వంద్వ నీతిని తెలియజేస్తుంది. చంద్రబాబు ప్రాధాన్యత సొంత అవసరాలు,రాజకీయాలే తప్ప రాష్ట్రం కాదు అని ఆయన గత 35 రోజులుగా చేస్తున్న ధర్నాలు,ఉద్యమాలు చూస్తే అర్ధమవుతుంది. అందుకే గడచిన ఐదేళ్ళు ఎలాంటి చర్యలు తప్పు అన్నారో, ఇప్పుడు అలాంటి చర్యలే స్వయంగా చేస్తున్నారు. తాను అధికారంలో ఉన్నప్పుడు తప్పు అయిందే అధికారం కోల్పోయాక ఒప్పు అయింది.

చంద్రబాబు చెప్పే పౌర స్వేచ్ఛ,ప్రజాస్వామిక హక్కుల మాటలకు 20 సంవత్సరాల తరువాత కూడా బషీర్ భాగ్ ఉదంతం కన్నీరు పెడుతూనే ఉంటుంది.. ఉద్యమకారులను గురి చూసి కాల్చిన ఆనాటి దుర్మార్గం చంద్రబాబు తదనంతరం కూడా ప్రజలు మర్చిపోరు.

ఇదొక అస్తిత్వ ఉద్యమం. అస్తిత్వం చంద్రబాబుకు. అస్తిత్వం తెలుగుదేశం పార్టీకి. అందుకే ఈ ఆరాటం. అందుకే ఈ పోరాటం.ఇది చంద్రబాబు అభిజాత్య ఉద్యమం..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి