iDreamPost

టీడీపీ అధినేత అలా… కార్యకర్తలు ఇలా, ఇళ్ల పంపిణీపై జగన్ కి జైజేలు కొడుతున్న టీడీపీ శ్రేణులు

టీడీపీ అధినేత అలా… కార్యకర్తలు ఇలా, ఇళ్ల పంపిణీపై జగన్ కి జైజేలు కొడుతున్న టీడీపీ శ్రేణులు

ఏకకాలంలో కోటి 24 లక్షల మందికి ప్రయోజనం కల్పించే పథకం ఇప్పటి వరకూ ఎన్నడూ ఊహాలకందని విషయం. అలాంటిది జగన్ ప్రభుత్వం తీసుకున్న చొరవతో ఇళ్లు లేని పేదలు కనిపించని ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించబోతోంది. దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి ఒక నిర్ణయం అరుదైన విషయం. అందుకే ఇప్పుడు ఊరూవాడ జగన్ నామస్మరణ వినిపిస్తోంది. జగన్ కి ఆడపడుచులంతా హారతులు పడుతున్నారు. తమ జీవితకా స్వప్నాన్ని నెరవేరస్తున్న నేతగా కొనియడుతున్నారు. ఇది టీడీపీకి కంటగింపుగా మారింది.

ప్రభుత్వ పక్షానికి ఇంత సానుకూలత, ప్రభుత్వాధినేత పట్ల ఇంతటి ఆదరాభిమానాలు సహజంగానే విపక్షాలకు గిట్టవు. అందులోనూ తెలుగుదేశం పార్టీ నేతలకు అసలు జీర్ణంకావన్నది జగమెరిగిన సత్యం. అందుకే అందరికీ ఇళ్లు అందిస్తున్న బృహత్తర ప్రణాళికపై విమర్శలకు పూనుకుంటున్నారు. చంద్రబాబు తన జీవితకాలం మొత్తం కలిపినా చేయనంత మేలు జగన్ కేవలం ఏడాదిన్నర పాలనతో కలుగుతుందన్న సంతృప్తి సామాన్యుల్లో ఉంటే దానిని సహించలేని టీడీపీ విస్మయకర వ్యాఖ్యాలు చేస్తోంది. అభివృద్ధి అంటే సామాన్యుడి ముందడుగు మాత్రమేనని నమ్మిన జగన్ దానికి అనుగుణంగా అడుగులు వేస్తున్నారు. ఏకకాలంలో రూ 60వేల కోట్ల ఖరీదు చేసే స్థలాల పంపిణీకి శ్రీకారం చుట్టారు. తద్వారా పేదలందరికీ రెండు దశల్లో ఇళ్ల నిర్మాణం జరిగితే ఒక్కో కుటుంబానికి ఏడాదికి కనీసంగా రూ. 50వేలకు పైగా ఆదా అయ్యే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం అద్దె ఇళ్లలో ఉంటున్న వారు సగటున నెలకు రూ. 4వేలు చెల్లిస్తున్నా వారికి ఏడాదికి రూ. 48వేలకు పైగా మిగులుతుంది. పేదలకు మిగిలిన ఈ మొత్తం మార్కెట్లో ఇతర సరుకుల కొనుగోలు వైపు మళ్లుతుంది. తద్వారా కొనుగోలు శక్తి మూలంగా మార్కెట్ పుంజుకుంటుందన్నది ఆర్థికవేత్తల అభిప్రాయం. ఇంతటి ముందుచూపుతో ప్రభుత్వ మార్గదర్శకత్వం వహించి ప్రజలను అభివృద్ధి పథాన నడిపిస్తుంటే టీడీపీ నేతలు తట్టుకోలేకపోతున్నట్టు కనిపిస్తోంది.

ప్రణాళిక ప్రకారం ఇళ్ల పథకం పూర్తయితే రాబోయే మూడేళ్ల తర్వాత రాష్ట్ర భవితవ్యమే మారబోతోందనడంలో సందేహం లేదు. ప్రజల జీవితాలకు భరోసా, అందరికీ సొంత ఇంటితో ఆసరగా ఈ ప్రభుత్వం నిలుస్తుండడం ఓ సంచలన మార్పునకు దోహదం చేయబోతోంది. అయినప్పటికీ అందరికీ ఇళ్ల పథకం విషయంలో టీడీపీ తొలి నుంచి మొకాలడ్డే ప్రయత్నం చేసింది. బీజేపీ నేతలు కూడా కొందరు హైకోర్టులో పిటీషన్ వేసి చివరి క్షణంలో సైతం అడ్డుపుల్ల వేసే యత్నం చేశారు. పేదలకు ఇళ్ల పంపిణీ విషయంలో టీడీపీ చేసిన ప్రయత్నాల మూలంగా 3.5లక్షల మంది స్థలాలు న్యాయవివాదాల్లో ఉన్నాయి. వాటికి క్లియరెన్స్ వచ్చిన తర్వాత పంపిణీ చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. అంటే అందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి సహకరించకపోగా, అడ్డుకుని మూడున్నర లక్షల మందికి నిరాశ కల్పించిన ఘనత ప్రతిపక్ష చంద్రబాబు నాయకత్వానిదేననే అభిప్రాయం వినిపిస్తోంది.

పైగా ఇళ్ల స్థలాల్లో ఏకంగా 6వేల కోట్లు అవినీతి జరిగిందని టీడీపీ ఆరోపణలు గుప్పించడం హాస్యాస్పదంగా మారింది. అందుకు తోడుగా తాము ఇళ్లు కాదు ఊళ్లు నిర్మిస్తున్నామని సీఎం చెబుతంటే ఊరికి చివరిలో స్థలాలు ఇచ్చారు.. దూరంగా ఇచ్చారు అంటూ నంగనాచి కబుర్లు టీడీపీ నేతలు వినిపిస్తున్నారు. వాస్తవానికి పేదలకు ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వ భూమిని అందుబాటులో ఉన్నంత మేరకు సేకరించారు. మిగిలిన కొంత భాగం కొనుగోలు చేసి అందిస్తున్నారు. అయినా దానికి వక్రభాష్యాలు చెప్పే ప్రయత్నాలు టీడీపీ నేతలు చేస్తుంటే కింది స్థాయి శ్రేణులు మాత్రం తమకు ఇళ్లు దక్కుతున్నందుకు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ వాటా గృహాలు ఎక్కడ వచ్చాయో చూసుకునే పనిలో ఉన్నారు. అధినేత విమర్శలను పక్కన పెట్టి వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జగన్ నాయకత్వాన దక్కిన ప్రతిఫలాన్ని ఆస్వాదించే పనిలో పడ్డారు. విజయవాడకు చెందిన కాట్రగడ్డ బాబు వంటి టీడీపీ నేతలు స్వయంగా జగన్ కి బ్యానర్లు కట్టి అభినందనలు తెలిపారు. ఇలా టీడీపీ కార్యకర్తలకు కూడా ప్రయోజనం కల్పించే పథకంతో జగన్ అందరి నేతగా మారుతుంటే టీడీపీ నేతలు మాత్రం ఆఫీసులో కూర్చుని విమర్శలు గుప్పించడం విస్మయకర అంశంగా తయారవుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి